
బ్లాక్‌బెర్రీ జడ్10 రేటు మళ్లీ తగ్గింది
తాజా ధర రూ.17,990 60 రోజులే ఆఫర్
న్యూఢిల్లీ: బ్లాక్‌బెర్రీ కంపెనీ జడ్10 స్మార్ట్‌ఫోన్ ధరను రెండోసారి తగ్గించింది. అమ్మకాలు బాగా పడిపోవడమే దీనికి కారణమని పరిశ్రమ వర్గాలంటుండగా, భారత మార్కెట్లోకి ప్రవేశించి పదేళ్లైన సందర్భంగా ధరను తగ్గిస్తున్నామని బ్లాక్‌బెర్రీ ఇండియా ఎండీ సునీల్ లాల్వాణి తెలిపారు. బీబీ10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్ తాజా ధర రూ.17.990 అని పేర్కొన్నారు. అయితే ఈ తగ్గింపు ధర మంగళవారం నుంచే అమల్లోకి వస్తుందని, మరో 60 రోజుల పాటు ఈ ధరకే విక్రయిస్తామని వివరించారు.
గత ఏడాది ఫిబ్రవరిలో మార్కెట్లోకి తెచ్చినప్పుడు ఈ ఫోన్ ధరను రూ.43,490గా కంపెనీ నిర్ణయించింది. ఆ తర్వాత గతేడాది సెప్టెంబర్‌లో రూ.29,990కు, తాజాగా రూ.17.990కు తగ్గించింది. ప్రారంభ ధరకు, ప్రస్తుత ధరకు తేడా రూ.25,500 ఉంది. అంటే ధరను సగానికి పైగా తగ్గించింది. గతేడాది జనవరిలో బ్లాక్‌బెర్రీ కంపెనీ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ బీబీ10ను ప్రారంభించింది. ఈ ఓఎస్ ఆధారంగా కంపెనీ తెచ్చిన హ్యాండ్‌సెట్లకు స్పందన ఆశించినంతగా లేదు. 2012, సెప్టెంబర్-నవంబర్ క్వార్టర్లో 37 లక్షలుగా ఉన్న బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు గతేడాది ఇదే క్వార్టర్లో 19 లక్షలకు పడిపోయాయి.