700 పాయింట్ల ఊగిసలాట
- బ్యాంక్ షేర్ల జోరు
- 141 పాయింట్ల లాభంతో 29,362కు సెన్సెక్స్
- 57 పాయింట్ల లాభంతో 8,902కు నిఫ్టీ
- మార్కెట్ అప్‌డేట్
ఎంతగానే ఊరించిన నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రథమ బడ్జెట్ స్టాక్ మార్కెట్‌లో తీవ్రమైన ఒడిదుడుకులను సృష్టించింది. బడ్జెట్ సందర్భంగా శనివారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో ప్రత్యేకమైన ట్రేడింగ్ నిర్వహించారు.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 678పాయింట్లు, నిఫ్టీ 190 పాయింట్ల రేంజ్‌లో కదలాడాయి. నిఫ్టీ8,900 పైన ముగిసింది. కార్పొరేట్ పన్ను తగ్గింపు, గార్ వాయిదా వంటి అంశాల కారణంగా సూచీలు చివరకు లాభాల్లోనే ముగిశాయి. నాలుగేళ్లలో బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్ పెరగడం ఇదే మొదటిసారి. బ్యాంక్, ఆరోగ్య సంరక్షణ, వాహన రంగ షేర్లు జోరుగా ఉండగా, ఎఫ్‌ఎంసీజీ, కన్సూమర్ డ్యూరబుల్, విద్యుత్ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. భారీ సంస్కరణలేమీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు నిరుత్సాహానికి గురయ్యారు. సెన్సెక్స్ ప్లస్ 340, మైనస్ 338 పాయింట్ల రేంజ్‌లో, నిఫ్టీ ప్లస్ 96, మైనస్ 94 రేంజ్‌లో కదలాడాయి.
నాలుగేళ్లలో కార్పొరేట్ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నామని, అలాగే జనరల్ యాంటీ-అవాయడెన్స్ ఆక్ట్(గార్)ను రెండేళ్లు వాయిదా వంటి ప్రతిపాదనలతో కొనుగోళ్లు జోరుగా పెరిగాయి. వృద్ధి అంచనాలు, ద్రవ్య క్రమశిక్షణ చర్యలు ఉండడం వంటి అంశాలూ సెంటిమెంట్‌కు మరింత ఊతాన్నిచ్చాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 29,411 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 29,560-28,882 పాయింట్ల గరిష్ట-కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది.చివరకు 141 పాయింట్ల లాభంతో 29,362 పాయింట్ల వద్ద ముగిసింది. 8,941-8,751 పాయింట్ల గరిష్ట-కనిష్ట స్థాయిల మధ్య కదలాడిన నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 8,902 పాయింట్ల వద్ద ముగిసింది.
యాక్సిస్ బ్యాంక్ 8 శాతం అప్ : సమగ్రమైన దివాళా నిబంధనలను రూపొందిస్తామన్న ప్రతిపాదన కారణంగా బ్యాంక్ షేర్లు బాగా పెరిగాయి. యాక్సిస్ బ్యాంక్ 8.1 శాతం పెరిగింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. సిగరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో ఐటీసీ 8.2 శాతం క్షీణించింది. 30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు లాభపడ్డాయి. 8 షేర్లు నష్టపోయాయి. 1,498 షేర్లు నష్టాల్లో, 1,230 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.21,350 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.3,68,210 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.614 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.741 కోట్ల విలువైన నికర అమ్మకాలు జరిపారు.