స్పీడు పెరుగుతున్న కారు భీమా ! | car policy | Sakshi
Sakshi News home page

స్పీడు పెరుగుతున్న కారు భీమా !

Published Sun, Mar 9 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM

స్పీడు పెరుగుతున్న  కారు  భీమా !

స్పీడు పెరుగుతున్న కారు భీమా !

 137 శాతం వరకూ పెరుగుతున్న థర్డ్ పార్టీ ప్రీమియం
 150 సీసీలోపు ద్విచక్ర వాహనాలకైతే ప్రీమియంలో 13% వృద్ధి
  350సీసీ దాటిన టూవీలర్ల ప్రీమియంలో భారీ తగ్గుదల
  ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ధరలు

 
 వాహన బీమా ప్రీమియంలు పెరుగుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం... అంటే ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి రాబోతున్నాయి. ముఖ్యంగా చిన్న కార్ల ప్రీమియంలు భారీగా పెరుగుతుండగా, ఇదే సమయంలో అధిక సామర్థ్యం కలిగిన ద్విచక్ర వాహనాలు, పబ్లిక్ కారియర్స్ ప్రీమియంలు తగ్గుతుండటం గమనార్హం. దీనికి సంబంధించి ఐఆర్‌డీఏ ఇప్పటికే ముసాయిదాను విడుదల చేసింది. వీటిని యథాతథంగా ఆమోదిస్తే.. ప్రతి వాహనదారుడికీ కచ్చితంగా కలిగి ఉండాల్సిన థర్డ్ పార్టీ ప్రీమియం ధరలు భారీగానే పెరుగుతాయి. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం..
 
 
 దేశీయ మోటార్ వాహన చట్టం ప్రకారం ప్రతి వాహనదారుడూ పూర్తిస్థాయి బీమా కాకపోయినా కనీసం థర్డ్ పార్టీ బీమా రక్షణను తప్పకుండా తీసుకుని ఉండాలి. ఇటీవల ప్రమాదాలు పెరిగి... క్లెయిముల సంఖ్య కూడా భారీగా పెరగటంతో 2014-15 సంవత్సరానికి ఈ థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లను సవరిస్తూ ఐఆర్‌డీఏ నిర్ణయం తీసుకుంది. ఈ రేట్లు అమలు చేస్తే చాలా కార్ల ప్రీమియం ధరలు కనీసం 25 నుంచి 137 శాతం వరకు పెరుగుతాయి. అదే ద్విచక్ర వాహనాల్లో గరిష్టంగా 45 శాతం వరకు ప్రీమియం పెరగవచ్చు. గతేడాది దాఖలైన క్లెయిమ్‌ల ఆధారంగా ఐఆర్‌డీఏ ఈ ప్రీమియం ధరలను సవరించింది.
 
 థర్డ్ పార్టీ అంటే..
 సాధారణంగా వాహన బీమాలో రెండు రకాల నష్టాలు జరుగుతుంటాయి. ప్రమాదంలో సొంత కారుకు నష్టం వాటిల్లడం కాని, మన కారు వల్ల ఎదుటి వారి(థర్డ్ పార్టీ)ఆస్తికి, లేదా ప్రాణానికి నష్టం సంభవించడం కాని జరుగుతుంది. సొంత కారుకు జరిగే నష్ట అంచనాని బీమా కంపెనీ నిర్దేశించడమే కాకుండా ఇది పరిమిత స్థాయిలోనే ఉంటుంది. అదే థర్డ్ పార్టీకి జరిగే నష్టానికి వచ్చే సరికి ఆ విలువపై ఎటువంటి పరిమితులు ఉండవు. కొన్ని సందర్భాల్లో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరగొచ్చు. ఇలాంటి కేసుల్లో నష్ట పరిహారాన్ని కోర్టులు అంచనా వేస్తాయి. అదే కేవలం ఆస్తి నష్టమైతే గరిష్టంగా రూ.7.5 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది.
 
 ఎందుకు పెరుగుతున్నాయి?
 వాహనదారులు తప్పకుండా కలిగి ఉండాల్సిన ఈ థర్డ్ పార్టీ ప్రీమియంలను ఐఆర్‌డీఏ నియంత్రిస్తుంటుంది. వస్తున్న ప్రీమియం కన్నా చెల్లిస్తున్న క్లెయిమ్‌లు ఎక్కువగా ఉంటే బీమా కంపెనీలు నష్టాల్లోకి జారుకునే ప్రమాదం ఉంది. అందుకని 2011 నుంచి ప్రతి ఏటా ప్రీమియం టారిఫ్‌లను సమీక్షించాకే ఐఆర్‌డీఏ నిర్ణయం తీసుకుంటోంది. 2007-08లో సగటు డెత్  క్లెయిమ్ రేటు రూ.2.1 లక్షలుగా ఉంటే అది ఇప్పుడు రూ.3.9 లక్షలకు చేరుకుంది. ముఖ్యంగా 1,000 సీసీ, 1,500 సీసీలోపు సామర్థ్యం కలిగిన కార్లలో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గమనించింది. దీంతో ఈ ఏడాది  ఈ విభాగంలో టారిఫ్ రేట్లను ఐఆర్‌డీఏ భారీగా పెంచింది.
 
 ముఖ్యంగా 1000 సీసీలోపు ఉండే వేగన్ ఆర్, మారుతీ ఆల్టో వంటి చిన్న కార్ల థర్డ్ పార్టీ ప్రీమియంలు సుమారుగా ఒకటిన్నర రెట్లు పెరుగుతున్నాయి. ఈ ఏడాది రూ.941 చెల్లిస్తే వచ్చే ఏడాది ఏకంగా రూ.2,227 కట్టాల్సి ఉంటుంది. కాని ఇదే సమయంలో ప్రమాదాల సంఖ్య తక్కువగా ఉన్న ప్రైవేటు కారియర్స్, 350 సీసీ సామర్థ్యం ఉన్న బైక్‌ల ప్రీమియంలు తగ్గుతున్నాయి. 350 సీసీ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహన ప్రీమియం ధరలు రూ.804 నుంచి రూ.306 తగ్గుతున్నాయి. సవరించిన తర్వాత 350 సీసీ బైక్స్ కంటే 75 సీసీ ద్విచక్ర వాహన ప్రీమియంలు ఎక్కువగా ఉండటం విశేషం. వివిధ వాహనాల ప్రీమియం ధరలు ఇప్పుడెలా ఉన్నాయి? ఏప్రిల్ 1 నుంచి ఎలా ఉంటాయన్నది దిగువ పట్టికలో చూడొచ్చు...
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement