
న్యూఢిల్లీ: భారత్‌లో పని ప్రదేశాల్లో పురుషులతో సమానంగా మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచితే అది ఆ దేశ జీడీపీని 27 శాతం అధికం చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ చీఫ్ క్రిస్టీన్ లగార్డ్, నార్వే ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్ అన్నారు. దావోస్‌లో సోమవారం ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వీరు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
మహిళలపై వివక్షకు, వేధింపులకు కాలం చెల్లిందన్నారు. మహిళల సాధికారత ఈ ఏడాది సదస్సులో ప్రధాన అంశంగా ఉండనుంది. మహిళల పట్ల గౌరవ భావం, అపార అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని వీరు పేర్కొన్నారు.
ఈ ఏడాది సదస్సులో సుమారు 3,000 మంది ప్రముఖులు పాల్గొంటుండగా, అందులో 21% మహిళలే. వీరిలో లగార్డ్, సోల్‌బెర్గ్‌తోపాటు మన దేశానికి చెందిన మహిళా ఉద్యమకర్త చేతన సిన్హా కూడా ఉన్నారు. అలాగే, మన దేశ ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా అనేకమంది దిగ్గజాలు సదస్సుకు హాజరవుతున్నారు.