రాజమండ్రి దగ్గర కోకాకోలా ప్లాంటు | coca -cola plant in Rajahmundry | Sakshi
Sakshi News home page

రాజమండ్రి దగ్గర కోకాకోలా ప్లాంటు

Published Thu, Feb 18 2016 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

రాజమండ్రి దగ్గర కోకాకోలా ప్లాంటు

రాజమండ్రి దగ్గర కోకాకోలా ప్లాంటు

మాజాను బిలియన్ డాలర్ల బ్రాండ్‌గా మారుస్తాం
దీన్ని ఇంకా 80 శాతం మంది రుచి చూడలేదు
కోకాకోలా ఇండియా ప్రెసిడెంట్ వెంకటేశ్ కిని

 
 ముంబై నుంచి మైలవరపు చంద్రశేఖర్
 ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి సమీపంలో ఉన్న గోపాలపురంలో కొత్తగా ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు కోకాకోలా ప్రకటించింది. 2023 నాటికి తమ శీతల పానీయం ‘మాజా’ బ్రాండ్‌ను బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలియజేసింది. మాజా బ్రాండ్ ఆరంభమై 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోకాకోలా ఇండియా ప్రెసిడెంట్ వెంకటేశ్ కిని ఈ విషయాలు చెప్పారు. దేశంలో 20 శాతం మంది మాత్రమే ఇప్పటిదాకా మాజాను రుచి చూశారని, మిగిలిన 80 శాతం మందికీ దీన్ని చేరువ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. దేశంలోని ప్రజలు సగటున నెలకు ఒకసారి మాత్రమే కూల్ డ్రింక్ తాగుతున్నారన్నారు.

 ఏపీలో 4కు చేరనున్నప్లాంట్ల సంఖ్య: మేకిన్ ఇండియాలో భాగంగా దేశవ్యాప్త విస్తరణకు ప్రయత్నిస్తున్నట్లు ఈ సందర్భంగా వెంకటేశ్ తెలియజేశారు. ‘‘భారత్‌లో విస్తరణలో భాగంగా 2012-2020 మధ్య రూ.30,000 వేల కోట్లు ఖర్చు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏపీలో కొత్త ప్లాంట్ ఏర్పాటుతో అక్కడ మొత్తం ప్లాంట్ల సంఖ్య 4కి చేరుతుంది. దీంతో దేశవ్యాప్తంగా ప్లాంట్ల సంఖ్య 58కి పెరుగుతుంది. తెలంగాణలో ప్రస్తుతం మాకు రెండు ప్లాంటున్నాయి’’ అని వివరించారు.

 మాజాకు 40 ఏళ్లు...
 పార్లే సంస్థ 1976లో తొలిసారి మాజాను భారత్‌కు పరిచయం చేసింది. అటు తర్వాత ఇది 1993లో కోకాకోలా ఇండియా వంశమైంది. పార్లే చేతిలో ఉన్నప్పుడు ఆరెంజ్, ఫైనాపిల్, మ్యాంగో వంటి ఫ్లేవర్‌లో లభ్యమయ్యే మాజా.. కోకాకోలా చేతికి వచ్చిన దగ్గరి నుంచి మ్యాంగో ఫ్లేవర్‌లో మాత్రమే లభిస్తోంది. అలాగే కోకాకోలాకు మాజాను కేవలం భారత్‌లో మాత్రమే విక్రయించే అధికారమే ఉంది. విదేశాల్లో విక్రయానికి పార్లే కోకాకోలాకు అనుమతి ఇవ్వలేదు.

 జైన్ ఇరిగేషన్‌తో భాగస్వామ్యం
 మామిడి రైతులకు అధిక ఆదాయం కల్పించే విధంగా కోకాకోలా.. జైన్ ఇరిగేషన్ సంస్థతో కలిసి ‘ఉన్నతి’ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కంపెనీ చిత్తూరులో రైతులతో కలిసి 1,000 ఎకరాల్లో మామిడి పంటను సాగు చేస్తోంది. దీన్ని ఏటా 2,000 ఎకరాల చొప్పున పెంచాలని కూడా కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం ఏటా 50 వేల మంది రైతుల నుంచి 70 వేల మెట్రిక్ టన్నుల మామిడి గుజ్జును సేకరిస్తోంది. బిలియన్ బ్రాండ్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రైతుల సంఖ్య లక్షకు, అదేవిధంగా ఉత్పత్తి 1.40 లక్షల మెట్రిక్ టన్నుల స్థాయికి చేరాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement