మళ్లీ వెయ్యి డాలర్ల పైకి బిట్ కాయిన్
మూడేళ్లలో తొలిసారి
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్ శుభారంభం చేసింది. కాయిన్ మారకం విలువ ఏకంగా 1,000 డాలర్ల పైకి ఎగిసింది. మూడేళ్ల తర్వాత బిట్ కాయిన్ మారకం విలువ వెయ్యి డాలర్ల పైకి ఎగియడం ఇదే తొలిసారి. యూరప్‌కి చెందిన బిట్‌స్టాంప్ ఎక్సే్చంజీలో బిట్ కాయిన్ ఒక దశలో 1,022 డాలర్ల స్థాయికి కూడా పెరిగింది. 2013 డిసెంబర్ తర్వాత ఇదే అత్యధిక స్థాయి. మొత్తం మీద 2016లో మిగతా కరెన్సీలన్నింటినీ తోసిరాజని బిట్ కాయిన్ విలువ 125 శాతం ఎగిసింది. చైనా కరెన్సీ యువాన్ బలహీనంగా ఉండటం సైతం దీనికి తోడ్పడి ఉండొచ్చని అంచనా.
గణాంకాల ప్రకారం ఈ డిజిటల్ కరెన్సీకి సంబంధించిన ట్రేడింగ్ అత్యధికంగా చైనాలోనే జరుగుతోంది. 2013లో బిట్ కాయిన్ విలువ ఆల్ టైం రికార్డు 1,163 డాలర్ల స్థాయిని తాకింది. అయితే, ఆ తర్వాత జపాన్‌కి చెందిన మౌంట్ గోక్స్ ఎక్సే్చంజీలో హ్యాకింగ్ దెబ్బతో 400 డాలర్ల స్థాయికి కూడా పడిపోయింది. ఈ రెండేళ్లుగా బిట్ కాయిన్ విలువ కొంత మేర స్థిరంగా కొనసాగుతోంది. భారత్‌లో పెద్ద నోట్ల రద్దు తదితర పరిణామాలు.. ఇతరత్రా మిగతా దేశాల్లోనూ నగదు చెలామణీపైనా, పెట్టుబడులపైనా నియంత్రణలు పెరుగుతున్న నేపథ్యంలో అధిక రిస్కు ఉన్నప్పటికీ.. మెరుగైన ప్రత్యామ్నాయ కరెన్సీగా బిట్ కాయిన్ ఆకర్షిస్తోందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.