హైటెక్ నగరిలో కథాలహరి... | Beginning of the harikatha in hi-tech city | Sakshi
Sakshi News home page

హైటెక్ నగరిలో కథాలహరి...

Published Sun, Sep 15 2013 3:09 AM | Last Updated on Sat, Sep 22 2018 8:06 PM

హైటెక్ నగరిలో కథాలహరి... - Sakshi

హైటెక్ నగరిలో కథాలహరి...

కాళ్లకు గజ్జెలు, చేతిలో చిడతలు, ఇద్దరు తోడు వాయిద్యాలు... ‘వినరా వినరా... విష్ణువు కథా వివరము చెబుతాను’ అంటూ హరికథా కాలక్షేపం ప్రారంభం. అదీ ఎక్కడ... ఇన్ఫోసిస్ లాంటి కార్పొరేట్ హౌజ్‌లోనో, డివిఎస్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్లోనో... ఇంటి గుమ్మం దాటని గృహిణులుండే గేటెడ్ కమ్యూనిటీలోనో, ఇంటర్నెట్ తప్ప ఇంకేమీ పట్టని అల్ట్రా మోడ్రన్ యూత్ మధ్యలోనో. పిల్లలకు నాలుగు మంచి విషయాలు చెప్పే ఓర్పు లేకపోగా, హరికథలూ, బుర్రకథలూ వినేకాలమా ఇది? అని ప్రశ్నించేవాళ్లకు పాఠంలా... నిన్నటి మన బంగారు బాల్యాన్ని ‘కథ’ సాక్షిగా మనకోసం తిరిగి వెలిగిస్తున్న దీపాకిరణ్ హైటెక్‌నగరిలో స్టోరీటెల్లింగ్‌కి ఓ ఆశాకిరణం.
 
‘రంపాపమ్ రంపాపమ్’ అంటూ  దీప జానపద కథలకు రిథమ్‌ను జోడించగానే హాజరైన వారుసైతం జత కలుస్తారు. జన్మతః తమిళనాడుకు చెందిన దీప ఎడ్యుకేషన్ కన్సల్టెంట్‌గా, టీచర్‌గా, ఫ్రీలాన్స్‌రైటర్‌గా, ఆల్ ఇండియా రేడియోలోనూ పనిచేశారు. ఆమె ఒకప్పుడు క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ‘టీచర్‌గా పిల్లలకి కథలు చెప్తూ వారెంత ఆనందిస్తున్నారో అంతే ఆనందాన్ని నేనూ పొందేదాన్ని’ అని వివరించారామె. కథలు చెప్పడం ద్వారా కలుగుతున్న ఆనందం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ కథల కోసం చేసిన అన్వేషణ ఆమె మరింతగా స్టోరీటెల్లింగ్‌పై ఆసక్తి పెంచుకునేలా చేశాయి. కిడ్నీ వ్యాధి, అధిక బరువు సమస్యలను అధిగమించడానికి కూడా తనకు స్టోరీటెల్లింగ్ చక్కని మార్గంగా ఉపకరించింది అంటారామె. ‘ఇది కేవలం నోటికి మాత్రమే పని చెప్పేది కాదు ఇందులో హావభావాలుంటాయి, పాటలుంటాయి, నృత్యాలుంటాయి. అద్భుతమైన శారీరక, మానసిక ఉల్లాసాల్ని అందిస్తుంది’ అని చెప్పే దీప ఐదేళ్ల క్రితం పూర్తిస్థాయి స్టోరీటెల్లర్ అవతారమెత్తారు.
 
 కార్పొరేట్ కంపెనీల్లో కథా ప్రవాహం...    
 
 ‘ఏ అంశంపైనయినా కథలు సృష్టించవచ్చు. మనం చెప్పాలనుకున్నదాన్ని మరింత బలంగా, ఆసక్తికరంగా చెప్పడానికి స్టోరీటెల్లింగ్ ఉపకరిస్తుంది’ అంటున్న దీప కార్పొరేట్ కంపెనీలనూ ఆకట్టుకుంటున్నారు. గత కొంతకాలంగా డీపీఎస్, భారతీయవిద్యాభవన్స్ వంటి పేరున్న స్కూళ్లలో, లైబ్రరీల్లో, కల్చరల్ సెంటర్లలో, పబ్లిషింగ్ హౌస్‌లలో, మైక్రోసాఫ్ట్, జెన్‌ప్యాక్ వంటి కార్పొరేట్ సంస్థల్లో సైతం ఆమె స్టోరీటెల్లింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘దీనిని కేవలం ‘పిల్ల’కథలుగా మాత్రమే చూడకూడదు.

కార్పొరేట్ కంపెనీ ప్రజెంటేషన్స్‌కూ, టీమ్‌బిల్డింగ్ వర్క్‌షాప్‌లకూ... ఏ రంగంలోని వారికైనా స్టోరీటెల్లింగ్ స్కిల్స్ ఉపయుక్తమే’అంటారామె. కథను మరింత జనరంజకంగా మలచడానికి ఆమె సంగీతాన్ని, నృత్యాన్ని దీనికి జతచేస్తున్నారు. గజ్జెలు ధరించి చిడతలు పట్టుకుని ఆమె హరికథాకాలక్షేపం సమర్పిస్తుంటే తోడు వాయిద్యాలు... ఆమె ఇద్దరు కొడుకులే. ‘మేమూ కథలు చెప్పే పనిలో పాలుపంచుకుంటాం అంటూ వారూ నాతో జతకలిశారు. నేను చెప్పింది కాదు’ అంటూ తన కుమారులు తనకు తోడైన నేపథ్యాన్ని వివరించారామె. టెలివిజన్‌లూ, ట్యాబ్లెట్ పీసీల కాలంలో తాతలు, బామ్మల ఒడినే  బడిచేసి చెప్పిన కమ్మని కథల్ని తిరిగి మనకు చేరువ చేయాలని, మన విజయాలకు కథలను తోడుచేయాలని దీపాకిరణ్ ఆశిస్తున్నారు. ఏదేమైనా... అంతరించిపోతున్న కళకు ఆమె దీపంలా మారుతున్నారు. ఆ వెలుగులు మరింత మందికి ప్రేరణ కావాలని ఆశిద్దాం.
 
  స్టోరీటెల్లింగ్‌తో లాభాలెన్నో...

 మన ముందున్న వాళ్లని మన మాటలతో కళ్లతో, ఇంటరాక్షన్‌తో... వాళ్ల స్పందనకి  మనం స్పందిస్తూ చేసే పూర్తిస్థాయి కమ్యూనికేషన్ మార్గమిది.
 
 ‘మీ పిల్లలు తెలివిగలవాళ్లు కావాలంటే వారికి కథలు చెప్పాలి. ఇంకా తెలివిగలవాళ్లు కావాలంటే మరిన్ని కథలు చెప్పాలి’ అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అంటారు. కథ వింటున్నపుడు పిల్లల ఊహాశక్తి మెరుగవుతుంది.
   
 జ్ఞాపకశక్తికి మేలు. వాస్తవానికి స్కూల్లో చెప్పే పాఠాలు పిల్లలకు సగం కూడా గుర్తుండవు. కానీ కథలో అన్నీ గుర్తుంచుకుంటారు. కథలో విన్న డైలాగ్‌లు నిజజీవితంలోనూ వినియోగిస్తారు.
 
 ఆంగ్లంలో కథలు వినడం వల్ల భాషా పరిజ్ఞానం పెరుగుతుంది.
 
  ఓ బిజినెస్ ఈవెంట్‌లో అందించాలనుకున్న సందేశాన్ని సింపుల్‌గా, సరళంగా మార్చేస్తుంది.
 
 వ్యక్తుల హృదయాల్లోకి చొచ్చుకువెళ్లి వారి సబ్‌కాన్షియస్ మైండ్‌ను ప్రేరేపించి నిర్ణయాలను సైతం ప్రభావితం చేసే శక్తి దీనికి ఉంది.
 
 కథలు చెప్పేటప్పుడు...
 కదిలించేలా, శ్రోతలకు ఓ ఊహాజనిత ప్రపంచాన్ని చేరువ చేసేలా కథలు చెప్పాలి. దీనికి పెయింటింగ్, పేపర్ కట్టింగ్, ఆర్ట్, పాటలు... ఇంకేదైనా సరే మాధ్యమంగా ఎంచుకోవడం అవసరం.
 
 పిల్లల ఏకాగ్రతను మనవైపు నిలిచేలా చేసుకోవడం ఒక పట్టాన సాధ్యం కాదు కాబట్టి చిన్నారులకు చెప్పేటప్పుడు  సమయోచిత వైఖరి అవసరం. కథ ఆధారంగా తమ ఊహల్ని నిర్మించుకోవడానికి వారికి తగిన సమయం ఇవ్వాలి.
 
  ప్రతి సందర్భానికీ అనుగుణమైన కథలున్నాయి. సబ్జెక్ట్‌కి, అంశానికి సంబంధించి కూడా ఉన్నాయి. థీమ్‌పై ఆధారపడి, ప్రజెంటేషన్‌లోని ముఖ్యాంశాలపైనా.. కథలు అల్లుకోవచ్చు.
 
 ఎత్తుగడ, ప్రధానాంశం, ముగింపు... ఈ మూడు దశలే ఏ కథకైనా ప్రాణం.  ప్రారంభాన్ని, ముగింపును బట్టే  స్టోరీటెల్లర్ నైపుణ్యం తెలుస్తుంది.
 
 అన్ని కళల్లానే స్టోరీటెల్లింగ్ కూడా కొందరికి జన్మతః వస్తే... మరికొందరు ప్రయత్నంతో నేర్చుకోవచ్చు. ప్రతి వ్యక్తికీ కథలు చెప్పే సామర్థ్యం ఉంటుంది. అవసరమైన, తోచిన మార్గంలో కొందరు అది ఇప్పటికే నిరూపిస్తున్నారు కూడా. ఈ సామర్థ్యాన్నే మరింత మెరుగుపరచుకుంటే ప్రొఫెషనల్‌గా మారవచ్చు. శ్రోతలు ఎవరు? ఎంత వయసు వారు అనేదాన్ని బట్టి మనం చెప్పే శైలిలో మార్పు చేర్పులు అవసరం.
 
 కథాకాలక్షేపాలు షురూ...
  తాతల కాలం నాటి కథాకాలక్షేపాలు తిరిగి రానున్నాయా? నగరంలో స్టోరీటెల్లింగ్‌కు పెరుగుతున్న ఆదరణ గమనిస్తే అవుననే అనిపిస్తుంది. ప్రసిద్ధ సాంస్కృతిక కేంద్రాలైన గోతెజంత్రం, లామకాన్, సప్తపర్ణి... వంటి చోట్ల వారాంతాల్లో ఏర్పాటవుతున్న ఈ కథా కార్యక్రమాలకు పెద్ద యెత్తున నగరవాసులు హాజరవుతున్నారు. ప్రొఫెషనల్ స్టోరీ టెల్లర్స్‌కు అమాంతం డిమాండ్ ఊపందుకుంది.   
 
 ప్రపంచవ్యాప్త క్రేజ్...
 స్టోరీటెల్లింగ్‌కు నగరంలో ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తుంటే... విదేశాల్లో మాత్రం విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంటర్నెట్ వేదికగా ప్రపంచవ్యాప్త స్టోరీటెల్లర్స్ నెట్‌వర్క్ కూడా పనిచేస్తోంది. ఏటేటా సింగపూర్‌లో ఇంటర్నేషనల్ స్టోరీ టెల్లర్స్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఇందులో దీపాకిరణ్ కూడా పాల్గొన్నారు. ఈ స్టోరీటెల్లింగ్‌కి దుబాయ్‌లో మంచి మార్కెట్ ఉంది. అమెరికా, మలేషియా,హాంగ్‌కాంగ్‌లలో సైతం స్టోరీటెల్లింగ్ అంటే  చెవి కోసుకుంటారు. మన నగరంలోనూ రెండేళ్ల నుంచీ స్టోరీటెల్లింగ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు.    
 
 సృజనాత్మకతకు మేలు...
  పుస్తకాలు, విజువల్ మీడియా కన్నా నోటి ద్వారా కథ చెప్పడం మరింత ప్రభావం చూపుతుంది. కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు తమ ప్రెజంటేషన్స్, స్పీచ్‌లలో స్టోరీటెల్లింగ్‌ను చేర్చడం ద్వారా తమ ప్రజెంటేషన్‌ను ప్రభావవంతంగా చేస్తున్నారు. ఈ ఒరవడి ఈ కళకు మరింత మంచి భవిష్యత్తు ఉందని సూచిస్తోంది. జీవితాంతం కథావ్యాసంగంలోనే ఉండాలని, కథాశక్తిని ప్రపంచానికి చాటాలని ఆశిస్తున్నాను.         

- దీపాకిరణ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement