
నెట్ లేకుండానే ఫేస్‌బుక్ యాక్సెస్
న్యూఢిల్లీ: మొబైల్ వినియోగదారులు ఇంటర్నెట్/డేటా కనెక్షన్ లేకుండానే ఫేస్‌బుక్‌ను యాక్సెస్ చేసుకునే సర్వీస్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది. ఈ సర్వీస్ కోసం 3 రోజులకైతే రూ.4, వారానికైతే రూ.10, నెలకైతే రూ.20 చొప్పున చార్జీ వసూలు చేస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ డెరైక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఈ సర్వీస్ ద్వారా మొబైల్ వినియోగదారులు తమ ఫేస్‌బుక్ అకౌంట్లను యాక్సెస్ చేసుకోవచ్చని, మెసేజ్‌ల స్టేటస్‌ను చూడొచ్చని, మెసేజ్‌లను పోస్ట్ చేయవచ్చని, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లకు స్పందించవచ్చని, ఫ్రెండ్స్ వాల్స్‌పై రైట్ చేయవచ్చని, బర్త్‌డే రిమైండర్స్‌ను చూడొచ్చని, ఎలాంటి ఇంటర్నెట్/డేటా కనెక్షన్ లేకుండానే మెసేజ్‌లు పంపించవచ్చని వివరించారు.
యూఎస్‌ఎస్‌డీ ద్వారా యుటోపియా మొబైల్ భాగస్వామ్యంతో ఈ సర్వీస్‌ను అందిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని రకాల మొబైల్ ఫోన్లలలో ఈ సర్వీస్‌ను ఉపయోగించుకోవచ్చని వివరించారు. తూర్పు, దక్షిణ జోన్లలో ఈ సర్వీస్‌ను తక్షణం అందిస్తామని, ఆ తర్వాత పశ్చిమ, ఉత్తర జోన్లకు విస్తరిస్తామని తెలిపారు. టెలికం కంపెనీలు అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా(యూఎస్‌ఎస్‌డీ) టెక్నాలజీ ద్వారా తమ మొబైల్ వినియోగదారులకు అలర్ట్‌లు పంపిస్తాయి. ఈ టెక్నాలజీ ద్వారానే బీఎస్‌ఎన్‌ఎల్ ఈ సర్వీస్‌ను అందిస్తోంది.