
న్యూఢిల్లీ: టెలికం రంగంలో టారిఫ్‌లపరమైన పోటీతో దిగ్గజ టెల్కో భారతి ఎయిర్‌టెల్ ఆదాయాలు వరుసగా ఆరో క్వార్టర్‌లోనూ క్షీణించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 77 శాతం క్షీణించి రూ. 343 కోట్లకు పరిమితమైంది.
గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ లాభం రూ. 1,461 కోట్లు. సీక్వెన్షియల్ ప్రాతిపదికన మాత్రం నికర లాభం జూన్‌లో నమోదైన రూ. 367 కోట్లతో పోలిస్తే 6.5 శాతం క్షీణించింది. టెలికం రంగంలో ఆర్థిక ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉందని, కాల్ కనెక్ట్ చార్జీలు తగ్గడంతో రాబోయే త్రైమాసికంలో ఇది మరింతగా పెరిగే అవకాశముందని ఎయిర్‌టెల్ హెచ్చరించింది. 2013 జనవరి–మార్చి త్రైమాసికం తర్వాత తాజా సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన లాభమే అత్యల్పం. చౌక టారిఫ్‌లతో సంచలనం సృష్టించిన కొత్త టెల్కో రిలయన్స్ జియోతో ఎయిర్‌టెల్ సహా ఇతర టెలికం కంపెనీలు పోటీపడుతున్న సంగతి తెలిసిందే.
10 శాతం క్షీణించిన ఆదాయం ..
ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని 17 దేశాల్లో కార్యకలాపాలు ఉన్న ఎయిర్‌టెల్ మొత్తం ఆదాయం క్యూ2లో సుమారు 10 శాతం క్షీణించి రూ. 24,651.50 కోట్ల నుంచి రూ. 21,777 కోట్లకు తగ్గింది. భారత్‌లో ఆదాయాలు 13 శాతం తగ్గి రూ. 16,728 కోట్లుగా నమోదైంది. ఆదాయాలు రెండంకెల స్థాయిలో క్షీణిస్తుండటంతో పరిశ్రమపై ఆర్థికపరమైన ఒత్తిడి కొనసాగుతోందని భారతి ఎయిర్‌టెల్ ఎండీ, సీఈవో (భారత్, దక్షిణాసియా) గోపాల్ విఠల్ తెలిపారు.
ఇక ఇంటర్‌కనెక్ట్ యూసేజీ చార్జీలు కూడా తగ్గించడంతో రాబోయే త్రైమాసికంలో ఆదాయాలపై మరింతగా ప్రభావం పడగలదని పేర్కొన్నారు. ఇది ఇటీవలి కాలంలో చూసినట్లుగా కొన్ని టెల్కోల మధ్య విలీనాలు, మరికొన్నింటి నిష్క్రమణలకు దారితీయగలదని ఆయన అభిప్రాయపడ్డారు. తీవ్రమైన పోటీ మధ్య మార్కెట్ వాటా పెంచుకునే లక్ష్యానికి తాము కట్టుబడి ఉన్నామని విఠల్ చెప్పారు.
మరోవైపు, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సంస్థ నికర రుణం రూ. 87,840 కోట్ల నుంచి రూ. 91,480 కోట్లకు చేరింది. వడ్డీ వ్యయాలు రూ. 1,603 కోట్ల నుంచి రూ. 1,905 కోట్లకు పెరిగింది. ఆఫ్రికా మార్కెట్లో ఆదాయాలు 2.8 శాతం, నిర్వహణ లాభాల మార్జిన్లు కూడా 9 శాతం మేర మెరుగుపడ్డాయని, నిరంతరం వ్యయ నియంత్రణ చర్యలు ఇందుకు దోహదపడ్డాయని విఠల్ చెప్పారు.
ఇన్‌ఫ్రాటెల్‌లో వాటాలపై ఇన్వెస్టర్ల ఆసక్తి ..
మొబైల్ టవర్ల వ్యాపార విభాగం భారతి ఇన్‌ఫ్రాటెల్‌లో గణనీయమైన వాటాలు కొనుగోలు చేసేందుకు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు సంప్రదిస్తున్నట్లు ఎయిర్‌టెల్ మరో ప్రకటనలో తెలిపింది. ఈ డీల్ గానీ కుదిరిన పక్షంలో ఇన్‌ఫ్రాటెల్‌లో యాజమాన్య హక్కులు సదరు ఇన్వెస్టర్లకు దఖలుపడతాయని పేర్కొంది. డేటా కవరేజీ, సామర్థ్యాల పెంపు కోసం రెండో త్రైమాసికంలో పెట్టుబడులు మరింతగా పెంచినట్లు సంస్థ వెల్లడించింది.
మంగళవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు సుమారు ఒక్క శాతం వృద్ధితో దాదాపు రూ. 498 వద్ద ముగిసింది. ఆర్థిక ఫలితాలు మంగళవారం స్టాక్ మార్కెట్లు ముగిశాక వెల్లడయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment