Government Sector Banks
-
మార్కెట్ విలువను మించిన పీఎస్‌యూ బ్యాంకుల ఎన్పీఏలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి రూ. 100కు సమానమైన షేర్లు మీ దగ్గర ఉన్నాయా ? అయితే రూ.150 విలువైన మొండి బకాయిల భారం మీ నెత్తిన ఉన్నట్లే. ప్రభుత్వ రంగ బ్యాంకుల మార్కెట్ విలువకు ఒకటిన్నర రెట్లకు అంటే రూ. 4 లక్షల కోట్లకు మొండి బకాయిలు పేరుకుపోయాయి. మొండి బకాయిలుగా మారే అవకాశమున్న రుణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం మొండి బకాయిల విలువ రెట్టింపై రూ.8 లక్షల కోట్లకు చేరతాయని అంచనా. ప్రైవేట్ రంగ బ్యాంకుల మొండి బకాయిలు ఈ బ్యాంకుల విలువలో 7% వరకే ఉన్నాయి. గతేడాది డిసెంబర్ 31 నాటికి ఎస్బీఐ సహా మొత్తం లిస్టైన 24 బ్యాంకుల మొండి బకాయిలు రూ.3,93,035 కోట్లుగా ఉన్నాయి. ఇది ఈ 24 బ్యాంకుల మార్కెట్ విలువ రూ.2,62,955 కోట్లతో పోల్చితే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. బ్యాంక్‌లు ఇచ్చిన రుణాల్లో మూడు నెలలలోపు ఎలాంటి చెల్లింపులు రుణగ్రస్తుడి నుంచి రాకపోతే ఆ రుణాన్ని మొండి బకాయిగా వ్యవహరిస్తారు. ఎస్బీఐ మినహా చాలా బ్యాంక్‌ల స్థూల మొండిబకాయిలు వాటివాటి మార్కెట్ విలువను మించి పోయాయి. -
బ్యాంకింగ్‌లో 15% వేతన పెంపు షురూ!
ఐబీఏ-ఉద్యోగ సంఘాల సంతకాలు ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులుసహా 43 బ్యాంకులకు చెందిన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగుల వేతనాలు 15 శాతం పెరగనున్నాయి. ఈ మేరకు ఒక వేతన ఒప్పందంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సంతకం చేసింది. ఐబీఏ, ఉద్యోగ సంఘాల, ఆఫీసర్స్ అసోసియేషన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందం ప్రకారం, 2012 నవంబర్ 1వ తేదీ నుంచీ వర్తించే విధంగా ఈ తాజా వేతన సవరణ అమలవుతుంది. ఈ 15 శాతం వేతన పెంపు.. ఇంక్రిమెంటల్ వేతనం, అలవెన్సుల రూపంలో బ్యాంకులపై ఏడాదికి రూ.4,725 కోట్ల అదనపు భారాన్ని మోపుతుంది. పదవీ విరమణ వ్యయ భారాలను సైతం కలుపుకుంటే ఈ భారం రూ.8,370 కోట్లని ఐబీఏ చైర్మన్ టీఎం భాసిన్ సోమవారం నాడు ఇక్కడ విలేకరులకు తెలిపారు. సాధారణ ఉద్యోగులకు బకాయిలు వెంటనే చెల్లించడం జరుగుతుందని అన్నారు. అధికారుల విషయంలో ఈ శ్రేణి 4 నుంచి 6 నెలల కాలమని తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు త్వరలో రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలుగా ఉంటాయి. సెలవు దినాలకు సంబంధించి ఆర్బీఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపిందనీ, ప్రభుత్వ తుది ఆమోదం కోసం ఇప్పటికే లేఖ రాశామన్నారు. -
బ్యాంకులకు 7,940 కోట్లు
న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.7,940 కోట్ల మూలధన పెట్టుబడులను బడ్జెట్ ప్రతిపాదించింది. 2011 నుంచి 2014 వరకూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వ పెట్టుబడుల మొత్తం రూ.58,600 కోట్లు. అంతర్జాతీయ ప్రమాణాలకు సంబంధించి బాసెల్-3 అమలుకు బ్యాంకులకు మూలధన పెట్టుబడులుగా రానున్న రెండు, మూడేళ్లలో రూ. 2.4 లక్షల కోట్లు అవసరం అవుతాయని అంచనా. సర్ఫేసీ చట్ట పరిధిలోకి ఎన్బీఎఫ్సీలు: సర్ఫేసీ (సెక్యూరిటైజేషన్ అండ్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్‌ట్రస్ట్ యాక్ట్, 2002) చట్ట పరిధిలోకి దిగ్గజ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) బడ్జెట్ తీసుకువచ్చింది. ఎన్బీఎఫ్సీలు రుణ రికవరీ ప్రక్రియ సత్వర పరిష్కారం కావడానికి, మొండి బకాయిల సమస్యలపై కఠిన చర్యలకు ఈ చర్య దోహదపడుతుంది. ఆర్బీఐ వద్ద రిజిస్టరై, రూ.500 కోట్ల వరకూ ఆస్తుల పరిమాణం ఉన్న ఎన్బీఎఫ్సీలను సర్ఫేసీ యాక్ట్ కిందకు తీసుకువస్తున్నట్లు బడ్జెట్ ప్రతిపాదించింది. అటానమస్ బ్యాంక్స్ బోర్డ్ అటానమస్ (స్వతంత్ర) బ్యాంక్ బోర్డ్ బ్యూరో ఏర్పాటు ప్రతిపాదన కీలకమైనది. మూలధన సమీకరణపై బ్యాంకలకు ఇది స్వేచ్ఛ కల్పిస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌ల ఎంపిక విధానంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. బ్యాంకులకు హోల్డింగ్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏర్పాటు దిశలో ఇది ముందడుగు.