న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఈ ఏడాది(2022) దేశీయంగా 50,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఆఫర్ చేయనుంది. కంపెనీ తొలి క్వార్టర్(జనవరి–మార్చి) ఫలితాలు విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఏడాది 20 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించగలమని అంచనా వేసింది. క్యూ1లో నికర లాభం 11 శాతంపైగా బలపడి 56.3 కోట్ల డాలర్లను తాకింది. 2021 క్యూ1లో 50.5 కోట్ల డాలర్లు మాత్రమే ఆర్జించింది.
ఇందుకు ప్రధానంగా డిజిటల్ విభాగం వృద్ధి సహకరించినట్లు కాగ్నిజెంట్ పేర్కొంది. కంపెనీ కేలండర్ ఏడాదిని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. క్యూ1లో మొత్తం ఆదాయం 10 శాతం పుంజుకుని 4.82 బిలియన్ డాలర్లకు చేరింది. యూఎస్ కేంద్రంగా ఐటీ సేవలందించే కంపెనీ ఉద్యోగుల్లో 70 శాతం మంది దేశీయంగా విధులు నిర్వహించే సంగతి తెలిసిందే.
20 బిలియన్ డాలర్లకు: సవరించిన అంచనాల ప్రకారం ఈ ఏడాది 19.8–20.2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకోగలమని కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంఫైర్స్ అభిప్రాయపడ్డారు. ఇది 9–11 శాతం వృద్ధికి సమానమని తెలియజేశారు. వెరసి తొలిసారి 20 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించే వీలున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment