Cognizant Technologies
-
హైదరాబాద్‌లో ఆస్తులు అమ్మనున్న టాప్ ఐటీ కంపెనీ..?
టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న కాగ్నిజెంట్.. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. సాధారణంగా కాస్ట్‌కటింగ్ పేరిట టెక్ సంస్థలు ఉద్యోగాల్లో కోత విధిస్తూ ఖర్చు తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. దాంతోపాటు కాగ్నిజెంట్ ఆస్తులను సైతం విక్రయించాలని యోచిస్తున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. కాగ్నిజెంట్ టెక్నాలజీస్ హైదరాబాద్, చెన్నైలోని తన ఆస్తులను విక్రయించడానికి సిద్ధంగా ఉందని సమాచారం. ఇది నాన్-కోర్ రియల్ ఎస్టేట్ ద్వారా నగదు సంపాదించడానికి సహకరిస్తుందని తెలిసింది. మీడియా కథనాల ప్రకారం.. రెండు సంవత్సరాల్లో రూ.3300 కోట్లు ఆదా చేసే లక్ష్యంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని 10 ఎకరాల క్యాంపస్‌ను, చెన్నైలోని సిరుసేరిలో 14 ఎకరాల క్యాంపస్‌ను విక్రయించాలని యోచిస్తోంది. రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా తన వర్క్‌స్పేస్‌ను తగ్గించుకుని, వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడానికి హైబ్రిడ్ వర్క్ కల్చర్‌ను ఎంచుకుంది. టెక్ కంపెనీలు మారుతున్న వర్క్‌కల్చర్‌కు అనుగుణంగా హైబ్రిడ్‌వర్క్ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. వివిధ నగరాల్లోని కార్యకలాపాలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే కాగ్నిజెంట్ ఈ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అయితే కంపెనీ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇదీ చదవండి: ఆ సీఈవో వేతనం రోజూ రూ.5 కోట్లు..! ఇటీవల ఐటీ సేవల రంగంలోని కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లు ఖర్చులు తగ్గించుకుంటున్నారు. వారి వ్యాపారాల్లో జనరేటివ్ ఏఐను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. సెప్టెంబర్ త్రైమాసికం ముగింపు నాటికి కాగ్నిజెంట్‌లో 3,46,600 మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ నికర లాభం 16 శాతం క్షీణించి 525 మిలియన్లకు చేరుకుంది. ఆదాయం దాదాపు 4.89 బిలియన్ డాలర్లుగా ఉందని కంపెనీ వెల్లడించింది. -
సాఫ్ట్వేర్ బూమ్..బూమ్,ఫ్రెషర్లకు అదిరిపోయే శుభవార్త..!
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఈ ఏడాది(2022) దేశీయంగా 50,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఆఫర్ చేయనుంది. కంపెనీ తొలి క్వార్టర్(జనవరి–మార్చి) ఫలితాలు విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఏడాది 20 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించగలమని అంచనా వేసింది. క్యూ1లో నికర లాభం 11 శాతంపైగా బలపడి 56.3 కోట్ల డాలర్లను తాకింది. 2021 క్యూ1లో 50.5 కోట్ల డాలర్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు ప్రధానంగా డిజిటల్ విభాగం వృద్ధి సహకరించినట్లు కాగ్నిజెంట్ పేర్కొంది. కంపెనీ కేలండర్ ఏడాదిని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. క్యూ1లో మొత్తం ఆదాయం 10 శాతం పుంజుకుని 4.82 బిలియన్ డాలర్లకు చేరింది. యూఎస్ కేంద్రంగా ఐటీ సేవలందించే కంపెనీ ఉద్యోగుల్లో 70 శాతం మంది దేశీయంగా విధులు నిర్వహించే సంగతి తెలిసిందే. 20 బిలియన్ డాలర్లకు: సవరించిన అంచనాల ప్రకారం ఈ ఏడాది 19.8–20.2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకోగలమని కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంఫైర్స్ అభిప్రాయపడ్డారు. ఇది 9–11 శాతం వృద్ధికి సమానమని తెలియజేశారు. వెరసి తొలిసారి 20 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించే వీలున్నట్లు పేర్కొన్నారు. -
వర్క్ ఫ్రమ్ హోమ్ !! రండి.. రండి.. దయచేయండి.. ఉద్యోగులకు టెక్ కంపెనీల పిలుపు!!
రండి..రండి...దయచేయండి..తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ! అంటూ సుదీర్ఘ కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఇంటికే పరిమితమైన ఉద్యోగుల్ని ఐటీ కంపెనీలు కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నాయి. ► 2ఏళ్ల నుంచి ఇంటి నుంచే పనిచేస్తున్న ఉద్యోగుల్ని తిరిగి కార్యాలయాలకు ఆహ్వానించేందుకు ఐటీ కంపెనీలు సిద్ధమయ్యాయి. కోవిడ్‌తో చాలా కంపెనీలు ఫ్లెక్సిబుల్ హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరించాలని యోచిస్తున్నప్పటికీ, ఐటీ ఉద్యోగుల వర్క్ విషయంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ► అందుకే బెంగళూరు కేంద్రంగా ఐటీ కంపెనీ విప్రో మేనేజర్ స్థాయి అంతకంటే ఎక్కువ మందిని మార్చి3 లోపు తిరిగి కార్యాలయాలకు రావాలని కోరింది. అయితే, ప్రస్తుతానికి విప్రో పై స్థాయి ఉద్యోగుల్ని వారానికి రెండు రోజులు మాత్రమే పిలవనుంది. ►కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌లతో పాటు ఇతర టెక్ కంపెనీలు మార్చి నెల నుంచి ఉద్యోగుల్ని కార్యాలయాలకు పిలిపిస్తున్నాం. అందుకు మీరూ సిద్ధంగా ఉండాలంటూ ఆయా కంపెనీల ప్రతినిధులు ఉద్యోగులకు పెట్టిన మెయిల్స్‌లో పేర్కొన్నాయి. ► కాగ్నిజెంట్ సైతం ఉద్యోగులు ఏప్రిల్ నాటికి స్వచ్ఛందంగా కార్యాలయాలకు తిరిగి వచ్చేలా ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది. ఈ ఏడాది వరకు హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను కొనసాగించాలని భావిస్తున్నప్పటికీ, ఇన్ఫోసిస్ రాబోయే 3నుంచి 4 నెలల్లో ఎక్కువ మంది ఉద్యోగులతో ఆఫీస్‌లో కార్యకలాపాల్ని నిర్వహించనుంది. ► ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీసీఎస్ ఉద్యోగులు టీకాలు వేయించుకోవడంతో పాటు, కరోనా పరిస్థితి మెరుగుపడటంతో ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేయడం ప్రారంభించారని టీసీఎస్ గత వారం ఉద్యోగులకు పెట్టిన ఈమెయిల్స్‌లో తెలిపింది. ► కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం, కరోనా పరిస్థితులు చక్కబడడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న 40 నుంచి 50 శాతం మంది ఉద్యోగులు దశల వారీగా కార్యాలయాలకు రానున్నారని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ లోబో అన్నారు. చదవండి : బంపరాఫర్!! మీ కోసమే..ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఊహించని శాలరీలు!! -
కాగ్నిజెంట్‌లో కీలక స్థానంలో సోమా పాండే
మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ కాంగ్నిజెంట్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టాలెంట్ మేనేజ్మెంట్ గ్లోబల్ హెడ్‌గా భారతీయురాలైన సోమా పాండేను నియమిస్తున్నట్టు మంగళవారం కాగ్నిజెంట్ ప్రకటించింది. హుమన్ రిసోర్స్ విభాగంలో గడిచిన పాతికేళ్లుగా సోమా పాండే వేర్వేరు సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేశారు. కాగ్నిజెంట్ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 3.10 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో సుమారు 2 లక్షల మంది ఉద్యోగులు ఇండియాలో పని చేస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ అత్యధిక నియమకాలు చేపట్టిన సంస్థగా కాగ్నిజెంట్ ముందు వరుసలో ఉంది. ఈ క్రమంలో ఇండియన్ విమన్ సోమా పాండేకి టాలెంట్ మేనేజ్మెంట్ గ్లోబల్ హెడ్ బాధ్యతలను కాగ్నిజెంట్ అప్పగించింది. ఇప్పటి వరకు టాలెంట్ మేనేజ్మెంట్ హెడా పని చేసిన సురేశ్ బేతవందు ఇటీవల కాగ్నిజెంట్‌కి రాజీనామా చేసి మైండ్ ట్రీ సంస్థలో చీఫ్ పీపుల్స్ ఆఫీసర్‌గా చేరారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని సోమా పాండేతో కాగ్నిజెంట్ భర్తీ చేసింది. ఇంతకు ముందు ఫస్ట్‌సోర్స్ సోల్యూషన్స్ సంస్థలో గత ఐదేళ్లుగా సీహెచ్‌ఆర్‌వోగా ఆమె విధులు నిర్వర్తించారు. అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా కాగ్నిజెంట్ ప్రస్థానం ప్రారంభమైనా.. ప్రస్తుతం ఎక్కువ వర్క్‌ఫోర్స్ అంతా ఇండియాలోనే ఉంది. ఈ సంస్థలో దాదాపు రెండు లక్షల మంది ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ పని చేస్తున్నారు. ఈ తరుణంలో నియమకాలకు చేపట్టే హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి మరో భారతీయురాలు హెడ్‌గా రావడం మంచి పరిణామమే అని ఈ సెక్టార్‌కి చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ ఐటీ నిపుణులకు కాగ్నిజెంట్ తీపి కబురు
సాక్షి,న్యూఢిల్లీ: కొంత విరామం తర్వాత మళ్లీ కెరియర్ ప్రారంభించాలనుకుంటున్న టెక్నాలజీ నిపుణుల కోసం ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ’రిటర్న్‌షిప్ ప్రోగ్రాం’ ప్రారంభించింది. ఇది 12 వారాల పాటు ఉంటుంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రతిభావంతులైన నిపుణులకు అవసరమైన శిక్షణ కల్పించడం, సలహాలివ్వడం, ఇతరత్రా అవసరమైన వనరులను సమకూర్చేందుకు ఈ ప్రోగ్రాం దోహదపడుతుందని కాగ్నిజెంట్ ఇండియా సీఎండీ రాజేష్ నంబియార్ తెలిపారు. మళ్లీ ఉద్యోగాల్లో చేరాలనుకునే ప్రొఫెషనల్స్‌లో చాలామంది మహిళలు కూడా ఉంటున్నారని, తొలి బ్యాచ్‌లో ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ విధులపై ఆసక్తి ఉన్న వారికి చోటు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. (సుప్రీం తీర్పు నిరాశపర్చింది : సైరస్ మిస్త్రీ ) -
కాగ్నిజెంట్ తీపికబురు : భారీ ఉద్యోగావకాశాలు
సాక్షి,న్యూఢిల్లీ: ఐటీ కన్సల్టింగ్ రంగంలో ఉన్న యూఎస్ సంస్థ కాగ్నిజెంట్ ఈ ఏడాది భారత్‌లో 23,000 పైచిలుకు ఫ్రెషర్లను నియమించుకోనుంది. 2020 ఏడాదితో పోలిస్తే ఇది 35 శాతం పైగా ఎక్కువ అని సంస్థ సీఎండీ రాజేశ్ నంబియార్ తెలిపారు. 2020 సంవత్సరంలో కంపెనీ 17,000 మందికి పైగా కొత్తగ్రాడ్యుయేట్లను నియమించుకున్నట్టు తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు అత్యంత ప్రతిభ కలిగిన ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్మెంట్ విద్యార్థులతోపాటు ఇతర నిపుణుల నియామకాలను దేశంలో పెద్ద ఎత్తున కొనసాగిస్తున్న సంస్థల్లో ఒకటిగా నిలుస్తామని నంబియార్ చెప్పారు. గతేడాది క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా 17 వేల ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను సంస్థలో చేర్చుకున్నట్టు వెల్లడించారు. నిపుణులను దక్కించుకోవడంలో కీలక కేంద్రాల్లో భారత్ ఒకటిగా ఉంటుందని అన్నారు. కంపెనీ చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది జనవరి–మార్చిలో పెద్ద ఎత్తున నియామకాలు ఉంటాయని వివరించారు. 18 నెలల్లో 1.3 లక్షల మంది ఉద్యోగులకు డిజిటల్ నైపుణ్యాలను కల్పించామన్నారు. కాగ్నిజెంట్‌లో గతేడాది 5,000 మంది ఇంటర్న్‌షిప్ పూర్తి చేశారు. 2020లో 10,000 మందికి అవకాశం కల్పిస్తారు. కాగ్నిజెంట్‌కు ఇప్పటికే భారత్‌లో సంస్థకు 2.04 లక్షల ఉద్యోగులు ఉన్నారు. -
కాగ్నిజెంట్ క్యూ2 వీక్- కొత్త సీఎఫ్‌వో ఎంపిక
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) రెండో త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. అంతేకాకుండా కోవిడ్-19 నేపథ్యంలో 2020 పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాల(గైడెన్స్)ను సైతం కుదించింది. క్యూ2(ఏప్రిల్-జూన్)లో కంపెనీ నికర లాభం 29 శాతం క్షీణించి 36.1 కోట్ల డాలర్లకు పరిమితమైంది. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 3.4 శాతం తక్కువగా 4 బిలియన్ డాలర్లకు చేరింది. కరోనా వైరస్‌తోపాటు ఇతర రాన్సమ్వేర్ సమస్యలతో క్యూ2 పనితీరు బలహీనపడినట్లు కంపెనీ పేర్కొంది. జాన్ సిగ్మండ్ సెప్టెంబర్ 1 నుంచి కంపెనీ సీఎఫ్‌వోగా జాన్ సిగ్మండ్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు కాగ్నిజెంట్ టెక్నాలజీస్ తాజాగా వెల్లడించింది. ప్రస్తుత సీఎఫ్‌వో కరెన్ మెక్లాఫ్లిన్ ఆగస్ట్ చివరివరకూ పదవిలో కొనసాగుతారని, తదుపరి కంపెనీ సలహాదారుగా సేవలందిస్తారని తెలియజేసింది. 17ఏళ్లపాటు సేవలు అందించిన కరెన్ పదవీ విరమణ చేయనున్నట్లు తెలియజేసింది. సిగ్మండ్ ఇటీవల ఆటోమాటిక్ డేటా ప్రాసెసింగ్ కంపెనీకి సీఎఫ్‌వోగా వ్యవహరించారు. కాగా.. కాగ్నిజెంట్ ఇండియా కంట్రీ ఎండీగా వ్యవహరించిన రామ్‌కుమార్ రమణమూర్తి, గ్లోబల్ డెలివరీ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రదీప్ షిలీజీ ఇటీవల కంపెనీ నుంచి వైదొలగిన విషయం విదితమే. 2-0.5 శాతం డౌన్ 2020 పూర్తి ఏడాదిలో కంపెనీ ఆదాయం 16.4-16.7 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదుకావచ్చని కాగ్నిజెంట్ తాజాగా అంచనా వేసింది. ఇది 2-0.5 శాతం క్షీణతకాగా.. కొన్ని కంటెంట్ సంబంధ సర్వీసుల నుంచి వైదొలగడం వల్ల 1.1 శాతంమేర మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడవచ్చని పేర్కొంది. విదేశీ మారక ప్రభావం సైతం 0.2 శాతంమేర ప్రతిఫలించవచ్చని అభిప్రాయపడింది. నిర్వహణ మార్జిన్లు 15.1 శాతం నుంచి 14.1 శాతానికి నీరసించాయి. డిజిటల్ జోరు మొత్తం ఆదాయంలో డిజిటల్ విభాగం వాటా పెరుగుతున్నట్లు కాగ్నిజెంట్ తెలియజేసింది. క్యూ2లో 14 శాతం వృద్ధి చూపగా.. మొత్తం ఆదాయంలో 42 శాతం వాటాను ఆక్రమించినట్లు వివరించింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 50 శాతం అధికంగా బుకింగ్స్ సాధించినట్లు తెలియజేసింది. ఇందుకు డిజిటల్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విభాగాలు ప్రధానంగా సహకరించినట్లు పేర్కొంది. -
కాగ్నిజెంట్‌లో.. 400 ఎగ్జిక్యూటివ్‌లకు బై..బై
ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ 400 మంది సీనియర్ అధికార స్థాయి ఉద్యోగులను తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్స్, సీనియర్ డైరెక్టర్స్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్స్(ఏపీపీఎస్), వీపీఎస్,ఎస్వీపీఎస్లను స్వచ్చందంగా పదవీవిరమణ చేయమని కాగ్నిజెంట్ కంపెనీ అడగవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రెండేళ్ల క్రితం కూడా సీనియర్, డైరెక్టర్‌స్థాయి ఉద్యోగులు 200 మందిని తొలగించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదికూడా 400 మంది సీనియర్ ఉద్యోగులను వలంటరీ సపరేషన్ స్కీము కింద స్వచ్చందంగా ఉద్యోగాల నుంచి తప్పుకోమని ఈ కంపెనీ అడగనుంది.కాగా కాగ్నిజెంట్ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా 2,90,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ వ్యయాలను తగ్గించుకునేందుకు, డిమాండ్ సప్లై ఆధారంగా ఉద్యోగులను విభజించి కొంత మేర ఉన్నతస్థాయి అధికార యంత్రాంగాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో కాగ్నిజెంట్ ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. -
కాగ్నిజెంట్‌కి పన్ను పోటు!
జూన్ త్రైమాసికం లాభంలో 40 శాతం క్షీణత న్యూయార్క్: అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ లాభం జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో భారీగా క్షీణించింది. ఆదాయ పన్నుకు చేసిన అధిక కేటాయింపులతో లాభం 40 శాతం క్షీణించి 25.24 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.1,600కోట్లు) నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం 42 కోట్ల డాలర్లుగా ఉంది. ఆదాయం మాత్రం కంపెనీ అంచనాలకు అనుగుణంగానే 9.2 శాతం వృద్ధి చెంది 3.08 బిలియన్ డాలర్ల నుంచి 3.36 బిలియన్ డాలర్లకు చేరుకుంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయం 3.43-3.47 బిలియన్ డాలర్లుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే, పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2016 జనవరి - డిసెంబర్) ఆదాయ అంచనాలను మరోసారి తగ్గించింది. 13.47-13.60 బిలియన్ డాలర్ల మధ్య ఉండవచ్చని (8.4-9.5 శాతం వృద్ధి) ప్రకటించింది. 2015లో కంపెనీ ఆదాయ వృద్ధి 21 శాతంగా ఉండటం గమనార్హం. ఐటీ రంగం ఎదుర్కొంటున్న స్థూల ఆర్థిక సవాళ్లే ఇందుకు కారణమని కంపెనీ ప్రస్తావించింది. నిజానికి ఈ ఏడాది ప్రారంభంలో 13.65-14.20 బిలియన్ డాలర్ల మధ్య ఆదాయం ఉండవచ్చని కాగ్నిజెంట్ ప్రకటించగా... తర్వాత 13.65 నుంచి 14 బిలియన్ డాలర్లకు తగ్గించింది. సమీక్షా కాలంలో కాగ్నిజెంట్ 11,300 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.44 లక్షలకు చేరుకుంది. -
రంగారెడ్డి జిల్లాలో కాగ్నిజెంట్ సెజ్ కు ఓకే
కొత్తగా 4 సెజ్‌లకు అనుమతులు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా మరో నాలుగు ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. వీటిలో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సర్వీసెస్, సాల్టైర్ డెవలపర్స్, అమీన్ ప్రాపర్టీస్ సెజ్‌లు ఉన్నాయి. కాగ్నిజెంట్ టెక్నాలజీస్ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో దాదాపు 2.51 హెక్టార్లలో ఐటీ/ఐటీఈఎస్ జోన్ ఏర్పాటు చేయనుంది. ఇన్ఫోసిస్ మొహాలీలో దాదాపు 20.23 హెక్టార్లలో ఐటీ/ఐటీఈఎస్ సెజ్‌ను నెలకొల్పనుంది. మరోవైపు, 12 మంది డెవలపర్ల ప్రాజెక్టుల అమలుకు మరికాస్త సమయం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా సారథ్యంలోని బోర్డ్ ఆఫ్ అప్రూవల్ (బీవోఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. -
కాగ్నిజంట్ తెలంగాణ సెజ్‌పై 23న నిర్ణయం
న్యూఢిల్లీ: కాగ్నిజంట్ టెక్నాలజీస్ తెలంగాణలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక ఆర్థిక మండలి (స్పెషల్ ఎకనామిక్ జోన్-సెజ్) ప్రతిపాదనను ప్రభుత్వం ఈ నెల 23న పరిశీలించనున్నది. దీంతో పాటు మరో మూడు కొత్త సెజ్ ప్రతిపాదనలపై వాణిజ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోనున్నది. ఈ సమావేశంలో వాణిజ్య కార్యదర్శి రీటా తియోతియా అధ్యక్షతన జరిగే బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్(బీఓఏ) ఈ నాలుగు కొత్త ప్రతిపాదనలను పరిశీలించనున్నది. మొహాలీలో 20,23 హెక్టార్లలో ఇన్ఫోసిస్ కంపెనీ ఐటీ/ఐటీఈఎస్ సెజ్‌ను ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చింది. కాగ్నిజంట్, ఇన్ఫోసిస్‌లతో పాటు సాల్టైర్ డెవలపర్స్, అమిన్ ప్రొపర్టీస్ ప్రతిపాదనలను కూడా బీఓఏ పరిశీలించనున్నది. ప్రాజెక్టుల అమలుకు మరింత గడువు కావాలని కోరే 12 సెజ్ ప్రతిపాదనలపై కూడా బీఓఏ చర్చించనున్నది. వీటిల్లో మహీంద్రా వరల్డ్ సిటీ(జైపూర్), జైడస్ టెక్నాలజీస్ తదితర సంస్థల ప్రతిపాదనలు ఉన్నాయి.