
రూ. 50 వేల లోపు ఐటీ రిఫండ్స్ ఇక జోరుగా
పెండింగ్‌లో రూ.5,400 కోట్ల రిఫండ్‌లు
న్యూఢిల్లీ: ఐటీ రిఫండ్స్ కోసం వేచిచూస్తున్న లక్షలాది పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. రూ.50,000 లోపు ఉన్న ఐటీ రిఫండ్స్‌ను వీలైనంత త్వరగా సెటిల్ చేయాలని ప్రభుత్వం ఆదాయపు పన్ను అధికార వర్గాలను ఆదేశించింది. దీనికి సంబంధించిన ఆదేశాలు ఈ వారం మొదట్లోనే ప్రభుత్వం జారీ చేసిందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్(సీబీడీటీ) ఉన్నతాధికారులతో రెవెన్యూ కార్యదర్శి హశ్‌ముఖ్ అధియాతో గత వారం ప్రారంభంలో జరిగిన సమావేశానంతరం ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
పన్ను సంబంధిత ఫిర్యాదులు తగ్గేలా, పన్ను చెల్లింపుదారుల సమస్యలు తీర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సూచించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ.5,400 కోట్ల విలువైన ట్యాక్స్ రిఫండ్‌లు పెండింగ్‌లు ఉన్నాయి. కాగా ఈ ఏడాది నవంబర్ 1 నాటికి 2.07 లక్షల ఐటీ రిటర్న్‌లకు సంబంధించి రిఫండ్‌లను ఐటీ శాఖ పంపించింది. సీబీడీటీకి వచ్చే ఫిర్యాదుల్లో అధిక భాగం ఐటీ రిఫండ్‌ల గురించే వస్తుండడం విశేషం.