బ్యాంకులకు 7,940 కోట్లు
న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.7,940 కోట్ల మూలధన పెట్టుబడులను బడ్జెట్ ప్రతిపాదించింది. 2011 నుంచి 2014 వరకూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వ పెట్టుబడుల మొత్తం రూ.58,600 కోట్లు. అంతర్జాతీయ ప్రమాణాలకు సంబంధించి బాసెల్-3 అమలుకు బ్యాంకులకు మూలధన పెట్టుబడులుగా రానున్న రెండు, మూడేళ్లలో రూ. 2.4 లక్షల కోట్లు అవసరం అవుతాయని అంచనా.
సర్‌ఫేసీ చట్ట పరిధిలోకి ఎన్‌బీఎఫ్‌సీలు: సర్‌ఫేసీ (సెక్యూరిటైజేషన్ అండ్ రికన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్‌ట్రస్ట్ యాక్ట్, 2002) చట్ట పరిధిలోకి దిగ్గజ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలను (ఎన్‌బీఎఫ్‌సీ) బడ్జెట్ తీసుకువచ్చింది. ఎన్‌బీఎఫ్‌సీలు రుణ రికవరీ ప్రక్రియ సత్వర పరిష్కారం కావడానికి, మొండి బకాయిల సమస్యలపై కఠిన చర్యలకు ఈ చర్య దోహదపడుతుంది. ఆర్‌బీఐ వద్ద రిజిస్టరై, రూ.500 కోట్ల వరకూ ఆస్తుల పరిమాణం ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలను సర్‌ఫేసీ యాక్ట్ కిందకు తీసుకువస్తున్నట్లు బడ్జెట్ ప్రతిపాదించింది.
అటానమస్ బ్యాంక్స్ బోర్డ్
అటానమస్ (స్వతంత్ర) బ్యాంక్ బోర్డ్ బ్యూరో ఏర్పాటు ప్రతిపాదన కీలకమైనది. మూలధన సమీకరణపై బ్యాంకలకు ఇది స్వేచ్ఛ కల్పిస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌ల ఎంపిక విధానంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. బ్యాంకులకు హోల్డింగ్, ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ఏర్పాటు దిశలో ఇది ముందడుగు.