రికార్డు స్థాయి వాణిజ్య రియల్టీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2013లో రికార్డు స్థాయిలో వాణిజ్య రియల్టీ పెట్టుబడులు నమోదయ్యాయి. 2012తో పోల్చితే గత యేడాది ఈ పరిమాణం 29 శాతం వృద్ధితో రికార్డు స్థాయిలో 127 బిలియన్ డాలర్లకు చేరినట్లు ప్రముఖ గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ జోన్స్ ల్యాంగ్ లాసల్లీ (జేఎల్‌ఎల్) తన తాజా నివేదికలో తెలిపింది. ఆఫీస్ స్పేస్ డిమాండ్ తగ్గుతూ, 2009 నుంచి బలహీనంగా ఉన్నప్పటికీ విలువ రూపంలో మాత్రం పెట్టుబడులు 2013లో భారీగా నమోదయ్యాయి. తక్కువ రెంటల్స్, ఆకర్షణీయమైన విలువకు ఆఫీస్ స్పేస్‌ల లభ్యత వంటి అంశాల వల్ల మొత్తంగా క్రియాశీలత ‘బేస్’ పెరగడం దీనికి ఒక కారణమని కూడా జేఎల్‌ఎల్ ఇండియా హెడ్ అసుతోష్ లిమాయీ తెలిపారు.
ముఖ్యాంశాలు...
భారత్‌సహా చైనా, ఉత్తర ఆసియా, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియాల్లో 20 మార్కెట్లను ప్రాతిపదికగా తీసుకుని ‘ఆసియా పసిఫిక్ డెజైస్ట్ 2013 క్యూ4’ పేరుతో కన్సల్టెంట్ నివేదిక వెలువడింది.
ఇన్వెస్టర్ల క్రియాశీలత చాలా బాగుంది. అయితే వ్యయ పొదుపులపై దృష్టిపెట్టిన కార్పొరేట్లు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ఆఫీస్ స్పేస్ డిమాండ్ బలహీనంగా కొనసాగుతోంది.
చైనా, జపాన్, ఆస్ట్రేలియా మార్కెట్ల వాటా మొత్తం పెట్టుబడుల్లో 70 శాతం వరకూ ఉంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పటిష్టమయ్యే అవకాశాల వల్ల 2014లో వాణిజ్య రియల్టీ మార్కెట్ కొంత మెరుగుపడవచ్చు. దీనివల్ల స్వల్ప-మధ్యకాలికంగా ఇకపై ఆఫీస్ రెంటల్స్ పెరిగే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
భారత్ స్థితి బలహీనమే...
కాగా కమర్షియల్ రియల్టీ పెట్టుబడులకు సంబంధించి భారత్ పరిస్థితి బలహీనంగానే ఉందని అసుతోష్ లిమాయీ తెలిపారు. ఈ విలువ 10 బిలియన్ డాలర్లకన్నా తక్కువగానే ఉన్నట్లు వెల్లడించారు.