స్టాక్ మార్కెట్లు మంచి ఊపుమీదున్నాయి. ఎప్పటికప్పుడు జీవితకాల గరిష్ఠ స్థాయిల్ని నమోదు చేస్తున్నాయి. చాలామంది వీటిలో ఇన్వెస్ట్ చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కాకపోతే స్టాక్ మార్కెట్లో నేరుగా ఇన్వెస్ట్ చేయటం చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం కనక చాలా మంది మ్యూచ్‌వల్ ఫండ్స్‌నే ఆశ్రయిస్తున్నారు. అయితే ఇక్కడో ప్రధాన ప్రశ్న ఉంది. మార్కెట్ నిండా రకరకాల సంస్థలు, రకరకాల ఫండ్లు ఉన్న నేపథ్యంలో అసలు ఏ మ్యూచ్‌వల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలి? మంచి ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి? అందరినీ వేధించే ఈ ప్రశ్నలకు సమాధానం ఒకసారి చూద్దాం...
మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో పెట్టడానికి ముందు.. ఇన్వెస్టరు తనకు తానుగా వేసుకోవాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. ఇప్పుడు నా వయసెంత? ఆదాయ వనరులేంటి? ఎందుకోసం ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను? పెట్టుబడిని ఎన్నాళ్లు కొనసాగించగలను? ఎన్నాళ్ల దాకా విక్రయించకుండా స్కీములో కొనసాగగలను? ఇదిగో ఈ ప్రశ్నలకు మనకు మనం ఎంత సంతృప్తికరమైన సమాధానాలను ఇచ్చుకోగలిగితే... మన రిస్కు సామర్థ్యాలు, పెట్టుబడి లక్ష్యాలపై అంతగా అవగాహన తెచ్చుకున్నవారమవుతాం. మన రిస్కు సామరర్థ్యాన్ని అంచనా వేయడానికి వయస్సు, ప్రస్తుత ఆదాయమనేవి చాలా కీలకం. ఇక ఎంత రిస్కు తీసుకోగలం, ఏ లక్ష్యం కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్న అంశాలపై స్పష్టత వస్తే.. అందుకు తగిన మ్యూచువల్ ఫండ్ స్కీమును ఎంచుకునేందుకు వీలవుతుంది. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ రకరకాల స్కీముల్ని ఆఫర్ చేస్తున్నాయి. వాటిల్లో ప్రధానమైనవి..
మనీ మార్కెట్ ఫండ్స్
ఈ ఫండ్స్ .. ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్ వంటి స్వల్పకాలిక ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటిని రిస్కు తక్కువగా ఉండే ఫండ్స్‌గా పరిగణిస్తారు.
ఈక్విటీ ఫండ్స్
ఇవి స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయిన దేశీ కంపెనీల షేర్లలోనే ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటిని గ్రోత్ ఫండ్స్‌గా కూడా వ్యవహరిస్తారు. ఒక మోస్తరు నుంచి అధిక రిస్కుగల ఫండ్స్‌గా వీటిని పరిగణిస్తారు.
డెట్
ఈ ఫండ్స్ కేవలం అతి తక్కువ రిస్కు ఉండే ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీస్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడం ద్వారా స్థిరమైన రాబడులు అందిస్తాయి. వీటిని ఇన్‌కమ్ ఫండ్స్‌గా కూడా వ్యవహరిస్తారు. ఇవి సాధారణంగా రిస్కు తక్కువగా ఉండే ఫండ్స్.
ఈ స్కీముల్లో ఇన్వెస్ట్ చేసేందుకు కొన్ని ఆప్షన్లు కూడా
ఉంటాయి. స్కీముతో పాటు సరైన ఆప్షన్‌ను కూడా
ఎంచుకుంటేనే లక్ష్యాలు సాధించగలం. ఆ ఆప్షన్స్ ఏంటంటే..
డివిడెండ్ పే అవుట్...
ఈ ఆప్షన్‌లో ఇన్వెస్టరుకు డివిడెండు చెల్లించడం జరుగుతుంది. తద్వారా సదరు స్కీమును హోల్డ్ చేసినంతకాలం మధ్య మధ్యలో ఇన్వెస్టరు చేతికి డివిడెండు రూపంలో రాబడి అందుతూ ఉంటుంది.
గ్రోత్ ఆప్షన్...
ఈ విధానంలో డివిడెండు చేతికి రాదు. సదరు సంస్థే ఆ డివిడెండును మరిన్ని షేర్లు కొనటానికి ఉపయోగిస్తుంది. తద్వారా ఎన్‌ఏవీ కూడా పెరుగుతుంటుంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు దీన్ని ఎంచుకుంటే శ్రేయస్కరం.
డివిడెండ్ రీ–ఇన్వెస్ట్‌మెంట్...
పలువురు ఎంచుకునే ఈ విధానంలో.. డివిడెండు చేతికి రాదు. సదరు సంస్థే ఆ డివిడెండుతో అదే స్కీములో మరిన్ని యూనిట్లు కొనుగోలు చేస్తుంది. దాంతో యూనిట్ల సంఖ్య పెరుగుతుంది.
వీటిలో డివిడెండ్ పే అవుట్ ఆప్షన్ ఎంచుకుంటే ఎప్పటికప్పుడు డివిడెండ్ చేతికి వస్తుంది కనుక మన పెట్టుబడి పెరిగే అవకాశాలు తక్కువ. అదే రీ–ఇన్వెస్ట్‌మెంట్, గ్రోత్ ఆప్షన్‌లు ఎంచుకుంటే మన చేతికి డివిడెండ్ రాదు. కానీ పెట్టుబడి పెరుగుతుంది. మన అవసరాన్ని బట్టి కావాల్సింది ఎంచుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment