‘పొదుపు’ మళ్లీ కళకళ! | Brief about savings schemes and Interest rates | Sakshi
Sakshi News home page

‘పొదుపు’ మళ్లీ కళకళ!

Published Mon, Oct 15 2018 1:40 AM | Last Updated on Mon, Oct 15 2018 1:40 AM

Brief about savings schemes and Interest rates - Sakshi

(సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం) : వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ కళొచ్చింది. సామాన్యుల పొదుపు సాధనాలుగా వర్ధిల్లిన ఈ పథకాలు నాలుగేళ్లుగా వడ్డీ రేట్ల క్షీణతతో కాస్తంత కళ తప్పాయనే చెప్పాలి. అయినప్పటికీ బ్యాంకులతో పోలిస్తే గతంలోనూ, ఇప్పుడు కూడా కాస్తంత ఎక్కువ రాబడి వస్తున్నది చిన్న మొత్తాల పొదుపు పథకాల్లోనేనని నిస్సందేహంగా చెప్పుకోవాలి.అయితే, దేశంలో తిరిగి వడ్డీ రేట్లు పెరుగుతున్న వాతావరణం నెలకొంది. ఫలితంగా... అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే మూడు నెలల కాలానికి అన్ని జాతీయ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 0.40 శాతం వరకు పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. అన్ని వయసుల వారి అవసరాలకు సరిపడే పథకాలు వీటిల్లో ఉన్నాయి. ఆ వివరాలొకసారి చూస్తే...

ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)
పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) ఆదాయపన్ను ప్రయోజనంతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాల కోసం అనువైన పథకాల్లో ఒకటి. భద్రతతో కూడిన ఆకర్షణీయమైన దీర్ఘకాలిక పెట్టుబడి పథకాల్లో ఇదీ ఒకటి. పైగా ఆదాయపన్ను ప్రయోజనాన్ని చూసుకుంటే అందరి పోర్ట్‌ఫోలియోలో తప్పని సరిగా ఉండాల్సిన సాధనం. దీని కాల వ్యవధి 15 ఏళ్లు. కావాలంటే ఐదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు. ఇందులో  ఏటా కనీసం డిపాజిట్‌ చేయాల్సిన మొత్తం రూ.500. గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

ఒకేసారి లేక 12 వాయిదాల రూపంలో ఇన్వెస్ట్‌ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాన్యులు సైతం ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఇందులో ఒక ఆర్థిక సంత్సరంలో రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసి, ఆ మొత్తంపై ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. 15 ఏళ్ల కాల వ్యవధిలో 7వ ఏట నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. ముందస్తుగా ఖాతా మూసివేసేందుకు అవకాశం లేదు. దీనిపై వడ్డీ రేటును కేంద్రం ప్రతీ మూడు నెలలకోసారి సమీక్షించి, సవరిస్తుంటుంది.

వడ్డీ గత నెల వరకు 7.6 శాతం కాగా దీన్ని తాజాగా 8 శాతానికి సవరించింది. వడ్డీని ఏడాదికోసారి అసలుకు కలుపుతారు. ఈ పథకంలో పెట్టుబడులపైనే కాదు, వడ్డీ రాబడి, కాల వ్యవధి తీరిన తర్వాత అందుకునే మొత్తంపైనా ఆదాయపన్ను లేదు. అందుకే మూడు మినహాయింపులు (ఈఈఈ) కలిగిన పథకంగా దీన్ని చెబుతారు. ముఖ్యంగా 30 శాతం ఆదాయపన్ను శ్లాబులో ఉన్నవారు ఇందులో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా పన్ను మినహాయింపులను లెక్కేసి చూస్తే అధిక రాబడి పొందొచ్చు. వీరికి నికరంగా 11.9 శాతం రాబడి పొందినట్లవుతుంది. చాలా డెట్‌ ఫండ్స్, బాండ్లతో పోలిస్తే పీపీఎఫ్‌ చక్కని రాబడి సాధనంగా ఉంది.

అదనపు ప్రయోజనాలు
పీపీఎఫ్‌ బ్యాలన్స్‌పై రుణాన్ని కూడా తీసుకోవచ్చు. ఖాతా ప్రారంభించిన తర్వాత మూడో ఆర్థిక సంవత్సరం నుంచి ఆరో ఆర్థిక సంవత్సరం వరకు ఈ అవకాశం ఉంటుంది. బ్యాలన్స్‌లో 25 శాతం పొందొచ్చు. మూడేళ్లలోగా తిరిగి చెల్లించాలి. పాక్షిక ఉపసంహరణ అవకాశం ఏడో సంవత్సరం నుంచి ఉంటుంది. ఏ పోస్టాఫీసులో అయినా లేక బ్యాంకులో అయినా పీపీఎఫ్‌ ఖాతాను తెరవొచ్చు. బ్యాంకుల్లో అయితే ఆన్‌లైన్‌లో ప్రారంభించే సదుపాయం కూడా ఉంది. వేరే శాఖకు కూడా బదిలీ చేసుకోవచ్చు.

నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎస్‌సీ)
ఇటీవలి రేట్ల సవరణ తర్వాత నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (జాతీయ పొదుపు పత్రం) పథకంలో వడ్డీ రేటు 8 శాతానికి చేరుకుంది. కాల వ్యవధి ఐదేళ్లు. ఐదేళ్లపాటు లాకిన్‌లో ఉంటుంది. ఆ లోపు పెట్టుబడులను వెనక్కి తీసుకునే వీలుండదు. పెట్టుబడి సమయంలో ఉన్న వడ్డీ రేటే కాల వ్యవధి పూర్తయ్యే వరకూ అమలవుతుంది. ఏటా వడ్డీ ఆదాయాన్ని ఆసలుకు కలుపుతారు. కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. రూ.100 పెట్టుబడి ఐదేళ్ల తర్వాత రూ.144.23 అవుతుంది.

ఇందులో పెట్టుబడులకు గరిష్ట పరిమితి లేదు. ఎన్‌ఎస్‌సీలో చేసే రూ.1.50 లక్షల పెట్టుబడికి ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. వడ్డీ ఏటా అసలుకు కలుస్తుంటుంది. ఇలా కలిసే మొత్తాన్ని తిరిగి పెట్టుబడి పెట్టినట్టుగా ఆదాయపన్ను చట్టం పరిగణిస్తుంది. కనుక దీనిపైనా సెక్షన్‌ 80సీ కింద గరిష్ట పరిమితి మేరకు పన్ను మినహాయంపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. కానీ, చివరి ఏడాది (ఐదో ఏట) వచ్చే వడ్డీ ఆదాయం తిరిగి ఇన్వెస్ట్‌ చేయడం ఉండదు కనుక దీనిపై పన్ను మినహాయింపు ఉండదు.

దీన్ని తమ వ్యక్తిగత ఆదాయానికి కలిపి నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ ఆదాయానికి టీడీఎస్‌ (మూలం వద్ద పన్ను కోత) వర్తించదు. పోస్టాఫీసు ఐదేళ్ల టైమ్‌ డిపాజిట్‌ పథకంతో పోల్చిచూస్తే... ఎన్‌ఎస్‌సీలోనే కాస్తంత అధిక రాబడి ఉంది. టైమ్‌ డిపాజిట్‌లో 7.8 శాతమే వడ్డీ రేటు ఉంది. కాకపోతే , పన్ను ఆదా చేసే బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలో మాత్రం అధిక రాబడి అందుకోవచ్చు. ఉదాహరణకు డాయిష్‌ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంకు పన్ను ఆదా చేసే ఐదేళ్ల ఎఫ్‌డీలపై 8.5 శాతం వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్నాయి.   

కానీ, వడ్డీ ఆదాయానికి పన్ను పడుతుంది. అలా చూస్తే ఎన్‌ఎస్‌సీయే మెరుగైనది. ఎందుకంటే పన్ను తర్వాత అధిక రాబడి ఎన్‌ఎస్‌సీలోనే అధికం. పైగా ఇందులో పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. బ్యాంకు డిపాజిట్ల కంటే సురక్షితమైనది. ఇన్‌కమ్‌ ఫ్రమ్‌ అదర్‌ సోర్సెస్‌ (ఇతర మార్గాల    ద్వారా వచ్చిన ఆదాయం) అనే కాలమ్‌లో ఎన్‌ఎస్‌సీ రాబడిని చూపించాల్సి ఉంటుంది. ఏ పోస్టాఫీసు నుంచి అయినా ఎన్‌ఎస్‌సీ పత్రాలను కొనుగోలు చేయవచ్చు. సొంతంగాను, మైనర్ల పేరిట, జాయింట్‌గానూ తీసుకోవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై)
చిన్న వయసులో ఉన్న కుమార్తెల పేరిట వారి భవిష్యత్తు లక్ష్యాల కోసం పొదుపు చేసుకునేందుకు ఉద్దేశించిన సాధనం. కుమార్తెల ఉన్నత విద్య, వివాహ అవసరాల కోసం ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు పూర్తి భద్రత కలిగిన మెరుగైన సాధనంగా దీన్ని చెప్పుకోక తప్పదు. తాజా త్రైమాసికానికి ఈ పథకంలో పెట్టుబడులపై వడ్డీ రేటును 8.1 శాతం నుంచి 8.5 శాతానికి పెంచారు. ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల కంటే (సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ పథకం మినహా) ఇందులో వడ్డీ రేటు ఎక్కువ.

ఇక ఇందులో పెట్టుబడులు, వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ మొత్తాలపైనా పన్ను లేకపోవడం అదనపు ఆకర్షణ. ఇద్దరు కుమార్తెల పేరిటే ఖాతాలు తెరిచే అవకాశముంది. పదేళ్లలోపు కుమార్తె ఉన్న వారు తప్పకుండా పరిశీలించాల్సిన ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ పథకమిది. దత్తత తీసుకున్న కుమార్తె పేరిటా ఖాతాను తెరవొచ్చు. ఏడాదిలో కనీసం రూ.250 ఇన్వెస్ట్‌ చేయాలి. గరిష్టంగా ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఇంతకుమించి కుదరదు.

ఇందులో పెట్టుబడులకు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. పోస్టాఫీసులతోపాటు బ్యాంకుల్లోనూ ఈ ఖాతా తెరిచేందుకు వీలుంది. ఇందులో వడ్డీని ఏటా అసలుకు కలుపుతారు. 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలి. ఖాతా ప్రారంభించిన తర్వాత 21 ఏళ్లకు కాల వ్యవధి తీరిపోతుంది. ఏడాదిలో ఎన్ని విడతలుగానైనా ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు వీలుంది. ఉన్నత విద్య కోసం కుమార్తె 18వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత లేదా 10వ తరగతి పూర్తయిన తర్వాత 50% బ్యాలన్స్‌ను వెనక్కి తీసుకోవచ్చు. ఏది ముందు అయితే దాన్నే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే, 18 ఏళ్లు నిండిన తర్వాత అమ్మాయి వివాహం కోసం మొత్తాన్ని వెనక్కి తీసేసుకోవచ్చు.

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌)
60 ఏళ్లు నిండిన వృద్ధుల కోసం ఉద్దేశించిన పథకం ఇది. ఇటీవలి వడ్డీ రేట్ల సవరణ తర్వాత ఈ పథకంలో పెట్టుబడిపై వార్షిక వడ్డీ రేటు 8.7 శాతానికి పెరిగింది. సురక్షితమైన సాధనాల్లో అత్యధిక రాబడి ఉన్న పథకం ఇదేనని స్పష్టంగా చెప్పొచ్చు. వీఆర్‌ఎస్‌తో ముందే పదవీ విరమణ చేసిన వారయితే 55 ఏళ్లకే ఇందులో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. కాకుంటే 55 ఏళ్లకే చేరే వారు రిటైర్మెంట్‌ ప్రయోజనాలు అందిన నెలలోపే ఈ ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుంది.

ఈ పథకం కాల వ్యవధి ఐదేళ్లు. ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల మాదిరే ఈ పథకం వడ్డీ రేటును కూడా కేంద్రం మూడు నెలలకోసారి సవరిస్తుంది. ఇన్వెస్ట్‌ చేసిన రోజు ఉన్న వడ్డీ రేటే పూర్తి కాలావధికి వర్తిస్తుంది. ఐదేళ్ల తర్వాత కావాలనుకుంటే మరో మూడేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. విడిగా ఒకరు తమ పేరిట రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది.

ఈ పథకంలో రూ.1.5 లక్షల పెట్టుబడికి సెక్షన్‌ 80సీ కింద పన్ను ప్రయోజనానికి అనుమతి ఉంది. కాకపోతే ఈ పథకంలో పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ప్రతీ త్రైమాసికం ముగింపు రోజున వడ్డీ ఆదాయం చెల్లించడం జరుగుతుంది. అన్ని బ్యాంకులు సీనియర్‌ సిటిజన్‌ డిపాజిట్లపై 6.5–8.25 శాతం మధ్యే వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. ఒక్క ఐడీఎఫ్‌సీ బ్యాంకు 8.75 శాతం ఆఫర్‌ చేస్తోంది.

పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం
పెట్టుబడికి భద్రత ఉండాలి, ప్రతీ నెలా ఆదాయం రావాలి అని కోరుకునే వారికి పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం కూడా ఒక సాధనమే. ఇందులో పెట్టుబడులపై 7.3%గా ఉన్న వడ్డీ రేటు ఈ నెల 1 నుంచి 7.7%కి పెరిగింది. ఈ పథకంలో పెట్టుబడు లకు ప్రభుత్వ హామీ ఉంటుంది. పథకం కాల వ్యవధి ఐదేళ్లు. వడ్డీ ఆదాయాన్ని ప్రతి నెలా చెల్లిస్తారు. ఒకరు లేదా ఇద్దరు కలసి జాయింట్‌గానూ ప్రారంభించొచ్చు. కనీస పెట్టుబడి రూ.1,500. గరిష్ట పరిమితి రూ.4.5 లక్షలు.

జాయింట్‌ ఖాతా అయితే గరిష్ట పరిమితి రూ.9 లక్షలు. దాదాపు అన్ని బ్యాంకుల ఎఫ్‌డీల కంటే (నెలవారీ వడ్డీ చెల్లించేవి) అధిక రాబడి ఇందులో అందుకోవచ్చు. డిఫాల్ట్‌ రిస్క్‌ ఉండదు. ఇక ఈ పథకంలో పెట్టుబడులకు సెక్షన్‌ 80సీ పన్ను ప్రయోజనాల్లేవు. పైగా పోస్టాఫీసుల నెలసరి ఆదాయ పథకంపై వచ్చే వడ్డీ ఆదాయం, బ్యాంకు ఎఫ్‌డీలపై ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. కాస్త ఆకర్షణీయ అంశాలు ఏమిటంటే... వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ అమలు చేయరు. ఏడాది తర్వాత ముందస్తుగా క్లోజ్‌ చేయవచ్చు. కాకపోతే కాస్త పెనాల్టీ భరించాలి.


ఇక పదేళ్ల కాల వ్యవధి కలిగిన ప్రధానమంత్రి వయవందన యోజనలో సీనియర్‌ సిటిజన్లకు పెట్టుబడిపై 8.3 శాతం రాబడి మాత్రమే అందుతుంది.  ఒకరు ఒకటికి మించిన ఖాతాలను ప్రారంభించొచ్చు. కానీ అన్నింటిలోనూ పెట్టుబడి మొత్తం రూ.15 లక్షలు మించకూడదు. వడ్డీ రేట్లు భవిష్యత్తులో పెరుగుతాయని భావిస్తే ఏక మొత్తంలో కాకుండా వివిధ కాల వ్యవధులతో క్రమంగా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఖాతాను ముందే క్లోజ్‌ చేయటానికి అనుమతిస్తారు. కాకపోతే పెట్టుబడిపై 1– 1.5 శాతం వరకు మినహాయిస్తారు. వడ్డీ ఆదాయం ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 దాటితే టీడీఎస్‌ మినహాయిస్తారు. పోస్టాఫీసు లేదా ఎస్‌బీఐ, బ్యాంకు ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఈ ఖాతాను ప్రారంభించుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement