కారు బీమా పాలసీ ఎంపిక ఇలా.. | car insurance policy choice | Sakshi
Sakshi News home page

కారు బీమా పాలసీ ఎంపిక ఇలా..

Published Sun, Nov 30 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

కారు బీమా పాలసీ ఎంపిక ఇలా..

కారు బీమా పాలసీ ఎంపిక ఇలా..

కారు కొనడం ఒక చక్కని అనుభూతి. ఏ కలర్ కారు కొనాలి.. ఫిట్టింగ్స్ ఏమిటి.. ఇంటీరియర్స్ ఎలా ఉండాలి.. ఇలాంటి వాటి గురించి గంటల తరబడి ఆలోచిస్తారు.  కొత్త కారులో చేయబోయే షికార్ల గురించి చర్చించుకుంటారు. అయితే ఇంతటితో సరిపోదు. కారుకు తగిన బీమా తీసుకోవడం గురించి కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆలోచించాలి. ఎటువంటి అనుకోని పరిస్థితులైనా... వ్యక్తిగతంగా అన్ని రకాల ప్రయోజనాలను పరిరక్షించగలిగే రీతిలో ఈ బీమా ఉండాలి. ఎవరో చెప్పినట్లు కాకుండా తగిన విధంగా ఎవరికి వారు పాలసీని ఎంపికచేసుకోడానికి ప్రయత్నించాలి. సమగ్ర పాలసీ ఎంపికలో కొన్ని సూచనలు...

థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్: అసలు ఈ కవరేజ్ లేకుండా రోడ్డుపైకి కారును తీసుకురావడానికే వీలులేదు. ఒక కారు ప్రమాదం వల్ల నష్టపోయే బయట వ్యక్తి నష్ట పరిహారానికి ఉద్దేశించినదే ఇది. నష్టం ఆస్తికి కావచ్చు. లేదా దురదృష్టవశాత్త్తూ లైఫ్ రిస్క్ కావచ్చు.

వ్యక్తిగత నష్ట నివారణ: ఎంతో ఇష్టంతో కొన్న కారు ఏదైనా ప్రమాదానికి గురైతే, దీనిని కవర్ చేసేదే ఈ తరహా పాలసీ. ఓన్ డ్యామేజ్ (ఓడీ) కవర్‌గా పేర్కొనే ఈ పాలసీ ద్వారా మెడికల్, మరమ్మతు నష్టాల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. చాలా మంది థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్ తీసుకోవడానికి ఇచ్చినంత ప్రాముఖ్యత,  ఓన్ డ్యామేజ్ కవర్‌కు ఇవ్వరు. ఈ ధోరణి ఎంతమాత్రం సరికాదు.

ఎంపిక చేసుకునే ముందు: మార్కెట్‌లో అనేక కార్ ఇన్సూరెన్స్ పాలసీలు లభ్యం అవుతుంటాయి. అయితే ఒక దానిని ఎంచుకునే ముందు వివిధ కంపెనీల పాలసీలను ఒకదానితో మరొకదానిని పోల్చుకోవాలి. దీనివల్ల తగిన సమాచారం తెలుసుకోవడమే కాకుండా, డబ్బును కూడా పొదుపు చేసుకోవచ్చు. మరమ్మతు వ్యయాలు, వైద్య ఖర్చులు, ప్రీమియంలు ఇలా ప్రతి అంశాన్ని పరిశీలించుకుని, ఆయా అంశాల ప్రాతిపదికన పాలసీ తీసుకోవాలి.

నిర్వహణ:  ప్రతి యేడాదీ రెన్యువల్‌పై సైతం ప్రధానంగా దృష్టి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రెన్యువల్ మధ్య అంతరం ఉండకుండా చూసుకోవాలి.

ఇలాంటి పరిస్థితులు తలెత్తితే- తగిన బీమా ప్రయోజనాలు పొందడంలో పలు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉండచ్చు. కోరుకున్న బీమా పరిమాణం లభించకపోవచ్చు. ఆలస్యంగా చేసుకునే రెన్యువల్ విషయంలో ఒక బీమా కంపెనీ ఏజెంట్ నుంచి మీరు ‘ప్రీ-ఎగ్జిస్టింగ్ డ్యామేజెస్’పై సవాలక్ష ప్రశ్నలను, సం దేహాలను ఎదుర్కొనాల్సి రావచ్చు.  ఓడీ కవర్ విషయాల్లో వార్షికంగా చెల్లించే ప్రీమియంలపై నో క్లెయిమ్ బోనస్ రద్దయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఈ విషయంలో అతి తక్కువ బోనస్‌నే పొందగలుగుతారు.

రెన్యువల్ సమయంలో ఇలా:  కారుకు అలాగే మీ డ్రైవింగ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా పొందికలో ఉన్నాయో- లేదో పరిశీలించుకోడానికి అలాగే డిస్కౌంట్లు ఎలా ఉన్నాయి... కవరేజ్‌లో మార్పులు... కంపెనీ నుంచి అందిన సేవలు.. వంటి అంశాలపై దృష్టి పెట్టే సమయమిది.  చాలా కంపెనీలు రెన్యువల్‌కు గ్రేస్ పీరియడ్ ఏదీ ఇవ్వడం లేదన్నది గుర్తుపెట్టుకోవాలి. ఈ కోణంలో ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూసుకోవాలి. కంపెనీ సేవల పట్ల అసంతృప్తి ఉన్నట్లయితే, పాలసీ రెన్యువల్ సమయంలో మీరు వేరొక బీమా సంస్థ సేవలకు మారవచ్చు.

అయితే ప్రస్తుత బీమా సంస్థ నుంచి వేరే కంపెనీ సేవలకు మారే సందర్భాల్లో ‘ప్రస్తుతం సేవలు అందిస్తున్న సంస్థ’ నుంచి ముందుగానే పూర్తి ప్రతిపాదిత పత్రం తో పాటు పాలసీ రెన్యువల్ నోటీసును పొందాలి.  ప్రీమియంల మధ్య ఎటువంటి అంతరం లేకుండా చూసుకోవడానికి ఈ విధానం దోహదపడుతుంది. బీమా సమయం మధ్యలో వేరే కంపెనీ సేవలకు మారి పోకుండా చూసుకోవడం మంచిది. అలా చేయడం వల్ల మీరు పలు ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంది. నో క్లెయిమ్ బోనస్ పొందలేకపోవడం ఇక్కడ ముఖ్యాంశం. ఒక కంపెనీ బీమా సేవలను రద్దు చేసుకునే ముందు అందుకు సంబంధించిన కారణాలన్నింటినీ సంబంధిత సంస్థకు లిఖితపూర్వకంగా తెలియజేయడం మరచిపోవద్దు. ఆ కంపెనీ నుంచి నో క్లెయిమ్ బోనస్ అర్హత సర్టిఫికేట్‌నూ తీసుకోవాలి.

కారు విక్రయిస్తే: ఒక వేళ మీ కారు విక్రయిస్తే, పాలసీ సంస్థ నుంచి పాలసీ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్‌ను పొందాలి. ఇలాంటి సమయంలో పాలసీ బదలాయింపు జరుగుతుంది కానీ ‘నో క్లెయిమ్ బోనస్’ ప్రయోజనం బదలాయింపు జరగదు. ఇందుకు సంబంధించిన వ్యత్యాసం మొత్తాన్ని బీమా ప్రయోజనం పొందబోతున్న వ్యక్తి చెల్లించాల్సి ఉంటుంది. మరో వాహనం కొనుగోలు చేస్తే, తీసుకునే కొత్త పాలసీ విషయంలో గత ‘ఎన్‌సీబీ’ ప్రయోజనం ఇక్కడ పొందడానికి వీలుంది. కారు కొనే ముందు ఈ అంశాలన్నింటిపైనా అవగాహన పెంచుకోండి. బెస్ట్ ఆఫ్ లక్..!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement