
నిర్మాణం ఆలస్యం ముక్కుపిండి పరిహారం!
సాక్షి, హైదరాబాద్: ‘‘కూకట్‌పల్లికి చేరువలో 2009లో ఒక ప్రాజెక్ట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేశా. మూడేళ్లలో పూర్తి కావాల్సిన ఫ్లాటు ఇంకా అప్పగించలేదు. కట్టిన రూ.30 లక్షలైనా వెనక్కి ఇవ్వండి మహాప్రభో అని మొత్తుకుంటున్నా పట్టించుకోవటం లేదు. మా కష్టార్జితాన్ని ఆ సంస్థ చేతిలో పోసి ప్రాధేయపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఫోను చేస్తే స్పందించరు.
ఆఫీసుకు వెళితే పట్టించుకోరు. ఆ కంపెనీ ప్రతినిధుల ప్రవర్తన చూస్తుంటే మేమే వారికి బకాయి ఉన్నట్టుంది. నిర్మాణం పూర్తవ్వడానికి ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి’’
.. ఇది ఓ కొనుగోలుదారుని ఆవేదన. మొన్నటికి మొన్న మేటాస్, ఏలియెన్స్ నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్ నిర్మాణాలను ఆలస్యం చేస్తున్నాయని పలువురు కొనుగోలుదారులు కోర్టుకెళ్లారు. ధర్నాలకు దిగిన సందర్భాలు కోకొల్లలు. ఈ విషయంలో కాస్త ముందుగా మేల్కొన్న ప్రజయ్ ఇంజనీర్‌స సంస్థ ప్రాజెక్ట్ ఆలస్యంపై కొనుగోలుదారులు, బ్యాంకర్లతో మూడు రోజుల పాటు సమావేశాన్ని నిర్వహించింది.
నిర్మాణ సంస్థలు చేసే ప్రచార ఆర్భాటాన్ని చూసి అది నిజమేనని నమ్మి.. లక్షల సొమ్ము వారి చేతిలో పోసి తెగ ఇబ్బంది పడుతున్నారు. అయితే నిర్మాణాలు ఆలస్యం కావడానికి బోలెడు కారణాలున్నాయని విశ్లేషించే నిపుణులు లేకపోలేదు. అమ్మకాల్లేకపోవడం, పెద్ద ప్రాజెక్ట్‌ల వద్ద నిధులు లేకపోవడం, కొనుగోలుదారులు సరైన సమయంలో డబ్బులు కట్టకపోవటం వంటివి ఇందుకు కారణాలు. దీంతో ఇంటి అద్దెలు, ఈఎంఐలు కట్టల్లేక ఇబ్బందులు పడుతున్నారు కొనుగోలుదారులు.
- ఫ్లాట్ల అప్పగింతలో జరుగుతోన్న ఆలస్యంపై పోరాడాలంటే.. ముందుగా కొనుగోలుదారులు తమ హక్కులేంటో తెలుసుకోవాలి. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 1882 ప్రకారం.. నిర్మాణం విషయంలో కానీ ైటె టిల్ విషయంలో కానీ, కొనుగోలుదారులు అడిగే ప్రతి ప్రశ్నకు అమ్మకందారుడు జవాబు చెప్పాల్సిందే. దానికి సంబంధించిన దస్తావేజులు అందజేయాల్సిందే. ఒకవేళ యాజమాన్యపు హక్కు విషయంలో తప్పులుంటే ముందే చెప్పాలి. అమ్మకపు పత్రాన్ని పక్కాగా సిద్ధం చేయాలి. చెప్పిన సమయానికి ఇళ్లను అప్పగించాలి. గడువులోగా డెవలపర్లు ఫ్లాట్లను అప్పగించకపోతే కొనుగోలుదారులు తక్షణమే తగిన చర్యలకు ఉపక్రమించవచ్చు.
- బుకింగ్ రద్దు చేసి సొమ్మును వాపసు తీసుకోవచ్చు. కాకపోతే, మన వద్ద ఇదో క్లిష్టమైన ప్రక్రియ. బుకింగ్ రద్దు చేసుకుంటే అధిక శాతం డెవలపర్లు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తారు. ఈ విషయంలో పారదర్శకతను పాటించే డెవలపర్లను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. మహా అయితే ఇంటి కోసం చెల్లించిన సొమ్ములో 15 శాతం సొమ్మును మినహాయించుకుంటారు.
- ఒకవేళ డెవలపర్ మరీ ఆలస్యం చేస్తుంటే.. కొనుగోలుదారులంతా ఓ సంఘంగా ఏర్పడి.. ఫ్లాట్లను అందించాలని ఒత్తిడి చేయండి. ఏయే పనులు అసంపూర్తిగా ఉన్నాయో గుర్తించి వాటిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్న అంశంపై డెవలపర్‌తో చర్చించాలి. కొందరు డెవలపర్లు వీలైనం తవరకూ కొనుగోలుదారులకు సహాయం చేయడానికే ప్రయత్నిస్తారు. అలాంటి వారికి కాస్త గడువివ్వండి. కొన్నవారంటే లెక్కలేకుండా ప్రవర్తించేవారిని కోర్టు కీడ్చి పరిహారం రాబట్టి.. తగిన బుద్ధి చెప్పండి.
కస్టమర్ల నమ్మకాన్ని వమ్ము చేయం
‘‘రాష్ట్రం విడిపోయాక పెట్టుబడుల ప్రవాహం చాలా వరకు మందగించింది. రేట్లు తగ్గుతాయేమోనని, వేరే ప్రాంతాల్లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలొస్తాయని వంటి రకరకాల కారణాలతో కస్టమర్లు సకాలంలో డబ్బులు కట్టలేదు. మరోవైపు బ్యాంకులు లోన్లు మంజూరు చేయటంలో జాప్యం చేస్తుండటంతో మరింత ఇబ్బందులెదురయ్యాయని’’ ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్ సీఎండీ విజయ్‌సేన్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు.
- పాతికేళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్నాం. అందుబాటు ధరల్లో ప్రజల సొంతింటి కలను సాకారం చేయటమే లక్ష్యంగా వందల ప్రాజెక్ట్‌లు నిర్మించాం. ప్రతికూల సమయంలోనూ నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారులకు అందించిన ఘనత ప్రజయ్‌ది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి నడుం బిగించింది. దీంతో మార్కెట్‌లో పూర్వ వైభవం రానుంది. ప్రజయ్‌లో పెట్టుబడులు పెట్టిన ఏ ఒక్క కస్టమర్ నమ్మకాన్ని వమ్ము చేయం.
- కేపీహెచ్‌బీ 9 ఫేజ్‌లో 21.5 ఎకరాల్లో ప్రజయ్ మెగాపొలిస్‌ను నిర్మిస్తున్నాం. ఫేజ్-1లో 9 ఎకరాల్లో మొత్తం 1,113 ఫ్లాట్లొస్తాయి. ఇందులో 850 ఫ్లాట్లు బుక్ అయ్యాయి. కానీ, దాదాపు 650 మంది కస్టమర్లు పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించలేదు. వీరి దగ్గరి నుంచి రావాల్సిన సుమారు రూ.40 కోట్లు ఆగిపోయాయి. పైగా బ్యాంకుకు ఈనెలాఖరులోగా రూ.23 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో నిర్మాణ పనుల వేగం మందగించింది. ఒకవైపు కొనుగోలుదారుల నుంచి డబ్బులు రాక.. బ్యాంకులు లోన్లివ్వక ఇరకాటంలో పడ్డాం.
- నిర్మాణం వేగవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో నిపుణులను అందుబాటులో ఉంచాం. అవసరమైన నిర్మాణ సామగ్రిని పెద్ద మొత్తంలోనే కొనుగోలు చేశాం. ఎట్టిపరిస్థితుల్లోనూ కొనుగోలుదారులకు ఈ ఏడాది చివరి నాటికి ఫ్లాట్లనందిస్తాం. నిర్మాణంలో నాణ్యత ఏమాత్రం తగ్గనివ్వం కూడా.