ద్వితీయ శ్రేణికీ బ్యూటీ, వెల్‌నెస్‌ సేవలు! | Cosmetic nutrition is top | Sakshi
Sakshi News home page

ద్వితీయ శ్రేణికీ బ్యూటీ, వెల్‌నెస్‌ సేవలు!

Published Sat, Mar 3 2018 12:46 AM | Last Updated on Sat, Mar 3 2018 12:46 AM

Cosmetic nutrition is top - Sakshi

నాగేశ్

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇపుడు సౌందర్య పోషణ అనేది ఎగువ తరగతికే కాదు!! మధ్య తరగతికి... ఇంకా చెప్పాలంటే దిగువ మధ్య తరగతికీ విస్తరిస్తోంది. మెట్రో నగరాల నుంచి ద్వితీయ శ్రేణి పట్టణాలకూ పాకింది. కాకపోతే ఎక్కడికక్కడ సెలూన్లు, వెల్‌నెస్‌ సెంటర్లు విడి విడిగానే ఉంటున్నాయి. చెయిన్లు నిర్వహించేవన్నీ పెద్ద పెద్ద సంస్థలే!! వారి ఫ్రాంఛైజీ అంటే మాటలు కాదు!. ఇదిగో... సరిగ్గా ఈ అంశమే తమను ‘వసుంధర సెలూన్స్‌’ ఏర్పాటు చేయటానికి పురి గొల్పిందంటారు నాగేశ్, అరుణ కుమారి. దిగువ మధ్య తరగతి మహిళలనూ సహ యజమానులుగా చేస్తూ ఆరంభించిన తమ స్టార్టప్‌ గురించి మరిన్ని వివరాలు వారి మాటల్లోనే...

‘‘ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ వ్యవస్థీకృతమైన బ్యూటీ, వెల్‌నెస్‌ సేవలందించాలన్నదే మా ఉద్దేశం. దీనికోసమే డాజిల్‌ సెలూన్‌ అండ్‌ స్పా ప్రై.లి, వసుంధర బ్యూటీ అండ్‌ స్పా పేరిట రెండు బ్రాండ్లను మార్కెట్‌కు పరిచయం చేశాం. వసుంధర బ్రాండ్‌ పూర్తిగా మహిళల కోసమే. నేను అమెరికాలో పలు కంపెనీల్లో పని చేసి 2007లో ఇండియాకు తిరిగొచ్చా. ఇక్కడ పలు బ్యూటీ అండ్‌ వెల్‌నెస్‌ కంపెనీలకు ఈఆర్పీ వంటి ఐటీ సొల్యూషన్స్‌ అందించేవాణ్ణి. అప్పుడే సొంతంగా బ్యూటీ సెలూన్‌ పెట్టాలని నిర్ణయించుకొని 2012లో డాజిల్‌ సెలూన్స్‌ను ప్రారంభించాం. మహిళలకు హెయిర్‌ వాష్, ఫేషియల్, బాడీ మసాజ్‌ వంటి ఇతరత్రా బ్యూటీ సేవలందిస్తున్నాం. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో బ్యూటీ సేవలు, అది కూడా అందుబాటు ధరలకు అందించడమే వసుంధర లక్ష్యం. ప్రస్తుతం విశాఖపట్నం, రాజమండ్రి, భీమవరం, కాకినాడ, హైదరాబాద్‌లలో 8 బ్రాంచీలున్నాయి. వచ్చే మూడేళ్లలో 100 బ్రాంచీలకు చేర్చడం లక్ష్యం. మూడు నెలల్లో కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్‌ జిల్లాల్లో సెలూన్లను ప్రారంభించనున్నాం. 
ఆయిల్స్, క్రీములు ఇతరత్రా బ్యూటీ ఉత్పత్తులను ముంబై నుంచి తెస్తాం. శ్రీలంక నుంచి ప్రత్యేకంగా ఆయుర్వేద ఫేషియల్‌ ఆయిల్స్‌లను దిగుమతి చేసుకుంటున్నాం.

విదేశీ ఉత్పత్తులు వినియోగిస్తున్నప్పటికీ స్థానిక సెలూన్లతో పోలిస్తే మా దాంట్లో ధర 30–40 శాతం తక్కువే ఉంటుంది. హైదరాబాద్‌లో మహిళలకు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాం. ప్రస్తుతానికైతే వసుంధరలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే శిక్షణ ఇస్తున్నాం. త్వరలోనే ఈ సేవలను విస్తరిస్తాం. వసుంధర సెలూన్ల ఏర్పాటుతో ఔత్సాహిక మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నాం. పెట్టుబడుల కోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో (బీఓబీ) ఒప్పందం చేసుకున్నాం. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.30 లక్షల వరకు ముద్ర రుణాలను మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం మా సంస్థలో 52 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు రూ.1.5 కోట్ల పెట్టుబడులు పెట్టాం. విస్తరణ, బ్రాండింగ్‌ కోసం రూ.4.5 కోట్ల పెట్టుబడులు అవసరం. 60 శాతం నిధుల కోసం బీఓబీతో చర్చలు జరిపాం. ఏడాదిలో నిధులను సమీకరిస్తాం’’ అని నాగేశ్, అరుణ కుమారి ధీమా వ్యక్తంచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement