
యాక్సిస్ బ్యాంక్ లాభం 1,916 కోట్లు
క్యూ2లో 19 శాతం వృద్ధి
ముంబై: ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలానికి రూ.1,916 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక నికర లాభం(రూ.1,611 కోట్లు)తో పోల్చితే 19 శాతం వృద్ధి సాధించామని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. గత క్యూ2లో రూ.10,550 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.12,001 కోట్లకు పెరిగిందని వివరించింది.
బ్యాంక్ అసెట్ క్వాలిటీ క్షీణించింది. స్థూల మొండి బకాయిలు 1.34 శాతం నుంచి 1.38 శాతానికి. నికర మొండి బకాయిలు 0.44 శాతం నుంచి 0.48 శాతానికి పెరిగాయని యాక్సిస్ బ్యాంక్ పేర్కొంది. యాక్సిస్ సెక్యూరటీస్ యూరప్ సంస్థలోని పూర్తి వాటాను యాక్సిస్ క్యాపిటల్ నుంచి రూ.19 కోట్లకు కొనుగోలు చేశామని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ బ్యాంక్ షేర్ స్వల్పలాభంతో రూ.521 వద్ద ముగిసింది.