60 శాతం పెరిగిన కెనరా నికర లాభం
ట్రెజరీ ఆదాయం భారీ వృద్ధి
ముంబై: కెనరా బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసిక కాలానికి 60 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.409 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.656 కోట్లకు పెరిగిందని బ్యాంక్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వి.ఎస్. కృష్ణకుమార్ చెప్పారు. గత క్యూ3లో రూ.77 కోట్లుగా ఉన్న ట్రెజరీ ఆదాయం ఈ క్యూ3లో రూ.301 కోట్లకు పెరిగిందని, అలాగే నగదు రికవరీ రూ.1,214 కోట్ల నుంచి రూ.4,427 కోట్లకు, ఫీజు ఆదాయం రూ.851 కోట్ల నుంచి 38 శాతం వృద్ధితో రూ. 1,176 కోట్లకు పెరిగిందని, వ్యయాలపై నియంత్రణ మంచి ఫలితాలనిచ్చిందని వివరించారు.
వీటన్నింటి కారణంగా నికర లాభం భారీగా వృద్ధి చెందిందని పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.2,380 కోట్లకు చేరిందని తెలిపారు. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 2.36 శాతానికి, అంతర్జాతీయంగా ఎన్‌ఐఎం 2.21 శాతం నుంచి 2.24 శాతానికి పెరిగిందని వివరించారు. స్థూల మొండి బకాయిలు 3.35 శాతం, నికర మొండి బకాయిలు 2.42 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాని బాకీలకు కేటాయింపులు రూ.543 కోట్ల నుంచి రూ.952 కోట్లకు పెంచామని తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1,095 కోట్ల రుణాలను పునర్వ్యస్థీకరించామని పేర్కొన్నారు. రుణాలు 9 శాతం వృద్ధితో రూ.3.12 లక్షల కోట్లకు, డిపాజిట్లు 13 శాతం వృద్ధితో రూ.4.62 లక్షల కోట్లకు పెరిగాయని తెలిపారు. ఫలితాలు అంచనాలను మించడంతో బీఎస్‌ఈలో కెనరా బ్యాంక్ షేర్ 3.2 శాతం వృద్ధితో రూ.453 వద్ద ముగిసింది.