ఆల్‌టైం హైకి ఎయిర్‌టెల్‌ షేరు | Bharti Airtel Shares hit Record High | Sakshi
Sakshi News home page

జీవితకాల గరిష్టానికి ఎయిర్‌టెల్‌ షేరు

Published Tue, May 19 2020 12:25 PM | Last Updated on Tue, May 19 2020 1:21 PM

Bharti Airtel Shares hit Record High - Sakshi

నాలుగో త్రైమాసికంలో నష్టాలను ప్రకటించినప్పటికీ.., టెలికాం రంగ దిగ్గజం ఎయిర్‌ టెల్‌ కంపెనీ షేరు మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 10శాతం లాభపడింది. తద్వారా షేరు తన జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. కంపెనీ నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం 2019-20 ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మార్చి 31తో ముగిసిన క్వార్టర్లో రూ.5,237 కోట్ల నికర నష్టాలు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. 

ఐనప్పటికీ పలు బ్రోకరేజ్‌ సంస్థలు షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించాయి. ఫలితంగా ఎయిర్‌టెల్‌ షేరు సోమవారం ముగింపు(రూ.538.15)తో పోలిస్తే దాదాపు 4శాతం లాభంతో రూ.559.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో 10శాతం లాభపడి రూ.591.95 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం 11గంటలకు షేరు మునుపటి ముగింపుతో పోలిస్తే 9శాతం లాభంతో రూ.585.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట గరిష్ట ధరలు వరుసగా రూ.314.05, రూ.591.95 ఉన్నాయి. 

ఎయిర్‌టెల్‌కు 5,237 కోట్ల నష్టాలు 

ఎయిర్‌టెల్‌ షేరుపై బ్రోకరేజ్‌ల వ్యూ:- 

మోర్గాన్‌ స్టాన్లీ: ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు రాబడి (ఏఆర్‌పీయూ) రూ.123 నుంచి రూ.154కు పెరిగింది. ఓవరాల్‌ సబ్‌స్క్రైబర్లు పెరిగారు. డాటా వినియోగం నుంచి వచ్చే ఆదాయం అంచనాలకు మించి పెరిగింది. అయితే వన్‌టైమ్‌ స్పెక్ట్రమ్‌ చార్జీలకు కేటాయింపులు మాత్రం ప్రతికూలంగా ఉన్నాయి. షేరుకు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తూ షేరు టార్గెట్‌ ధరను రూ.575గా పెంచుతున్నాము.

సీఎల్‌ఎస్‌ఏ: భారత్‌లో ఆదాయం అంచనాలకు మించి నమోదైంది. ఆఫ్రికాలోనూ ఆశించిన స్థాయిలో గణాంకాలు నమోదు కావడం ఆశ్చర్యపరిచింది. గతంలో షేరుకు కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నాము. షేరు కొనుగోలు టార్గెట్‌ ధరను రూ.670లకు పెంచుతున్నాము. 

క్రిడెట్‌ స్వీస్‌: క్వార్టర్‌ టు క్వార్టర్‌ ఏఆర్‌పీయూ 14శాతం వృద్ధిని సాధించింది. అధిక టారీఫ్‌ విధింపు కంపెనీపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేకపోయింది. డాటా వినియోగంతో అదనపు సబ్‌స్క్రైబర్లు పెరుగుదల అంశాలను పరిశీలిస్తే ఈ అంశం స్పష్టమవుతోంది. షేరు కొనుగోలు టార్గెట్‌ ధరను రూ.600గా నిర్ణయించాం. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement