సిస్కో చేతికి ‘దేశీ’ స్టార్టప్ సంస్థ
3.7 బిలియన్ డాలర్లకు యాప్‌డైనమిక్స్ కొనుగోలు
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయ వ్యాపారవేత్త జ్యోతి బన్సల్ నెలకొల్పిన ‘యాప్‌డైనమిక్స్’ స్టార్టప్ సంస్థను దిగ్గజ కంపెనీ సిస్కో కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 3.7 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. కంపెనీలు తమ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌ను మెరుగ్గా నిర్వహించుకునేందుకు, వ్యాపార పనితీరునును మెరుగుపర్చుకునేందుకు అవసరమైన సేవలను యాప్‌డైనమిక్స్ అందిస్తోంది.
ఢిల్లీలోని ఇండియిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదివిన బన్సల్.. 2008లో యాప్‌డైనమిక్స్‌ను ప్రారంభించారు. 2015 సెప్టెంబర్‌లో సీఈవో హోదా నుంచి బన్సల్ తప్పుకున్న తర్వాత డేవిడ్ వాధ్వానీ ఆ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం బన్సల్ కంపెనీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. యాప్‌డైనమిక్స్ సంస్థ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి డీల్ పూర్తి కావొచ్చని అంచనా.