భెల్ అప్, ఆర్‌ఐఎల్ స్లిప్
వారారంభంలో ఊపందుకున్న మార్కెట్లు మంగళవారం మందగించాయి. మార్చి డెరివేటివ్ సిరీస్ ముగింపు కారణంగా కొంతమేర హెచ్చుతగ్గులను చవిచూసినప్పటికీ, చివరకు స్వల్ప మార్పులతో ముగిశాయి. సెన్సెక్స్ యథాతథంగా 22,055 వద్దే నిలవగా, నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 6,590 వద్ద ముగిసింది. అయితే ఇంట్రాడేలో సెన్సెక్స్ 22,080 పాయింట్లను తాకగా, నిఫ్టీ 6,595కు చేరింది. ఇవి కొత్త గరిష్టాలు. బీఎస్‌ఈలో పవర్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, వినియోగ వస్తు రంగాలు 1.5% స్థాయిలో పుంజుకోగా,ఆయిల్ ఇండెక్స్ అదే స్థాయిలో నీరసించింది. కాగా, ఎఫ్‌ఐఐల జోరు కొనసాగింది. సోమవారం రూ. 1,466 కోట్ల విలువైన షేర్లను కొన్న ఎఫ్‌ఐఐలు తాజాగా మరో రూ. 1,223 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 544 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.
గ్యాస్ ధర ఎఫెక్ట్
గ్యాస్ ధర పెంపు నిర్ణయం వాయిదా పడటంతో ఆయిల్ షేర్లు డీలాపడ్డాయి. ప్రధానంగా ఆర్‌ఐఎల్ 3% పతనంకాగా, గెయిల్, ఓఎన్‌జీసీ సైతం 0.5% స్థాయిలో నష్టపోయాయి. ఈ బాటలో ఇతర దిగ్గజాలు విప్రో, సెసాస్టెరిలైట్, ఎంఅండ్‌ఎం, డాక్టర్ రెడ్డీస్ 2.5-1% మధ్య క్షీణించాయి. ఇక మరోవైపు భెల్ 4.5% జంప్ చేయగా, హీరో మోటో, హెచ్‌యూఎల్, ఎల్‌అండ్‌టీ 3-1.5% మధ్య లాభపడ్డాయి. అయితే ట్రేడైన షేర్లలో 1,658 నష్టపోతే, 1,207 మాత్రమే లాభపడటం గమనార్హం. ఇతర షేర్లలో వీఐపీ, ప్రాజ్, క్యాపిటల్ ఫస్ట్, బీఎఫ్ యుటిలిటీస్, డిష్ టీవీ, అపోలో టైర్స్ 19-6% మధ్య దూసుకెళ్లగా, డీఎల్‌ఎఫ్, హెచ్‌డీఐఎల్ 3% చొప్పున ఎగశాయి.