సూపర్‌మ్యాన్.. సూపర్ వైరస్
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు తాజాగా సూపర్‌మ్యాన్, థోర్ వంటి సూపర్ హీరో క్యారెక్టర్లతో ఆన్‌లైన్ దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి క్యారెక్టర్ల పేర్లతో కూడిన హానికారక సాఫ్ట్‌వేర్‌లు, వైరస్‌లతో యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని, పాస్‌వర్డ్‌లను తస్కరిస్తున్నారు. సెక్యూరిటీ సర్వీసులు అందించే మెకాఫీ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. ‘అత్యంత మోసకారి సూపర్‌హీరో’ అపఖ్యాతిని సూపర్‌మ్యాన్ దక్కించుకున్నాడు.
సూపర్‌మ్యాన్ పేరుతో సెర్చి చేస్తే.. మోసాలు జరిగే ఆస్కారం ఉన్న సైట్లలోకి మళ్లే అవకాశాలు అత్యధికంగా 16.5 శాతం మేర ఉన్నాయి. ఉదాహరణకు సూపర్ మ్యాన్ .. టారెంట్ డౌన్‌లోడ్ అని, సూపర్‌మ్యాన్ అండ్ వాచ్ అని, సూపర్‌మ్యాన్ అండ్ ఫ్రీ యాప్ అని సెర్చి చేస్తే.. వ్యక్తిగత సమాచారం చోరీ చేసే విధంగా రూపొందిన సైట్లలోకి వెళ్లే రిస్కులు ఎక్కువగా ఉన్నాయి.
ఈ సైట్ల నుంచి పిక్చర్స్ లేదా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుంటే వాటితో పాటు వైరస్‌లు, మాల్‌వేర్‌లు కూడా మన సిస్టంలోకి డౌన్‌లోడ్ అవుతాయి. తాజాగా బ్యాట్‌మ్యాన్ వర్సస్ సూపర్‌మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సూపర్‌హీరోలిద్దరూ.. లిస్టులో టాప్ స్థాయికి చేరుకోవచ్చని మెకాఫీ పేర్కొంది. ఇటువంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే.. ఉచిత కంటెంట్‌ను, నమ్మశక్యం గాని విధంగా ఆఫర్లు ఇచ్చే వెబ్‌సైట్ల నుంచి దూరంగా ఉండాలని తెలిపింది.