ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ 20 నెలల క్రితంతో పోల్చితే ప్రస్తుతం పటిష్టంగా ఉందని ఆర్థికమంత్రి పి.చిదంబరం పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశం పలు ఆర్థిక అంశాల్లో పురోగతి సాధించిందన్నారు. ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని తెలిపారు.
ముఖ్య అంశాలను పరిశీలిస్తే...
గడచిన ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్- క్యాపిటల్ ఫ్లోస్ అంటే ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీల మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య ఉన్న వ్యత్యాసం) 88 బిలియన్ డాలర్లు. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 4.5% పైబడి ,ఇది తీవ్ర ఆందోళన సృష్టించింది. 2013-14లో ఇది 35 బిలియన్ డాలర్ల స్థాయికి తగ్గింది. జీడీపీలో 3%కన్నా ఎగువకు పెరిగే అవకాశం లేదు.
ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయం-వ్యయానికి మధ్య ఉన్న వ్యత్యాసం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో 4.8%గా ఉంటుందని భావించినప్పటికీ, ప్రస్తుతం 4.6% వద్ద కట్టడి చేసే పరిస్థితి ఉంది.
యూపీఏ ప్రభుత్వ పాలసీ సానుకూలతే స్టాక్ మార్కెట్ల ర్యాలీకి కారణం. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న అంచనాలే ఈ ర్యాలీకి కారణమని భావించడం ఎంతమాత్రం తగదు.
బంగారంపై నియంత్రణలు సడలించే యోచన
బంగారం దిగుమతులపై నియంత్రణలు సడలించే ఆలోచన వుంది. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష తర్వాత ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటాం.
గ్యాస్‌పై ఈసీకి నివేదించకుండా ఉండాల్సింది
గ్యాస్ ధర రెట్టింపునకు సంబంధించిన క్యాబినెట్ నిర్ణయాన్ని పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ ఎన్నికల సంఘానికి(ఈసీ) నివేదించకుండా ఉండాల్సింది. చాలా ఆలోచించి ఎన్నికల నోటిషికేషన్‌కు 3 నెలల క్రితమే క్యాబినెట్ దీనిపై నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం శాఖ అతిజాగ్రత్తకు పోయి ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘానికి నివేదించిందని వ్యక్తిగతంగా భావిస్తున్నా. అసలు ఇలాంటి అవసరమేలేదు. (రిలయన్స్ వంటి కంపెనీలు ఉత్పత్తి చేసిన ఇంధన ధరల రెట్టింపు నోటిఫై చేయడాన్ని ఎన్నికల దృష్ట్యా వాయిదా వేయాలని ఈసీ యూపీఏ ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే.)
బ్యాంక్ లెసైన్సులపై కూడా ఇదే తీరు...
బ్యాంక్ లెసైన్సుల జారీ అంశం ఎన్నికల సంఘానికి నివేదించడం సైతం అతి జాగ్రత్తతో కూడినదే. నేనే కాదు... ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా ఇదే విధమైన అభిప్రాయంతో ఉన్నారు. రెండున్నర సంవత్సరాల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో అసలు ప్రభుత్వ పాత్రే ఉండదు.