పసిడి కొనుగోళ్లకు తగిన సమయం! | Central banks' gold demand to remain buoyant: WGC | Sakshi
Sakshi News home page

పసిడి కొనుగోళ్లకు తగిన సమయం!

Published Sat, Sep 22 2018 1:30 AM | Last Updated on Sat, Sep 22 2018 1:30 AM

Central banks' gold demand to remain buoyant: WGC - Sakshi

ముంబై: ప్రస్తుత పరిస్థితులు పసిడి కొనుగోళ్లకు సరై న సమయంగానే కనిపిస్తోంది. విశ్లేషణలోకి వెళితే... పసిడికి పలు దేశాల కేంద్ర బ్యాంకుల నుంచి డిమాం డ్‌ పటిష్టంగా ఉందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) నివేదిక ఒకటి తాజాగా పేర్కొంది. ఈ డిమాం డ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఈ మేరకు విడుదలైన ఒక నివేదికను చూస్తే...

ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో దేశీ మారక ద్రవ్య నిల్వల్లో పసిడి వాటా పెంచుకోవడంపై కేంద్ర బ్యాంకులు దృష్టి పెట్టాయి. ఇందులో ఎక్కువశాతం పసిడి రూపంలో ఉండాలనే విషయంపై దృష్టి పెట్టడం గమనార్హం.
 2018 మొదటి ఆరు నెలల కాలంలో సెంట్రల్‌ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం పసిడికి 193.3 టన్నుల బంగారం అదనంగా చేరింది. 2017 ఇదే కాలంతో పోల్చిచూస్తే (178.6 టన్నులు) ఇది 8 శాతం అధికం.  
 ఇప్పటికే పలు సెంట్రల్‌ బ్యాంకుల విదేశీ మారకపు నిల్వల్లో అమెరికా డాలర్లు భారీగా ఉన్నాయి. వీటికి పసిడితో కొంత రక్షణ కల్పించాలని కేంద్ర బ్యాంకులు భావిస్తున్నాయి.  రష్యా, టర్కీ, కజికిస్తాన్‌ వంటి దేశాల సెంట్రల్‌ బ్యాంకుల ఇటీవలి చర్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.  
 2015 తర్వాత ఈ స్థాయిలో పసిడికి కేంద్ర బ్యాం కుల నుంచి డిమాండ్‌ రావడం ఇదే తొలిసారి.  
 ఈజిప్టు 1978 తరువాత మొట్టమొదటిసారి ఇటీవలే పసిడిని కొనుగోలు చేసింది. ఇండియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, ఫిలిప్పైన్స్‌ కూడా పలు సంవత్సరాల తర్వాత మళ్లీ పసిడి మార్కెట్‌లోకి పునఃప్రవేశిస్తున్నాయి.  

తొమ్మిదేళ్ల తర్వాత బంగారాన్ని కొన్న ఆర్‌బీఐ...
రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) 2017–18 ఆర్థిక సంవత్సరంలో 8.46 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. తొమ్మిదేళ్లలో ఆర్‌బీఐ పసిడిని కొనుగోలు చేయడం మొదటి సారి. 2018 జూన్‌ 30 నాటికి  ఆర్‌బీఐ వద్ద పసిడి నిల్వలు 566.23 టన్నులకు చేరాయి. 2017 జూన్‌ నాటికి ఉన్న నిల్వలు 557.77 టన్నులు మాత్రమే. చివరి సారిగా 2009లో 200 టన్నుల పసిడిని ఐఎంఎఫ్‌ నుంచి కొంది.  కాగా దేశీయంగా రూపాయి బలహీన ధోరణి భారత్‌లో బంగారం తగ్గడానికి దోహదపడదని విశ్లేషణ.


400 బిలియన్‌ డాలర్లకు పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు
బంగారం నిల్వలు సైతం పెరుగుదల
విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్‌) సెప్టెంబర్‌ 14తో అంతమైన వారానికి 1.207 బిలియన్‌ డాలర్లు పెరిగి 400.489 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. అంతకుముందు వారంలో ఫారెక్స్‌ నిల్వలు 819 మిలియన్‌ డాలర్ల క్షీణతతో 399.282 బిలియన్‌ డాలర్లకు తగ్గిన విషయం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌ 13తో ముగిసిన వారంలో నమోదైన 426 బిలియన్‌ డాలర్ల ఫారెక్స్‌ నిల్వలు రికార్డు స్థాయి కాగా, ఆ తర్వాత నుంచి క్షీణత మొదలైంది. ఇక బంగారం నిల్వలు సైతం సెప్టెంబర్‌ 14తో ముగిసిన వారంలో 144 మిలియన్‌ డాలర్లు పెరిగి 20.378 బిలియన్‌ డాలర్ల విలువకు చేరినట్టు ఆర్‌బీఐ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.  


1,200 డాలర్లు పటిష్టస్థాయి
అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– నైమెక్స్‌లో పసిడి  ఔన్స్‌ (31.1గ్రా) ధర గడిచిన నెల రోజులుగా 1,200 డాలర్ల వద్ద కదలాడుతోంది. పసిడికి ప్రస్తుత ధర అంతర్జాతీయంగా పటిష్ట మద్దతు స్థాయని అభిప్రాయం. రూపాయి బలహీనతల వల్ల ఇక భారత్‌లోనూ భారీగా తగ్గే అవకాశాలు ఏవీ కనిపించడం లేదు.  విశ్లేషకుల అంచనాల ప్రకారం– 1,200 డాలర్ల  ధర పసిడి ఉత్పత్తిదారులకు కొంత లాభదాయకమైనదే. అయితే ఈ స్థాయికన్నా కిందకు పడితే, ఉత్పత్తి... అందుకు అనుగుణంగా సరఫరాలు నిలిచిపోయే అవకాశం ఉంది.

ఇదే జరిగితే పసిడికి డిమాండ్‌ కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రస్తుత శ్రేణిలో మరో ఐదారు నెలలు 40 డాలర్ల అటు– ఇటుగా పసిడి కదలికలు జరిగే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. టెక్నికల్‌గా చూసినా, ఫండమెంటల్‌గా చూసినా, నిర్వహణా పరంగా అలోచించినా పసిడి ప్రస్తుతం ‘‘స్వీట్‌ స్టాప్‌’’అన్నది వాదన. గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో చైనా పెట్టుబడిదారులు ఇటీవలి కాలంలో 68 డాలర్లు పెట్టుబడులు పెట్టారు. ఇది మూడు నెలల గరిష్ట స్థాయి కావడం ఇక్కడ గమనార్హం. ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ను చూస్తే, 89కి పడిన తర్వాత మళ్లీ 96ను చూసిన ఇండెక్స్‌ మళ్లీ ఆస్థాయిలో నిలదొక్కుకోలేక ప్రస్తుతం 93ను చూస్తుండడం ఇక్కడ గమనార్హం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement