గృహ రుణాన్ని మార్చేద్దాం!
► ఐదేళ్ల కిందట తీసుకున్న రుణాలపై అధిక వడ్డీ రేటు
► ప్రస్తుతం ఎంసీఎల్‌ఆర్‌తో దిగొచ్చిన రేట్లు
► 8.5 శాతానికే ఆఫర్ చేస్తున్న పలు బ్యాంకులు
► పాత రుణాలను కొత్త విధానానికి మార్చుకునే అవకాశం
► వడ్డీ ఒకశాతం తగ్గినా మొత్తంగా మిగిలేది ఎక్కువే
మీరు ఇంటి కోసం రుణం తీసుకుని ఈఎంఐలు చెల్లిస్తూ వస్తున్నారా? ఎప్పుడో తీసుకున్న రుణం కాబట్టి అప్పటి వడ్డీ రేట్ల ప్రకారం నెలసరి వాయిదాలు తీర్చడం కష్టంగా అనిపిస్తోందా? అయితే, రుణంపై వడ్డీ రేటును మార్చుకుంటే సరిపోతుంది! బ్యాంకులు గతంలో ఉన్న బేస్ రేట్ విధానం నుంచి నూతన మార్జినల్ కాస్ట్ బేస్డ్ రుణ రేటుకు (ఎంసీఎల్‌ఆర్) మారడంతో రుణాలపై రేట్లు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎల్‌ఆర్‌కు మారడం ద్వారా మీరు కూడా తాత్కాలికంగా భారాన్ని దింపుకోవచ్చు.
వడ్డీ రేటు ఎంత...?
గృహరుణాన్ని తీసుకుని నెలసరి వాయిదాలు తీర్చడంలో ఇబ్బందులు పడుతున్నవారు ముందు చేయాల్సింది ఒకటుంది. బ్యాంకు ఎంత వడ్డీరేటు వసూలు చేస్తోందో ఓ సారి కనుక్కోవాలి. ఎందుకంటే బ్యాంకులు ఇటీవల బేస్ రేటు నుంచి ఎంసీఎల్‌ఆర్‌కు మళ్లాయి. మరి ఆ ప్రయోజనం కస్టమర్‌గా మీకు దక్కుతోందో, లేదో ముందు చూసుకోవాలి. కొన్ని బ్యాంకులు ఖాతాదారులందరికీ ఒకటే రేటును అమలు చేయడం లేదు. కొత్త కస్టమర్లకు తక్కువ రేటుకే రుణాలిస్తూ పాత కస్టమర్లను మాత్రం చార్జీల పేరుతో బాదేస్తున్నాయి. అందుకే మీ బంధుమిత్రుల్లో ఎవరైనా గృహ రుణం లేదా ఆటో లోన్, లేదా వ్యక్తిగత రుణాన్ని తీసుకుని ఉంటే వారి నుంచి బ్యాంకు ఎంత వడ్డీ రేటు వసూలు చేస్తోందో కనుక్కోండి. సాధారణంగా బ్యాంకుల మధ్య వడ్డీ రేట్ల విషయంలో స్వల్ప తేడాలుండడం సహజమే. కానీ ఒకే బ్యాంకులో ఖాతాదారుల మధ్య కూడా ఈ వ్యత్యాసాలుంటాయని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఈ తేడా తక్కువ ఉండొచ్చు. ఎక్కువగానూ ఉండొచ్చు. ఇది కస్టమర్ల రుణ చెల్లింపుల చరిత్ర (క్రెడిట్ హిస్టరీ/క్రెడిట్ స్కోరు) వల్ల అనుకుంటే పొరబడినట్టే. కొన్ని బ్యాంకులు కొత్త వారిని ఆకర్షించటానికి వారికి తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. పాతవారిపై భారం మోపుతున్నాయి. బ్యాంకులు పాత ఖాతాదారులు, కొత్త ఖాతాదాల విషయంలో భిన్న రకాల వడ్డీ రేట్లతో వివక్ష చూపిస్తున్నాయని ఫిన్‌టెక్ స్టార్టప్ ‘ఫిస్డమ్’ సహ వ్యవస్థాపకుడు రామ్‌గణేష్ అయ్యంగార్ పేర్కొన్నారు.
పీఎల్‌ఆర్ టు ఎంసీఎల్‌ఆర్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2016 ఏప్రిల్‌లో ఎంసీఎల్‌ఆర్‌ను ప్రవేశపెట్టింది. బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల విషయంలో అనుసరించాల్సిన ప్రామాణిక విధానం ఇది. అప్పటి వరకు బేస్ రేట్ విధానం అమల్లో ఉండేది. బేస్ రేటు విధానంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ ఆ ప్రయోజనాన్ని బ్యాంకులు ఖాతాదారులకు బదిలీ చేయకుండా వేచి చూసే ధోరణి అనుసరించటంతో ఆర్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ను తీసుకొచ్చింది. బ్యాంకులు నిధుల సేకరణకు అయ్యే వ్యయాలను పరిగణనలోకి తీసుకుని రుణ రేటును ఖరారు చేసుకుంటాయి. బేస్ రేటు కంటే ముందు తక్కువ పారదర్శకతతో కూడిన ప్రైమ్ లెండింగ్ రేటు (పీఎల్‌ఆర్) అమల్లో ఉండేది.
రుణ బదిలీకి చార్జీలుంటాయ్
రుణాల్లో ఫిక్స్‌డ్, ఫ్లోటింగ్ అని రెండు రకాల వడ్డీ రేట్లుంటాయి. ఆర్‌బీఐ ప్రకటించే రేట్ల ఆధారంగా బ్యాంకుల ఎంసీఎల్‌ఆర్ మారుతుంది. దానికనుగుణంగా ఎప్పటికప్పుడు వడ్డీ రేటు మారే రుణాలు ఫ్లోటింగ్. కొన్నేళ్ల పాటు అలా మారకుండా స్థిరంగా ఒకే రేటుతో ఉండేవి ఫిక్స్‌డ్ రేటు రుణాలు. అయితే ప్రస్తుత రుణాలను ఎంసీఎల్‌ఆర్ కిందకు మార్చుకుందామని నిర్ణయించుకుంటే అందుకు బ్యాంకులు కొంత చార్జీలు వసూలు చేయొచ్చు. డ్రాఫ్ట్ తయారీ, నూతన ఒప్పందం రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ తదితర చార్జీలను బ్యాంకులు భరించాల్సి వస్తుంది. దీంతో అవి ఖాతాదారుల నుంచి వసూలు చేస్తాయి. మిగిలి ఉన్న రుణం మొత్తంపై ఈ చార్జీలు 0.20 శాతానికి మించి ఉండవు. కానీ బ్యాంకులు 0.5 శాతం వసూలు చేస్తుంటాయి.
ఈఎంఐ ఎంత తగ్గుతుంది...?
0.50 శాతం చార్జీని బ్యాంకు విధించినా ఎంసీఎల్‌ఆర్‌కు మారడం లాభదాయకమేనని నిపుణుల సూచన. ఎందుకంటే స్వల్పంగా చార్జీలు చెల్లించినా అధిక వడ్డీ రేటు దిగి రావడం వల్ల మిగిలే ప్రయోజనం ఎక్కువే ఉంటుందని చెబుతున్నారు. ఉదాహరణకు ప్రైవేటు కంపెనీ ఉద్యోగి అయిన శ్రావ్య (40) బేస్ రేటు కింద గృహ రుణం తీసుకున్నారు. ఆమె ఇంకా రూ.50 లక్షల బకాయి చెల్లించాల్సి ఉంది. వ్యవధి 15 ఏళ్లు. రుణ రేటులో ఒక శాతం తగ్గినా ఆమె నెలసరి వాయిదా (ఈఎంఐ) రూ.52,200 నుంచి రూ.49,250కు దిగొస్తుంది. అంటే రూ.2,950 తగ్గుదల. ఇలా మారడం వల్ల మొత్తం మీద మిగిలేది రూ.5 లక్షలకు పైనే. కానీ, మారేందుకు చెల్లించాల్సిన చార్జీలు 0.50 శాతం కింద రూ.25వేలే. బ్యాంకు సిబ్బందితో మంచి సంబంధాలుంటే ఈ చార్జీలను కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది.
ఐదేళ్ల క్రితం తీసుకుంటే భారమే!
ఐదేళ్ల క్రితం గృహ రుణం తీసుకుని ఉంటే ఆయా కస్టమర్లు పీఎల్‌ఆర్ రేటు విధానంలో వడ్డీ చెల్లిస్తున్నట్టే. ఆ తర్వాత బేస్ రేటు విధానం అమల్లోకి వచ్చింది. వీటితో పోలిస్తే ఇప్పుడు బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్ కింద 8.5% వడ్డీ రేటుకు గృహ రుణాలను ఆఫర్ చేస్తుండడం ఆకర్షణీయం. ఇప్పటికే గృహ రుణాలు తీసుకుని ఉన్న వారు కూడా ఈ ప్రయోజనాన్ని అందుకోవడం ద్వారా వడ్డీ భారాన్ని కొంత మేర తగ్గించుకోవచ్చు. ‘‘ముందు మార్కెట్లో తక్కువ రుణ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయన్నది తెలుసుకోవాలి. దీనివల్ల తాము రుణం తీసుకున్న బ్యాంకును వడ్డీ రేటు విషయమై బేరమాడేందుకు కావాల్సిన అవగాహన వస్తుంది’’ అని ఐసర్వ్ ఫైనాన్షియల్ సీఈవో దీపక్ సమంత వ్యాఖ్యానించారు.
మార్కెట్‌కు అనుగుణంగా
వడ్డీ రేట్లను తగ్గించుకోవాలనుకుంటే పీఎల్‌ఆర్ లేదా బేస్ రేటులో ఉన్న వారు ఎంసీఎల్‌ఆర్‌కు మారడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల విషయంలో తటస్థ విధానానికి మళ్లిన నేపథ్యంలో ప్రస్తుతానికి వడ్డీ రేట్లు పెరిగే అవకాశం లేదని, కొంత తగ్గే అవకాశం కూడా లేకపోలేదన్నది వారి విశ్లేషణ. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఎంసీఎల్‌ఆర్ విధానమనేది బ్యాంకులు ఎప్పటికప్పుడు ఆర్‌బీఐ విధానానికి అనుగుణంగా తమ ప్రామాణిక రేట్లను మార్చుకునేందుకు ఉద్దేశించినది. కనుక ఈ విధానంలో వడ్డీ రేట్లు ఎంత వేగంగా అయితే తగ్గాయో.... ఆర్‌బీఐ రెపో, సీఆర్‌ఆర్‌లను పెంచడం మొదలు పెడితే... అంతే వేగంగా పెరుగుతాయి.