లాక్‌డవున్ నిబంధనలను సడలించడం మొదలుపెట్టాక ఈ నెలలో సిమెంటుకు డిమాండ్ ఊపందుకున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కొద్ది రోజులుగా మౌలిక రంగ కార్యకలాపాలు పెరిగినట్లు తెలియజేశాయి. జాతీయ రహదారుల అభివృద్ధి పనులు వేగమందుకున్నట్లు తెలియజేశాయి. అంతేకాకుండా నైరుతి రుతుపవనాల కంటే ముందుగానే నిర్మాణపనులు పూర్తిచేసే యోచనలో గ్రామ ప్రాంతాలలోనూ పనులు ప్రారంభమైనట్లు వివరించాయి. దీంతో పలు కంపెనీలు 60-70 శాతంమేర సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా దేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాలలో సిమెంటుకు అంచనాలకు మించి డిమాండ్ కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాలలో రిటైల్ మార్కెట్లో సిమెంట్ బ్యాగ్‌పై రూ. 20-90 మధ్య ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఉత్తర, పశ్చిమ, మధ్య భారతాల్లో రూ. 20-30 మధ్య, తూర్పు ప్రాంతాల్లో రూ. 20-50 మధ్య ధరలు బలపడగా.. దక్షిణాదిన మరింత అధికంగా రూ. 40-90 పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మరోవైపు గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో పలు కంపెనీలు ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించడం కూడా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా సిమెంట్ రంగ కౌంటర్లు ర్యాలీ బాటలో సాగుతున్నట్లు పేర్కొన్నారు.
వారం రోజులుగా
గత వారం రోజులుగా పలు సిమెంట్ కౌంటర్లు బలపడుతూ వస్తున్నాయి. బిర్లా కార్పొరేషన్, జేకే లక్ష్మీ సిమెంట్, అల్ట్రాటెక్, శ్రీ సిమెంట్, ఏసీసీ, అంజనీ పోర్ట్‌లాండ్, కాకతీయ తదితరాలు 8-20 శాతం మధ్య ర్యాలీ చేశాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో అల్ట్రాటెక్ నికర లాభం రూ. 1085 కోట్ల నుంచి రూ. 3239 కోట్లకు ఎగసింది. ఇందుకు ప్రధానంగా పన్ను లాభాలు సహకరించాయి. ఇక బిర్లా కార్పొరేషన్ నికర లాభం 52 శాతం జంప్‌చేసి రూ. 195 కోట్లను తాకింది. అయితే లాజిస్టిక్స్ సమస్యలతో ఆదాయం 9 శాతం క్షీణించి రూ. 1718 కోట్లకు పరిమితమైంది. ఇదే కాలంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జేకే లక్ష్మీ సిమెంట్ రూ. 99 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది రెట్టింపునకుపైగా వృద్ధికాగా.. వ్యయాల కట్టడి లాభదాయకతకు కారణమైనట్లు కంపెనీ పేర్కొంది.
షేర్లు జూమ్
ఆకర్షణీయ ఫలితాల కారణంగా ప్రస్తుతం మరోసారి బిర్లా కార్పొరేషన్ కౌంటర్ జోరందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో 8.6 శాతం దూసుకెళ్లి రూ. 530 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 538 వరకూ ఎగసింది. ఇక జేకే లక్ష్మీ సిమెంట్ 3.6 శాతం ఎగసి రూ. 243 వద్ద కదులుతుంటే.. అంజనీ పోర్ట్‌ల్యాండ్ 6.3 శాతం జంప్‌చేసి రూ. 134 వద్ద ట్రేడవుతోంది.
ర్యాలీ నిలవకపోవచ్చు
గతేడాది క్యూ4లో పటిష్ట ఫలితాలు, ఇటీవల సిమెంట్ బ్యాగుపై పెరిగిన ధరలు సిమెంట్ రంగ కౌంటర్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. చమురు ధరల పతనం సైతం ముడివ్యయాలు తగ్గేందుకు దోహదం చేయనున్నట్లు తెలియజేశారు. ఫలితంగా సిమెంట్ కంపెనీల లాభదాయకత మెరుగుపడే వీలున్నదని అంచనా వేశారు. అయితే కోవిడ్-19 విస్తృతి కారణంగా ఆర్థిక వ్యవస్థ కొంతకాలం మందగించనుందని, ఫలితంగా సిమెంట్ కౌంటర్లలో ర్యాలీ కొనసాగకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment