India Overtakes UK To Become World 5th Largest Economy - Sakshi
Sakshi News home page

తగ్గేదెలే! అగ్రరాజ్యం బ్రిటన్‌ను దాటేసిన భారత్‌.. మరింత బలంగా..

Published Sun, Sep 4 2022 3:28 AM | Last Updated on Sun, Sep 4 2022 10:56 AM

India overtakes UK to become world fifth largest economy - Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లను తట్టుకొని నిలబడ్డ భారత్‌ ప్రపంచ పటంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అగ్రరాజ్యమైన బ్రిటన్‌ను దాటి అయిదోస్థానంలోకి దూసుకుపోయింది. 2022 మార్చి చివరి నాటికి  భారత్‌ ప్రపంచంలోని బలమైన ఆర్థిక దేశాల్లో అయిదో స్థానంలో ఉందని బ్లూమ్‌బర్గ్‌ సంస్థ తాజా కథనంలో వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి సేకరించిన జీడీపీ గణాంకాలు, డాలర్‌తో మారకపు రేటు ఆధారంగా బ్లూమ్‌బర్గ్‌ లెక్కలు వేసి ఒక నివేదికను రూపొందించింది. ప్రపంచంలో బలమైన ఆర్థిక దేశంగా అమెరికా మొదటి స్థానంలోనూ, చైనా రెండో స్థానంలో ఉంటే  జపాన్, జర్మనీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.

పదేళ్ల క్రితం పదకొండో స్థానంలో ఉన్న భారత్‌ ఇప్పుడు బ్రిటన్‌ను ఆరో స్థానానికి నెట్టేసి అయిదో స్థానానికి ఎగబాకింది. 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 854.7 బిలియన్‌ డాలర్లు ఉంటే, బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 816 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది భారత్‌రూపాయితో పోల్చి చూస్తే బ్రిటన్‌ పౌండ్‌ విలువ 8% మేరకు క్షీణించింది. మరోవైపు భారత్‌ ఆర్థిక వృద్ధి ఈ ఏడాది  7శాతానికి పైగా నమోదు చేయవచ్చునని అంచనాలున్నాయి. 2021–22లో మన దేశం 8.7% వృద్ధి నమోదు చేసింది. అయితే తలసరి ఆదాయం, మానవ అభివృద్ధి సూచిలో మాత్రం మనం బ్రిటన్‌ కంటే వెనుకబడి ఉండడం గమనార్హం. విద్య, ఆరోగ్యం, ప్రజల జీవన ప్రమాణాలతో కొలిచే మానవ అభివృద్ధిలో బ్రిటన్‌ 1980లో ఉన్నప్పటి స్థితికి చేరాలన్నా మనకు మరో పదేళ్లు పడుతుందని ఆర్థిక వేత్తలంటున్నారు.

వలస పాలకుల్ని నెట్టేయడం గర్వకారణం
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకొని ఆజాదీ అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ మన దేశం అయిదో స్థానానికి చేరుకోవడంతో కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన దేశాన్ని వలస రాజ్యంగా మార్చి పరిపాలించిన బ్రిటన్‌నే ఆర్థికంగా వెనక్కి నెట్టేయడం ప్రతీ భారతీయుడు గర్వించాల్సిందేనని ట్వీట్లు చేశారు. పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా  కర్మ సిద్ధాంతం పని చేసిందని, దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన ప్రతీ భారతీయుడి గుండె ఉప్పొంగిపోతుందని ట్వీట్‌ చేస్తే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్‌ మాండవీయ ‘‘రిఫార్మ్, పెర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్‌’’ అన్న సూత్రంతోనే విజయం సాధించామని, ప్రధాని నరేంద్ర మోదీకే ఈ క్రెడిట్‌ దక్కుతుందని  ట్విటర్‌లో పేర్కొన్నారు.  

ఆర్థిక కష్టాల్లో బ్రిటన్‌  
బ్రిటన్‌ గత కొన్నేళ్లుగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుంది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంది. ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యులకి బతుకు భారమైపోయింది. ఆర్థిక మాంద్యం ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటోంది. 2021 ద్వైమాసికంలో బ్రిటన్‌ జీడీపీ కేవలం 1% మాత్రమే పెరిగింది. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కోలేక ఆర్థికంగా చతికిల పడిపోయింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ అస్థిరత్వం, బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా వంటివి ఆ దేశాన్ని మరింత కుదేల్‌ చేశాయి. 2024 వరకు ఇవే పరిస్థితులు ఉంటాయని బ్యాంకు ఆఫ్‌ ఇంగ్లండ్‌ అంచనా వేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement