
ఐఐటీ మద్రాస్‌లో ఇన్ఫీ మూర్తి విభాగం
చెన్నై: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి పేరుతో మద్రాస్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రత్యేక విభాగం (చెయిర్) ఏర్పాటైంది. ఇన్ఫీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్ దీన్ని నెలకొల్పారు. రూ. 10 కోట్ల నిధితో ఏర్పాటైన ఈ విభాగంలో ఐఐటీలోని ప్రముఖ ప్రొఫెసర్లు కంప్యుటేషన్ బ్రెయిన్ అంశంపై అధ్యయనం చేస్తారు. మెదడుపై పరిశోధనలకు సంబంధించి ఇది భారత్‌కి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తేగలదని నారాయణ మూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు.
న్యూయార్క్‌కు చెందిన పార్థ మిత్రా సారథ్యంలోని ఈ విభాగంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. కార్పొరేట్ జీవన విధానం గురించి మూర్తి నుంచి తానెన్నో విషయాలు నేర్చుకున్నానని క్రిస్ తెలిపారు. వివిధ అంశాలపై పరిశోధనలను ప్రోత్సహించేందుకు క్రిస్ తలో రూ. 10 కోట్లతో మొత్తం మూడు విభాగాలు ఏర్పాటు చేస్తున్నారు. తన గురువు, ఐఐటీ మాజీ ప్రొఫెసర్ మహాబల పేరిట ఇప్పటికే ఒక విభాగం నెలకొల్పారు.