
ఇన్ఫోసిస్‌లోనూ ఉద్యోగాల కోత!!
⇔ పనితీరు ఆధారంగానే ఉంటుంది
⇔ ఇది ఏటా రొటీన్‌గా జరిగేదే: ప్రతినిధి
⇔ అమెరికన్లకు ఉద్యోగాలివ్వటమే కారణమా?
బెంగళూరు: ఉద్యోగులను ఇంటికి పంపే విషయంలో ఐటీ దిగ్గజాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. కాగ్నిజెంట్, విప్రో బాటలోనే ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా పయనిస్తోంది. దీంతో 2008–10 నాటి డౌన్‌ట్రెండ్ కనిపిస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ఫోసిస్‌లో మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగాల్లో కోత ఉండొచ్చని, ఇది వందల సంఖ్యలో ఉండవచ్చని విశ్వసనీయంగా తెలిసింది. నిజానికి ఇన్ఫోసిస్ ఇటీవలే ఒక ప్రకటన చేస్తూ... వచ్చే రెండేళ్లలో 10,000 మంది అమెరికన్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని, అమెరికాలో మరో నాలుగు కేంద్రాలను కూడా ఆరంభిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండే మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులను కొందరిని ఇంటికి పంపే అవకాశం ఉందని ఆ కంపెనీ వర్గాలు ధ్రువీకరించాయి.
పనితీరు ఆధారంగానే చర్యలు
‘‘ఉద్యోగుల పనితీరును మేనేజ్ చేసే ప్రక్రియ మా దగ్గర కొనసాగుతూనే ఉంటుంది. దీనివల్ల రెండేళ్ల కోసారి పూర్తిస్థాయిలో వారి పనితీరుపై ఒక అంచనాకు వచ్చే వీలుంటుంది. అదేపనిగా నాసిరకం పనితీరుతో కొనసాగే వారి విషయంలో కొన్ని క్రమశిక్షణ చర్యలు తప్పవు. ఈ చర్యల్లో కొందరి ఉద్యోగాలు కూడా పోవొచ్చు. కాకపోతే ఈ చర్యలనేవి వారి గురించిన పూర్తి ఫీడ్‌బ్యాక్ తరవాతే ఉంటాయి’’ అని ఇన్ఫోసిస్ ప్రతినిధి ఒకరు చెప్పారు. తన పేరు వెల్లడి కావటానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు. ‘‘ప్రతి ఏటా మేం దీన్ని చేస్తూనే ఉంటాం. కాకపోతే ప్రతిసారీ ఈ సంఖ్య మారుతూనే ఉంటుంది’’ అని చెప్పారాయన. పనితీరు ఆధారంగా విప్రో కూడా 600 మందికి ఉద్వాసన పలికినట్లు ఇటీవలే వార్తలు వెలువడ్డాయి. కాకపోతే ఈ సంస్థ 2వేల వరకూ ఉండొచ్చని అనధికారిక వర్గాలు చెబుతున్నాయి.
ఐటీయే అతిపెద్ద ఉద్యోగ వనరు!
దేశంలో ఐటీ కంపెనీలే అత్యధిక ఉద్యోగుల్ని తీసుకుంటున్నాయి. అయితే ఆటోమేషన్ ప్రక్రియ పెరిగిపోతూ ఉండటం వల్ల పలు స్థాయిల్లో ఉద్యోగాల కోత ఉండొచ్చని కొన్నాళ్లుగా అవి హెచ్చరిస్తూనే ఉన్నాయి. మరో సమస్యేమిటంటే... భారత ఐటీ రంగం 140 బిలియన్ డాలర్లకు చేరటానికి ప్రధానంగా దోహదపడింది ఔట్‌సోర్సింగే. కాకపోతే పలు దేశాల్లో దీనిపై ఆందోళనలు రేగుతున్నాయి.
ఔట్‌సోర్సింగ్‌కు స్వస్థి చెప్పి స్థానికులకే ఉద్యోగాలివ్వాలని అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో డిమాండ్లు రేగుతున్నాయి. ఈ నేపథ్యంలనే భారత కంపెనీలు అమెరికాలో అక్కడి వారికే ఉద్యోగాలిచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయి. దీనివల్ల వాటి లాభాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశమున్నా... ఆయా దేశాల్లోని పాలసీలకు అనుగుణంగా ఇవి సిద్ధమవుతున్నాయి.