ఆదాయపు పన్ను శాఖ కింద పనిచేస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్లకు కాగ్ అక్షింతలు వేసింది.
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ కింద పనిచేస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్లకు కాగ్ అక్షింతలు వేసింది. సరైన పన్ను సమాచారం అందించనందువల్ల దాదాపు 367 కేసుల్లో శాఖకు రూ.2,813 కోట్ల పన్ను నష్టం వాటిల్లినట్లు తెలిపింది. తమకు సమర్పించిన 102 రిపోర్టులు లేదా సర్టిఫికేట్లలో లభించిన సమాచారాన్ని వినియోగించుకోవడంలో అసెస్‌మెంట్ అధికారుల వైఫల్యం వల్ల రూ.1,310 కోట్ల మేర పన్ను నష్టాలకు కారణమయ్యిందని సైతం కాగ్ తన తాజా నివేదికలో పేర్కొంది.
అలవెన్సుల్లో మినహాయింపులు లేదా తగ్గింపులు, సెక్షన్ 115 జేబీ కింద బుక్ ప్రాఫిట్‌పై పన్ను విధింపు వంటి అంశాలకు సంబంధించి 616 కేసుల్లో సీఏలు కొన్ని పొరపాట్లు చేసినట్లు తెలిపింది. 2010-11 నుంచి 2012-13 ఆర్థిక సంవత్సరాల మధ్య పూర్తయిన అసెస్‌మెంట్లకు సంబంధించి కాగ్ తన ఈ తాజా నివేదికను రూపొందించింది. 18.87 శాతం సీఏలు (12,435 సీఏలు) 2013-14 సంవత్సరానికి సంబంధించి ఐసీఏఐ నిర్దేశించిన పన్ను ఆడిట్ నివేదికలకన్నా ఎక్కువగా పన్ను ఆడిట్ నివేదికలను జారీ చేసినట్లు తెలిపింది. కొందరు సీఏలు తమ మెంబర్‌షిప్ నంబర్లను కూడా పేర్కొనని వైనాన్ని తాము గమనించినట్లు వెల్లడించింది.