వండినవి తీసుకొస్తారు...వంటవాళ్లూ వస్తారు! | Changing the online food market | Sakshi
Sakshi News home page

వండినవి తీసుకొస్తారు...వంటవాళ్లూ వస్తారు!

Published Mon, Aug 10 2015 11:32 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

వండినవి తీసుకొస్తారు...వంటవాళ్లూ వస్తారు!

వండినవి తీసుకొస్తారు...వంటవాళ్లూ వస్తారు!

రోజురోజుకూ మారుతున్న ఆన్‌లైన్ ఫుడ్ మార్కెట్
- తిండికే కాదు..టీ, స్నాక్స్‌కూ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్
- 94 వేల కోట్లను దాటిన ఆన్‌లైన్ ఆహార మార్కెట్
- ఫుడ్ స్టార్టప్స్‌లోకి భారీగా వస్తున్న పెట్టబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
రోజూ బయటికెళ్లి మెస్‌లోనో, హోటల్‌లోనో తినాలంటే బ్యాచిలర్స్‌కి బోర్. ఇంట్లో రోజూ వండే గృహిణులకు... సెలవురోజుల్లో మాత్రమే బయటికెళ్లి తినే అవకాశముంటుంది. అదీ బోరే. ఆఫీస్‌కి ఫుడ్ తెచ్చుకోలేని సమయంలో ప్రతిసారీ పక్కనున్న రెస్టారెంట్‌కెళ్లి తినాలంటే... అదీ బోరే. ఈ బోర్‌డమ్‌కి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేయండంటూ రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి ఫుడ్ స్టార్టప్‌లు. వేడి వేడి టీ నుంచి పరోటాలు, కూరలు, బిర్యానీల దాకా ఒకటేమిటి... అన్నిటినీ ఒక్క క్లిక్‌తో మీరున్న చోటికే తెస్తామంటున్నాయి ఈ కంపెనీలు. కొన్నాళ్ల కిందటివరకూ ఆన్‌లైన్‌ను ఆశ్రయించేవారంతా షాపింగ్, ట్రావెల్‌తో పాటు సినిమా టిక్కెట్లకే ప్రాధాన్యమిచ్చేవారు.

ఈ జాబితాలోకిపుడు ఫుడ్ కూడా చేరింది. ఇంకా చెప్పాలంటే ఆన్‌లైన్ వ్యాపారంలో విలువ ఎక్కువ ఉండే ట్రావెల్‌ది మొదటి స్థానం కాగా... ఫుడ్‌ది 3వ స్థానం. దేశంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ విలువ రూ.94,755 కోట్లకు (15 బిలియన్ డాలర్లు) చేరిందనేది పరిశ్రమ వర్గాల మాట. అందుకే... గుర్తు పెట్టుకోలేనన్ని స్టార్టప్‌లు ఈ రంగంలోకి దిగుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డరంటే బిర్యానీ, పిజ్జా మాత్రమే. కానీ రకరకాల స్టార్టప్స్ ప్రవేశించాక.. టీ, టిఫిన్లు, సమోసా, సూప్స్, సలాడ్స్, పరాటా, జొన్న రొట్టెలు వంటివన్నీ ఆన్‌లైన్‌లోకి వచ్చేశాయి. అందుకేనేమో క్యాబ్స్ రెంటల్ విభాగంలో ఉన్న ఓలా... ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ నగరాల్లో ఓలా కెఫేను ప్రారంభించింది. ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం కేఎఫ్‌సీ కూడా... రైల్వే టిక్కెట్లు విక్రయించే ఐఆర్‌సీటీసీతో జట్టుకట్టి ఈ-క్యాటరింగ్ సేవలు ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో ఫుడ్ మార్కెట్‌కున్న డిమాండ్ చెప్పడానికి ఇవి చాలవూ!!.
 
ఫుడ్‌లోనూ హైదరాబాద్ హవా...
ఇతర రంగాల స్టార్టప్‌ల మాదిరిగానే దేశంలోని ఇతర ఫుడ్ స్టార్టప్స్‌కు హైదరాబాదీ ఫుడ్ స్టార్టప్స్ గట్టి పోటీనిస్తున్నాయి. మెనూలోను, సేవల్లోను మాత్రమే కాక... ఇతర కంపెనీల కొనుగోళ్లలోనూ ఇవి ముందుంటున్నాయి. ఓ బ్లూచిప్ కంపెనీ పెట్టిన రూ.50 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌కు చెందిన హలోకర్రీ...  స్థానిక స్టార్టప్ కంపెనీ అయిన పరాటా పోస్ట్‌ను, టెక్నాలజీ కంపెనీ ఫైర్ 42ను కొనుగోలు చేసింది. హైదరాబాద్, బెంగళూరుల్లో సేవలందిస్తున్న హలోకర్రీ... ఢిల్లీ, గుర్గావ్, ముంబై, గుజరాత్, పుణెలకూ విస్తరిస్తున్నట్లు కంపెనీ సీఈఓ రాజు భూపతి చెప్పారు.

జంక్‌ఫుడ్ కు దూరంగా ఉండే మెట్రోవాసుల కోసం ‘హార్ట్ అండ్ సోల్.కో.ఇన్’ స్థాపించారు హైదరాబాద్‌కు చెందిన ఆర్జున్. రాగి, జొన్నలతో పాటు స్థానికంగా లభించే సేంద్రీయ ఉత్పత్తులతో జొన్న రొట్టెలు, బిస్కెట్ల వంటి ఫుడ్ ఐటమ్స్‌ను విక్రయించడం దీని ప్రత్యేకత. ఇక హైదరాబాద్ కు చెందిన ‘సూప్స్ అండ్ సలాడ్స్’  కేవలం సలాడ్స్‌నే విక్రయిస్తుంది. సేంద్రీయ ఉత్పత్తులతోనే సూప్స్, సలాడ్లను తయారు చేస్తామని.. కాలానుగుణంగా మెనూ మారుతుంటుందని దీని వ్యవస్థాపకురాలు సౌజన్య చెప్పారు. ప్రస్తుతం ఈ కంపెనీకి రోజుకు 200 వరకు ఆర్డర్లొస్తున్నాయి.
 
2020కల్లా 42 లక్షల కోట్లు..
ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ 370 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలో సంఘటిత ఆహారం మార్కెట్ విలువ 48 బిలియన్ డాలర్లు (రూ.3 లక్షల కోట్లు)గా ఉంటే.. ఇందులో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ మార్కెట్ విలువ రూ.94,755 కోట్లు(15 బిలియన్ డాలర్లు)గా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏటా ఫుడ్ డెలివరీ మార్కెట్ 30 శాతం వృద్ధి రేటును కనబరుస్తోంది. 2020 నాటికి 42 లక్షల కోట్లకు చేరుతుందని బోస్టన్ కన్‌సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదిక వెల్లడించింది.
 
టీ, స్నాక్స్ కూడా ఆన్‌లైన్‌లోనే..
ముంబైలో ప్రసిద్ధి చెందిన చాయ్‌వాలాలను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది ‘చోటు చాయ్‌వాలా.కామ్’. ఇందులో రిజిస్టర్ చేసుకున్న వ్యక్తికి కార్యాలయానికైనా, ఇంటికైనా నిర్ణీత సమయానికి టీ, స్నాక్ డెలివరీ చేయటమే దీని ప్రత్యేకత. ‘‘ప్రస్తుతం ముంబైలో అతిపెద్ద మార్కెట్ ఏరియా అయిన బాంద్రాలో ప్రారంభించాం. నెలకు 500 ఆర్డర్లొస్తున్నాయి. వారానికి రూ.70 చెల్లిస్తే చాలు.

ఐదు రోజులు క్రమం తప్పకుండా టీ చేతికొస్తుంది’’ అని సంస్థ సీఈఓ నితిన్ చెప్పారు. ఇక ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులు ఈ-క్యాటరింగ్ సేవల కింద కేఎఫ్‌సీ మీల్‌కు ఆర్డర్ చేయవచ్చు. ప్రస్తుతానికి న్యూఢిల్లీ మీదుగా ప్రయాణించే 12 రైళ్లలో ప్రవేశపెట్టామని.. ఈ నెలాఖరులోగా విశాఖపట్నం, హైదరాబాద్ (కాచిగూడ),బెంగళూరు (యశ్వంత్‌పూర్) స్టేషన్ల నుంచి కూడా ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తామని కేఎఫ్‌ఎసీ ప్రకటించింది.
 
ఇంటికొచ్చే షెఫ్... అర్ధరాత్రి మీల్స్

స్టార్టప్స్ ఫుడ్ ఆర్డర్ల వరకే పరిమితం కాలేదు. షెఫ్‌లే ఏకంగా ఇంటికొచ్చి వంట చేసి పెడుతున్నారు కూడా. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న రెస్టోకిచ్ ఈ రకమైన సేవలందిస్తోంది. దీంతో పార్టీ సమయాల్లో ఇంట్లోని సభ్యులు వంటింటికే పరిమితం కాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి పార్టీని ఎంజాయ్ చేయవచ్చు. ప్రస్తుతం పుణె, ముంబైల్లో సేవలందిస్తున్న రెస్టోకిచ్‌ను... ఏడాదిలోగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, గోవాల్లో విస్తరించే యోచన ఉన్నట్లు సంస్థ ఫౌండర్ ముకుల్ తెలిపారు. ఇక ‘ది బూటీకాల్’ స్టార్టప్‌ది మరో ప్రత్యేకత. కేవలం అర్ధరాత్రి సమయంలో మాత్రమే ఫుడ్ డెలివరీ చేస్తుంది ఈ సంస్థ. నైట్ షిఫ్ట్ ఉద్యోగులు, లేట్ నైట్ పార్టీలకు వెళ్లేవారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్... బూటీకాల్ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement