ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) రెండో త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. అంతేకాకుండా కోవిడ్-19 నేపథ్యంలో 2020 పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాల(గైడెన్స్)ను సైతం కుదించింది. క్యూ2(ఏప్రిల్-జూన్)లో కంపెనీ నికర లాభం 29 శాతం క్షీణించి 36.1 కోట్ల డాలర్లకు పరిమితమైంది. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 3.4 శాతం తక్కువగా 4 బిలియన్ డాలర్లకు చేరింది. కరోనా వైరస్‌తోపాటు ఇతర రాన్సమ్‌వేర్ సమస్యలతో క్యూ2 పనితీరు బలహీనపడినట్లు కంపెనీ పేర్కొంది.
జాన్ సిగ్మండ్
సెప్టెంబర్ 1 నుంచి కంపెనీ సీఎఫ్‌వోగా జాన్ సిగ్మండ్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు కాగ్నిజెంట్ టెక్నాలజీస్ తాజాగా వెల్లడించింది. ప్రస్తుత సీఎఫ్‌వో కరెన్ మెక్‌లాఫ్లిన్ ఆగస్ట్ చివరివరకూ పదవిలో కొనసాగుతారని, తదుపరి కంపెనీ సలహాదారుగా సేవలందిస్తారని తెలియజేసింది. 17ఏళ్లపాటు సేవలు అందించిన కరెన్ పదవీ విరమణ చేయనున్నట్లు తెలియజేసింది. సిగ్మండ్ ఇటీవల ఆటోమాటిక్ డేటా ప్రాసెసింగ్ కంపెనీకి సీఎఫ్‌వోగా వ్యవహరించారు. కాగా.. కాగ్నిజెంట్ ఇండియా కంట్రీ ఎండీగా వ్యవహరించిన రామ్‌కుమార్ రమణమూర్తి, గ్లోబల్ డెలివరీ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రదీప్ షిలీజీ ఇటీవల కంపెనీ నుంచి వైదొలగిన విషయం విదితమే.
2-0.5 శాతం డౌన్
2020 పూర్తి ఏడాదిలో కంపెనీ ఆదాయం 16.4-16.7 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదుకావచ్చని కాగ్నిజెంట్ తాజాగా అంచనా వేసింది. ఇది 2-0.5 శాతం క్షీణతకాగా.. కొన్ని కంటెంట్ సంబంధ సర్వీసుల నుంచి వైదొలగడం వల్ల 1.1 శాతంమేర మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడవచ్చని పేర్కొంది. విదేశీ మారక ప్రభావం సైతం 0.2 శాతంమేర ప్రతిఫలించవచ్చని అభిప్రాయపడింది. నిర్వహణ మార్జిన్లు 15.1 శాతం నుంచి 14.1 శాతానికి నీరసించాయి.
డిజిటల్ జోరు
మొత్తం ఆదాయంలో డిజిటల్ విభాగం వాటా పెరుగుతున్నట్లు కాగ్నిజెంట్ తెలియజేసింది. క్యూ2లో 14 శాతం వృద్ధి చూపగా.. మొత్తం ఆదాయంలో 42 శాతం వాటాను ఆక్రమించినట్లు వివరించింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 50 శాతం అధికంగా బుకింగ్స్ సాధించినట్లు తెలియజేసింది. ఇందుకు డిజిటల్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విభాగాలు ప్రధానంగా సహకరించినట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment