కాగ్నిజెంట్కి పన్ను పోటు!
జూన్ త్రైమాసికం లాభంలో 40 శాతం క్షీణత
న్యూయార్క్: అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ లాభం జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో భారీగా క్షీణించింది. ఆదాయ పన్నుకు చేసిన అధిక కేటాయింపులతో లాభం 40 శాతం క్షీణించి 25.24 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.1,600కోట్లు) నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం 42 కోట్ల డాలర్లుగా ఉంది. ఆదాయం మాత్రం కంపెనీ అంచనాలకు అనుగుణంగానే 9.2 శాతం వృద్ధి చెంది 3.08 బిలియన్ డాలర్ల నుంచి 3.36 బిలియన్ డాలర్లకు చేరుకుంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయం 3.43-3.47 బిలియన్ డాలర్లుగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
అయితే, పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2016 జనవరి - డిసెంబర్) ఆదాయ అంచనాలను మరోసారి తగ్గించింది. 13.47-13.60 బిలియన్ డాలర్ల మధ్య ఉండవచ్చని (8.4-9.5 శాతం వృద్ధి) ప్రకటించింది. 2015లో కంపెనీ ఆదాయ వృద్ధి 21 శాతంగా ఉండటం గమనార్హం. ఐటీ రంగం ఎదుర్కొంటున్న స్థూల ఆర్థిక సవాళ్లే ఇందుకు కారణమని కంపెనీ ప్రస్తావించింది. నిజానికి ఈ ఏడాది ప్రారంభంలో 13.65-14.20 బిలియన్ డాలర్ల మధ్య ఆదాయం ఉండవచ్చని కాగ్నిజెంట్ ప్రకటించగా... తర్వాత 13.65 నుంచి 14 బిలియన్ డాలర్లకు తగ్గించింది. సమీక్షా కాలంలో కాగ్నిజెంట్ 11,300 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.44 లక్షలకు చేరుకుంది.