
న్యూఢిల్లీ: కేంద్రం స్థాయిలో ఆర్థిక వేత్తల రాజీనామా పరంపర కొనసాగుతోంది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసి 24 గంటలు కూడా గడవకముందే ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలిలో (పీఎంఈఏసీ) సభ్యుడైన ప్రముఖ ఆర్థిక నిపుణుడు సుర్జిత్ భల్లా తాను సైతం రాజీనామా చేసినట్టు మంగళవారం ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి పీఎంఈఏసీ తాత్కాలిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు భల్లా ట్వీట్ చేశారు. భల్లా రాజీనామాను ప్రధానమంత్రి ఆమోదించినట్టు ఆయన కార్యాలయ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. 1952 నుంచి భారత్‌లో ఎన్నికలు అనే పుస్తకంపై తాను పనిచేస్తున్నానని, సీఎన్‌ఎన్ ఐబీఎన్‌లో తాను చేరిన డిసెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని భల్లా తెలిపారు.
ప్రభుత్వ విధానాలకు మద్దతుదారుగా ఉండే ఈ ఆర్థిక వేత్త ఇటీవలి జీడీపీ గణాంకాల ప్రకటన విషయంలో నీతి ఆయోగ్ పాత్రపై విమర్శలు చేశారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ సమక్షంలో కేంద్ర ముఖ్య గణాంక అధికారి ప్రవీణ్ శ్రీవాస్తవ గత నెల 28న సెప్టెంబర్ క్వార్టర్ జీడీపీ గణాంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై భల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరుగురు సభ్యుల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి బిబేక్ దేబ్రాయ్ నేతృత్వం వహిస్తున్నారు. గతంలో ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా కూడా తమ పదవులకు రాజీనామా చేయడం తెలిసిందే.