స్టాక్ మార్కెట్ లాభాల స్వీకరణ, సెన్సెక్స్ 153 పాయింట్లు డౌన్!
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్ లో 55 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్.. మధ్నాహ్నం (12.40) కల్లా 153 పాయింట్లు నష్టంతో 19841 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 42 పాయింట్లు కోల్పోయి 5854 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ప్రధాన రంగాల కంపెనీ షేర్లతోపాటు కాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్. పీఎస్ యూ, బ్యాంకింగ్ రంగ కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది.
ద్రవ్యమార్కెట్ లో నిన్నటి ముగింపుకు స్వల తేడాతో ప్రస్తుతం 63.80 వద్ద ట్రేడ్ అవుతోంది. బుధవారం ఉదయం ఆరంభంలో 16 పైసలు లాభపడింది.
రూపాయి బలపడుతుండటం, సిరియాపై యుద్ధ భయాలు కాస్త తగ్గడం వంటి సానుకూల అంశాలతో దేశీ స్టాక్‌మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ ఏకంగా 727 పాయింట్లు (3.77%) ఎగసింది. జూలై 25 తర్వాత తొలిసారిగా కీలకమైన 20,000 పాయింట్ల మైలురాయిని దాటేసింది. చివరికి 19,997 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఒకేరోజున ఇంత స్థాయిలో పెరగడం నాలుగేళ్లలో ఇదే మొదటిసారి.
జయప్రకాశ్ అసోసియేట్స్, పీఎన్ బీ, హిండాల్కో,బ్యాంక్ ఆఫ్ బరోడా, మారుతి సుజుకీ కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకోగా, పవర్ గ్రిడ్, ఓఎన్ జీసీ, టాటా మోటార్స్, హెచ్ యూఎల్, ఐటీసీ కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.