
భారత్ లో బెల్ హెలికాప్టర్ల అసెంబ్లింగ్..
టెక్స్‌ట్రాన్ ప్రెసిడెంట్ ఇందర్‌జిత్ సియాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీలో ఉన్న యూఎస్ కంపెనీ టెక్స్‌ట్రాన్ భారత్‌లో బెల్ 407 మోడల్ హెలికాప్టర్లను తయారు చేయాలని కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంలో ఈ మోడల్ క్యాబిన్లను కంపెనీ రూపొందిస్తోంది. వీటిని యూఎస్, కెనడాలను ఎగుమతి చేస్తోంది. నెలకు నాలుగు క్యాబిన్లను తయారు చేయగల సామర్థ్యం ఉంది. దీనిని ఏడాదిలో 10 యూనిట్లకు పెంచుతోంది. 2018-19 నాటికి మొత్తం హెలికాప్టర్‌ను దేశీయంగా అసెంబుల్ చేయాలన్నది లక్ష్యమని సంస్థ ప్రెసిడెంట్, ఎండీ ఇందర్‌జిత్ సియాల్ బుధవారమిక్కడ ఏవియేషన్ షో సందర్భంగా మీడియాకు తెలిపారు.
బెంగళూరు డెవలప్‌మెంట్ సెంటర్‌లో 500 మంది నిపుణులు పనిచేస్తున్నారు. ఇక తయారీ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలతో సంస్థ చర్చిస్తోంది. మానవ వనరుల లభ్యత, ప్రభుత్వ సహకారం లభించే చోట ప్లాంటును నెలకొల్పుతామని ఆయన స్పష్టం చేశారు. భారత మిలిటరీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. పెద్ద ఎత్తున బెల్ 407 హెలికాప్టర్లను సైన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. బెల్ హెలికాప్టర్, సెస్నా, బీచ్‌క్రాఫ్ట్ తదితర బ్రాండ్స్‌లో ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను టెక్స్‌ట్రాన్ తయారు చేస్తోంది.