బీఎస్‌ఎన్‌ఎల్ ఉచిత రోమింగ్ షురూ..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్.. మొబైల్ కస్టమర్ల కోసం సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇక వివిధ సర్కిళ్లలో తిరిగేటప్పుడు రోమింగ్ చార్జీలపై ఆందోళనతో తమ యూజర్లు పలు సిమ్‌కార్డులు, హ్యాండ్‌సెట్స్‌ను వెంటబెట్టుకోవాల్సిన అవసరం ఉండదని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. దీనితో యావత్ దేశమంతటా ఒకే మొబైల్ నంబరు ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించే దిశగా మరో అడుగు ముందుకు వేసినట్లయిందని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్.. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్వీటర్‌లో పేర్కొన్నారు. జాతీయ టెలికం విధానం 2012 కింద క్రమంగా దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్‌ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రైవేట్ టెలికం కంపెనీల్లో ఎయిర్‌సెల్ ఇటీవలే అయిదు దక్షిణాది రాష్ట్రాల్లో ఉచిత రోమింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చింది.