సాక్షి, న్యూఢిల్లీ : వాహనదారులు ఇక మీదట జాగ్రత్తగా నిబంధనలను పాటించాల్సిందే. లేదంటే జరిమానాల మోత మోగనుంది ఈ మేరకు మోటారు వాహనాల (సవరణ) బిల్లులో ప్రతిపాదిత మార్పులను కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, రహదారి భద్రత, నిబంధనల ఉల్లంఘనపై జరిమానాతో పాటు అవినీతిని అరికట్టడం లాంటి అంశాలను ప్రధానంగా ఈ బిల్లు పరిగణనలోకి తీసుకుంది. ప్రతిపాదిత సవరణ ప్రకారం మద్యం తాగి వాహనం నడిపితే జరిమానాను ఐదు రెట్లు పెంచనుంది. అలాగే ప్రమాదకరమైన రేసింగ్‌లు, అతివేగంగా నడిపితే జరిమానాను ఏకంగా పది రెట్లు పెంచేందుకు ప్రతిపాదించింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో సవరణ బిల్లును రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టనుంది
తాజా నిబంధనల ప్రకారం జరిమానా తాగి వాహనం నడిపితే రూ.10వేలు జరిమానా. పరిమితికి మించి వేగంగా వాహనాన్ని నడిపితే రూ. 5వేలుగా ఉండనుంది. రోడ్డు ప్రమాద మృతులకు రూ. పది లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ. 2 లక్షలు పరిహారం మరో ముఖ్యమైన నిబంధన. ప్రైవేటు రవాణా సంస్థలు లైసెన్సింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా విధించాలని ఈ సవరణ ప్రతిపాదించింది. ఓవర్ లోడింగ్ వాహనాలు రూ. 20 వేల పెనాల్టీ కట్టేలా బిల్లులో నిబంధనల్ని చేర్చారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు రూ.లక్ష వరకూ జరిమానా విధించేలా బిల్లును రూపొందించారు.
అంతేకాదు రహదారి ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వారికి, లేదా సమాచారం అందించిన వ్యక్తులు వేధింపులకు గురికాకుండా ఉండేలా ప్రతిపాదిత సవరణ చేసింది. అలాగే థర్డ్‌పార్టీ బీమాను గరిష్టంగా రూ.10 లక్షలు పరిమితం చేయాలనేది మరో ప్రతిపాదన. కొత్త వాహనాల నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, డ్రైవింగ్ లైసెన్స్ , వాహన రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ తప్పనిసరి అని తెలిపింది.
డ్రైవింగ్ లైసెన్స్ వాలిడిటీ విషయంలో కూడా మార్పులు తీసుకురావాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం 50 సంవత్సరాల వయస్సున్న ఒక వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ 20 వరకు సంవత్సరాలు చెల్లుతుంది. అయితే దీంట్లో వివిధ కేటగిరీలను చేర్చాలని భావిస్తోంది. ఉదాహరణకు, లైసెన్స్ హోల్డర్ వయస్సు 30-50 సంవత్సరాల మధ్య ఉంటే 10 సంవత్సరాల వరకు మాత్రమే( ప్రస్తుతం 20 ఏళ్ళతో పోలిస్తే) చెల్లుతుంది.
కాగా ఈ సవరణలకు సంబంధించిన ఈ బిల్లుకు లోక్‌సభలో 2017 లో ఆమోదం లభించినప్పటికీ రాజ్యసభ మద్దతు పొందడంలో విఫలమైంది. ఈ ప్రతిపాదనలతో కూడిన బిల్లు చట్టం రూపం దాల్చాలంటే ఉభయ సభల అనుమతి పొందాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment