
న్యూఢిల్లీ: చిన్న పట్టణాల్లోనూ బీపీవో కార్యాలయాలు ఏర్పాటు చేసేలా సంస్థలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన బీపీవో స్కీమ్‌ను మరింతగా విస్తరించనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ఉద్యోగావకాశాల కల్పనకు తోడ్పడే ఈ స్కీమ్ పరిధిని ఒక లక్ష సీట్లకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ పరిమితి 48,000 సీట్లుగా ఉంది. తాజాగా బీపీవో సంస్థల రాకతో గయా, గాజీపూర్ వంటి చిన్న పట్టణాల్లోనూ యువతకు ఉపాధి అవకాశాలు మరింతగా పెరగగలవని మంత్రి వివరించారు.
మరోవైపు, దేశంలోనే అతి పెద్ద జాతీయ డేటా సెంటర్‌ను భోపాల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దాదాపు 5 లక్షల వర్చువల్ సర్వర్స్ సామర్థ్యంతో ఇది ఉంటుందని వివరించారు. ప్రభుత్వ వెబ్‌సైట్లు, సర్వీసులు, యాప్స్ మొదలైన వాటన్నింటినీ నిర్వహించేందుకు ప్రస్తుతం హైదరాబాద్, పుణె, ఢిల్లీ, భువనేశ్వర్‌లో మొత్తం 4 జాతీయ డేటా సెంటర్స్ ఉన్నాయి.