బీఓబీ... ఇక దేశంలో టాప్‌–2 బ్యాంక్‌! | BoB to take leaf out of Vijaya Bank’s lending policy | Sakshi
Sakshi News home page

బీఓబీ... ఇక దేశంలో టాప్‌–2 బ్యాంక్‌!

Published Tue, Apr 2 2019 12:32 AM | Last Updated on Tue, Apr 2 2019 12:32 AM

BoB to take leaf out of Vijaya Bank’s lending policy - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ప్రభుత్వ రంగ రెండవ బ్యాంకింగ్‌ దిగ్గజంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) అవతరించింది. దేనా, విజయాబ్యాంకుల విలీనం ఏప్రిల్‌ 1 నుంచీ లాంఛనంగా అమల్లోకి రావడంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తరువాత బీఓబీ రెండవ స్థానంలోకి చేరింది. దీనితో ఇప్పటి వరకూ రెండవ స్థానంలో ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) మూడవ స్థానంలోకి వెళ్లింది. ఇందుకు సంబంధించి

ముఖ్యాంశాలు చూస్తే... 
►ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండవ స్థానంలోకి బీఓబీ వస్తే, మొత్తం బ్యాంకింగ్‌ రంగంలో చూస్తే, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తరువాత మూడవ స్థానానికి బీఓబీ చేరింది.  
► తాజా విలీనంతో బీఓబీ వ్యాపారం విలువ దాదాపు రూ.15 లక్షల కోట్లు దాటనుంది. ఇందులో రూ.8.75 లక్షల కోట్లు డిపాజిట్లు, రుణాలు రూ.6.25 లక్షల కోట్లు.  
► దేశం మొత్తంమీద బ్యాంక్‌కు 9,500 బ్రాంచీలు ఉంటాయి. 13,400 ఏటీఎంలు, 85,000 మంది ఉద్యోగుల నుంచి దాదాపు 12 కోట్ల మంది కస్టమర్లకు సేవలు అందుతాయి.  
►విలీన పథకం ప్రకారం,  దేనాబ్యాంక్, విజయాబ్యాంక్‌ షేర్‌హోల్డర్లకు బీఓబీ షేర్‌ కేటాయింపులను  పూర్తిచేసింది. విజయాబ్యాంక్‌ షేర్‌ హోల్డర్లు తమ వద్ద ఉన్న ప్రతి వెయ్యి షేర్లకు 402 బీఓబీ ఈక్విటీ షేర్లు పొందారు. ఇక దేనా బ్యాంక్‌ విషయంలో షేర్‌హోల్డర్లు ప్రతి వెయ్యి షేర్లకూ 110 బీఓబీ ఈక్విటీ షేర్లు పొందారు.  
►సోమవారం షేర్ల జారీ, కేటాయింపులు జరిగినట్లు బీఓబీ ఎక్సే్ఛంజ్‌లకు పంపిన ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 
► విలీనం పూర్తయిన నేపథ్యంలో.. గుజరాత్‌లో బీఓబీ మార్కెట్‌ షేర్‌ 22 శాతంగా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో ఈ షేర్‌  8 నుంచి 10 శాతంగా ఉంది.  
► మొండిబకాయిల భారంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దిద్దుబాటు చర్యల చట్రం (పీసీఏ)లో ఉన్న దేనా బ్యాంక్‌ వినియోగదారులకు రుణ సౌలభ్యం ఇప్పటివరకూ అందుబాటులో లేదు. తాజా విలీనంతో తిరిగి తక్షణం ఈ సౌలభ్యత అందుబాటులోకి వస్తుంది. 
►  గత ఏడాది సెప్టెంబర్‌లో బీఓబీతో విజయా,దేనా బ్యాంకుల విలీన నిర్ణయాన్ని ప్రకటించింది.  విలీనం 2019 జనవరిలో నోటిఫై అయ్యింది. ఏప్రిల్‌ 1న ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.  
► భారత్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులను అంతర్జాతీయ పోటీ స్థాయికి తీసుకువెళ్లడానికి వాటి బ్యాలెన్స్‌ షీట్లను మెరుగుపరచడానికి ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలో తీసుకున్న పలు సంస్కరణల్లో భాగంగా బ్యాంకింగ్‌ విలీన ప్రక్రియ ఊపందుకుంది.  
►ఈ సంస్కరణల్లో భాగంగా ఐడీబీఐ బ్యాంక్‌లోని 51 శాతం షేర్‌ను జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) కొనుగోలు చేసింది.
 ► దీనితోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థికశాఖ దాదాపు రూ.1.06 లక్షల కోట్లను తాజా మూలధనంగా సమకూర్చింది. దీనితో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేషన్‌ బ్యాంక్, అలహాబాద్‌ బ్యాంక్‌సహా ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్‌బీఐ దిద్దుబాటు చర్యల చట్రం నుంచి బయటపడ్డాయి. 2018 ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య బ్యాంకింగ్‌ మొండిబకాయిల మొత్తం దాదాపు రూ.23,860 కోట్ల మేర తగ్గాయి.  
►తాజా విలీనంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 18కి తగ్గింది. కేంద్ర తాజా విలీన ప్రక్రియ ప్రారంభానికి ముందు దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య మొత్తం 27. అయితే భారతీయ మహిళాబ్యాంక్‌సహా ఐదు అనుబంధ బ్యాంకులు ఎస్‌బీఐలో కలిశాయి. దీనితో ఈ సంఖ్య 27 నుంచి 21కి తగ్గింది.  
►ఈ విలీనం నేపథ్యంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ)కు కేంద్రం రూ.5,000 కోట్ల తాజా మూలధనం సమకూర్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం.  
►విలీనానికి సరిగ్గా నెల రోజుల ముందు బీఓబీ చైర్మన్‌గా మాజీ ఆర్థిక కార్యదర్శి హస్‌ముఖ్‌ అదియా నియమితులయ్యారు.  
►గుజరాత్‌లోని ఒకప్పటి బరోడాలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1908 జూలై 20న ఏర్పాటయ్యింది. ప్రస్తుతం బరోడా వడోదరగా పిలుస్తున్నారు. ఇక కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో 1931లో ఏబీ శెట్టి విజయాబ్యాంక్‌ను స్థాపించగా, ముంబైలో 1938లో దేవ్‌కరణ్‌ నాన్‌జీ దేనా బ్యాంక్‌ను స్థాపించారు. 
►తాజా విలీన నిర్ణయాల్లో  తప్పులు జరిగాయని, ఈ ప్రక్రియను నిలుపుచేయాలని బ్యాంక్‌ ఆఫీసర్ల అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత వారం తిరస్కరించింది.  
►తాజా విలీనం నేపథ్యంలో... దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లీడ్‌ బ్యాంకర్ల (రాష్ట్రాల్లో ప్రధాన బ్యాంకులుగా పరిగణించే) బాధ్యతను ఆర్‌బీఐ పునర్‌వ్యవస్థీకరించింది.  
►విలీనం అమల్లోకి రావడంతో బీఓబీ షేర్‌ ధర సోమవారం ఎన్‌ఎస్‌ఈలో  3.15 శాతం పెరిగి 132.70 వద్ద ముగిసింది.

కస్టమర్లకు, ఉద్యోగులకు ప్రయోజనం 
తాజా విలీనం వల్ల 12 కోట్ల మందికిపైగా కస్టమర్లకు, బ్యాంక్‌ ఉద్యోగులకు అత్యుత్తమ ప్రయోజనాలు సమకూరనున్నాయి. నగదు నిర్వహణా వ్యవహారాలు, రుణ సత్వర అందుబాటు, ఆర్థిక, ద్రవ్య ప్రణాళికలు, సంపద నిర్వహణ వంటి విస్తృతస్థాయి అంశాల్లో ఈ ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగుల సేవలు మెరుగుపడతాయి. వారి ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షించడం జరుగుతుంది. విలీన ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులన్నీ 12–18 నెలల్లో పరిష్కారం అవుతాయి.    
– బీరేంద్ర కుమార్, బీఓబీ జీఎం, బెంగళూరు జోనల్‌ ఆఫీస్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement