3 రోజుల్లో బాహుబలి-2 రిలీజ్: ఆ స్టాక్ అదుర్స్
తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మారుమోగించిన బాహుబలి సినిమా కంక్లూజన్ పార్ట్ ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ కు సిద్ధమవుతోంది. దాదాపు 9 వేల సిల్వర్ స్క్రీన్లలో మనల్ని అలరించడానికి వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో బాహుబలి-2 కిక్ మల్టిఫ్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్ లిమిటెడ్ స్టాక్ కు భలే జోషిచ్చింది. బీఎస్ఈలో పీవీఆర్ లిమిటెడ్ స్టాక్ 2.60 శాతం మేర లాభపడుతూ 1614 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఫిల్మ్ ఎంటర్ టైన్మెంట్ కంపెనీ పీవీఆర్. ఇది ముఖ్యంగా మూడు బిజినెస్ సెగ్మెంట్లలో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. మూవీ ఎగ్జిబిషన్, మూవీ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ను వంటి ఇతర కార్యకలాపాలను ఈ కంపెనీ అందిస్తోంది. ఏడాది ఏడాదికి కంపెనీ స్టాక్ 41.17 శాతం పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా దాదాపు 7508 కోట్లకు పెరిగినట్టు తెలిసింది.
మొత్తం కంపెనీకి చెందిన 28,614 షేర్లు చేతులు మారినట్టు వెల్లడైంది. మరో మూవీ డిస్ట్రిబ్యూటర్ ఐనాక్స్ లీజర్ మాత్రం స్వల్పంగా నష్టపోతోంది.ఇటీవలే బాహుబలి 2 విడుదల సందర్భంగా సిల్వర్ స్క్రీన్లపైకి వచ్చిన బాహుబలి 1కు కూడా మంచి స్పందనే వచ్చింది. రీ-రిలీజ్ ను పురస్కరించుకుని అప్పుడు కూడా మల్టిఫ్లెక్స్ ఆపరేటర్ల షేర్లు దుమ్మురేపాయి. మల్టిప్లెక్స్ ఆపరేటర్లకు మార్చి క్వార్టర్ ఎంతో లాభదాయకమైన త్రైమాసికమని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. దంగాల్, రాయిస్, కబాలి, జోలీ ఎల్ఎల్బీ2, బద్రినాథ్ కి దుల్హానియా వసూళ్లు ఈ కంపెనీ షేర్లకు భారీగా కలిసివచ్చిందని పేర్కొన్నారు.