ఇండియాలో చైనా స్మార్ట్ ఫోన్ల హవా
బీజింగ్: భారత మార్కెట్ లో చైనా స్మార్ట్ ఫోన్లు దూసుకుపోతున్నాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద విపణిగా అవతరించిన భారత్ లో గతేడాది చైనా ఫోన్లు 40 శాతం వరకు అమ్ముడుపోయాయి. ఇండియాలో నిరుడు అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో లెనొవో రెండో స్థానంలో నిలిచినట్టు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) సర్వేలో తేలిందని చైనా అధికారిక పత్రిక వెల్లడించింది. శాంసంగ్ టాప్ లో ఉంది. 10. 7 శాతంతో షియామి మూడు స్థానం దక్కించుకుంది.
చైనా కంపెనీలు ప్రవేశించడంతో భారత స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని 30 ప్రధాన నగరాల్లో నిర్వహించిన సర్వేలో తేలింది. మైక్రోమ్యాక్స్ అమ్మకాలు అక్టోబర్ లో 16.7 శాతం క్షీణించినట్టు వెల్లడైంది. మార్కెట్ అవకాశాల్లో ‘న్యూ చైనా’గా అభివృద్ధి చెందుతున్న భారత్ లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు మున్ముందు మరింత పెరుగనున్నాయి. తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్లున్న ఫోన్లను కొనేందుకు భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగానే లెనొవో అమ్మకాలు గణనీయంగా పెరిగినట్టు సర్వే అంచనా వేసింది. మోటొరాలా హైయండ్ ఫోన్ల అమ్మకాలపై దృష్టి సారించింది.