ఆ మాత్రలు నాసిరకం.. జరభద్రం!
జలుబు చేస్తే మెడికల్ షాపు వద్దకు వెళ్లి డీకోల్డ్ టోటల్.. ఒళ్లు నొప్పులుగా ఉండే కాంబిఫ్లామ్ లాంటి మాత్రలు వేసుకోవడం చాలామందికి అలవాటు. అయితే, సామాన్య ప్రజల్లో కూడా ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ రెండు మాత్రలు ప్రమాణాలకు ఆమడదూరంలో ఉన్నాయని, పూర్తిగా నాసిరకం అని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) చెబుతోంది.కాంబిఫ్లామ్ మాత్రలను సనోఫి ఇండియా సంస్థ తయారు చేస్తుండగా, డీకోల్డ్ టోటల్‌ను రెకిట్ బెంకిజర్ హెల్త్‌కేర్ ఇండియా సంస్థ తయారు చేస్తోంది.
సీడీఎస్‌సీఓ సంస్థ పలు రకాల ఔషధాలను గత నెలలో పరిశీలించింది. వీటితో పాటు సిప్లా తయారు చేసే ఓఫ్లాక్స్-100 డీటీ, థియో ఆస్థలిన్ టాబ్లెట్లు, కాడిలా వాళ్లు తయారుచేసే కాడిలోస్ సొల్యూషన్ కూడా ప్రమాణాలకు దూరంగానే ఉన్నట్లు ఆ పరీక్షలలో తేలింది. వీటిలో ఆఫ్లాక్స్-100 డీటీ అనేది యాంటీబయాటిక్ కాగా, థియో ఆస్థలిన్ మందును శ్వాసకోశ సమస్యలకు వాడతారు. అజీర్ణ సమస్యకు పరిష్కారంగా కాడిలోస్ ఉపయోగిస్తారు. వీటితో పాటు మరో 55 మందుల విషయంలో కూడా సీడీఎస్‌సీఓ హెచ్చరించింది.