ఎయిర్ టెల్ షేర్ల బైబ్యాక్ పై 27న నిర్ణయం
న్యూఢిల్లీ : భారతీ ఎయిర్ టెల్ ఈ నెల 27న జరుపనున్న బోర్డు సమావేశంలో ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ను పరిగణలోకి తీసుకోనుంది. ఎంత మొత్తంలో షేర్లు బైబ్యాక్ చేయనుందో వెల్లడికాలేదు. ఈ సమావేశంలో కంపెనీ బైబ్యాక్ ఈక్విటీ షేర్ల పరిశీలనతో పాటు 2016 మార్చి 31న ముగిసిన ఆర్థిక సంవత్సర తుది డివిడెంట్ పై కూడా నిర్ణయం తీసుకోనున్నట్టు బీఎస్ఈ సెన్సెక్స్ కు భారతీ ఎయిర్ టెల్ కంపెనీ నివేదించింది. మార్చి 31న ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి పబ్లిక్ షేర్ హోల్డింగ్ 33.21 శాతం ఉండగా, ప్రమోటర్లు వాటా 66.74 శాతం కలిగి ఉన్నారు.
భారత్ లోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ గా ఉన్న భారతీ ఎయిర్ టెల్ ఓపెన్ మార్కెట్ ట్రేడ్ డీల్ ద్వారా 5శాతం ఇన్ ఫ్రాటెల్ టవర్ వాటాను అమ్మకం పెట్టనుంది. ఈ డీల్ తో రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల వరకూ రాబట్టనుంది. ఈ వాటా అమ్మకం కేవలం కంపెనీ రుణాన్ని తగ్గించుకోవడానికే చేపట్టనుందని తెలుస్తోంది. కానీ వాటా అమ్మకం ఎప్పుడు చేపడుతుందో కంపెనీ వెల్లడించలేదు. 2015 డిసెంబర్ నాటికి ఎయిర్ టెల్ నికర రుణం రూ.78,816 కోట్లుగా ఉంది.