Cosmetic nutrition
-
మునగ చెట్టు ఎక్కండి
►మునక్కాడలతో రుచికరమైన వంటకాలు చేసుకుంటాం. అలాగే మనగ ఆకులు, గింజల్లోనూ పోషకాలు ఉన్నాయి. ఈ శక్తివంతమైన మునగ సౌందర్య పోషణ లో మెరుగైన ఫలితాలను ఇస్తుంది. మునగ ఆకు పొడి ముఖచర్మం ముడతలు తగ్గడానికి బాగా పనిచేస్తుంది. యవ్వనకాంతిని తీసుకురావడంలో సహాయపడతుంది. మునగ ఆకు పొడిలో రోజ్‌వాటర్ కలిపి నల్ల మచ్చలు, యాక్నె అయిన చోట రాయాలి. ఆరిన తర్వాత శుభ్రపరచాలి. మచ్చలు, మొటిమలు, యాక్నె సమస్య తగ్గుతుంది. ►అర టీ స్పూన్ మునగ ఆకు పొడి, టేబుల్ స్పూన్ తేనె, రోజ్ వాటర్ సగం టేబుల్ స్పూన్, తగినన్ని నీళ్లు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, పది నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. శుభ్రమైన టవల్‌తో తుడిచి, కొద్దిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీని వల్ల చర్మం మృదుత్వం, కాంతిమంతం అవుతుంది. ►కప్పు కొబ్బరి పాలు, టేబుల్ స్పూన్ మునగ ఆకు పొడి, టీ స్పూన్ తేనె తీసుకోవాలి. కొబ్బరి పాలను ఒక గిన్నెలో పోసి సన్నని మంట మీద రెండు నిమిషాలు వేడి చేయాలి. మంట తీసేసి పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ గిన్నెలో మునగ ఆకు, తెనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, షవర్ క్యాప్ వేయాలి. పది నిమిషాలు వదిలేసి తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే శిరోజాలకు తగినంత మాయిశ్చరైజర్ అంది జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. -
ద్వితీయ శ్రేణికీ బ్యూటీ, వెల్నెస్ సేవలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇపుడు సౌందర్య పోషణ అనేది ఎగువ తరగతికే కాదు!! మధ్య తరగతికి... ఇంకా చెప్పాలంటే దిగువ మధ్య తరగతికీ విస్తరిస్తోంది. మెట్రో నగరాల నుంచి ద్వితీయ శ్రేణి పట్టణాలకూ పాకింది. కాకపోతే ఎక్కడికక్కడ సెలూన్లు, వెల్నెస్ సెంటర్లు విడి విడిగానే ఉంటున్నాయి. చెయిన్లు నిర్వహించేవన్నీ పెద్ద పెద్ద సంస్థలే!! వారి ఫ్రాంఛైజీ అంటే మాటలు కాదు!. ఇదిగో... సరిగ్గా ఈ అంశమే తమను ‘వసుంధర సెలూన్స్’ ఏర్పాటు చేయటానికి పురి గొల్పిందంటారు నాగేశ్, అరుణ కుమారి. దిగువ మధ్య తరగతి మహిళలనూ సహ యజమానులుగా చేస్తూ ఆరంభించిన తమ స్టార్టప్ గురించి మరిన్ని వివరాలు వారి మాటల్లోనే... ‘‘ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ వ్యవస్థీకృతమైన బ్యూటీ, వెల్నెస్ సేవలందించాలన్నదే మా ఉద్దేశం. దీనికోసమే డాజిల్ సెలూన్ అండ్ స్పా ప్రై.లి, వసుంధర బ్యూటీ అండ్ స్పా పేరిట రెండు బ్రాండ్లను మార్కెట్‌కు పరిచయం చేశాం. వసుంధర బ్రాండ్ పూర్తిగా మహిళల కోసమే. నేను అమెరికాలో పలు కంపెనీల్లో పని చేసి 2007లో ఇండియాకు తిరిగొచ్చా. ఇక్కడ పలు బ్యూటీ అండ్ వెల్నెస్ కంపెనీలకు ఈఆర్పీ వంటి ఐటీ సొల్యూషన్స్ అందించేవాణ్ణి. అప్పుడే సొంతంగా బ్యూటీ సెలూన్ పెట్టాలని నిర్ణయించుకొని 2012లో డాజిల్ సెలూన్స్‌ను ప్రారంభించాం. మహిళలకు హెయిర్ వాష్, ఫేషియల్, బాడీ మసాజ్ వంటి ఇతరత్రా బ్యూటీ సేవలందిస్తున్నాం. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో బ్యూటీ సేవలు, అది కూడా అందుబాటు ధరలకు అందించడమే వసుంధర లక్ష్యం. ప్రస్తుతం విశాఖపట్నం, రాజమండ్రి, భీమవరం, కాకినాడ, హైదరాబాద్‌లలో 8 బ్రాంచీలున్నాయి. వచ్చే మూడేళ్లలో 100 బ్రాంచీలకు చేర్చడం లక్ష్యం. మూడు నెలల్లో కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో సెలూన్లను ప్రారంభించనున్నాం. ఆయిల్స్, క్రీములు ఇతరత్రా బ్యూటీ ఉత్పత్తులను ముంబై నుంచి తెస్తాం. శ్రీలంక నుంచి ప్రత్యేకంగా ఆయుర్వేద ఫేషియల్ ఆయిల్స్‌లను దిగుమతి చేసుకుంటున్నాం. విదేశీ ఉత్పత్తులు వినియోగిస్తున్నప్పటికీ స్థానిక సెలూన్లతో పోలిస్తే మా దాంట్లో ధర 30–40 శాతం తక్కువే ఉంటుంది. హైదరాబాద్‌లో మహిళలకు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాం. ప్రస్తుతానికైతే వసుంధరలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే శిక్షణ ఇస్తున్నాం. త్వరలోనే ఈ సేవలను విస్తరిస్తాం. వసుంధర సెలూన్ల ఏర్పాటుతో ఔత్సాహిక మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నాం. పెట్టుబడుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడాతో (బీఓబీ) ఒప్పందం చేసుకున్నాం. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.30 లక్షల వరకు ముద్ర రుణాలను మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం మా సంస్థలో 52 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు రూ.1.5 కోట్ల పెట్టుబడులు పెట్టాం. విస్తరణ, బ్రాండింగ్ కోసం రూ.4.5 కోట్ల పెట్టుబడులు అవసరం. 60 శాతం నిధుల కోసం బీఓబీతో చర్చలు జరిపాం. ఏడాదిలో నిధులను సమీకరిస్తాం’’ అని నాగేశ్, అరుణ కుమారి ధీమా వ్యక్తంచేశారు. -
గోరంత పోషణ
బ్యూటిప్స్ గోళ్లు పొడిబారకూడదు: గోరు పొడిబారడం అనేది దేహారోగ్యం మీద, సౌందర్య పోషణ మీద ఆధారపడి ఉంటుంది. దేహంలో అన్ని రకాల పోషకాలు సమతులంగా ఉంటే గోరు ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. అయితే ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే... కొందరిలో చేసే పనుల రీత్యా గోళ్లు పొడిబారుతుంటాయి. అలాంటప్పుడు... రోజూ ఉదయం, రాత్రి గోళ్ల మీద ఒక చుక్క ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వేసి మునివేళ్లతో గోళ్లను వలయాకారంగా మర్దనా చేయాలి. గాయాలను నిర్లక్ష్యం చేయకూడదు: గోళ్లకు సౌందర్య పోషణతోపాటు గోళ్లు, చిగుళ్ల గాయాలకు చికిత్స కూడా చాలా అవసరం. గోళ్లు కత్తిరించేటప్పుడు కానీ మరే ఇతర కారణాలతోనైనా గోరు చిగురు దగ్గర చీలిపోతుంది. దానికి తేనె చక్కటి ఔషధం. గాయాన్ని కడిగి, తడి తుడిచిన తర్వాత అరచేతిలో నాలుగు చుక్కల తేనె వేసుకుని గాయానికి పట్టించాలి. ఇలా ఇరవై నిమిషాల పాటు గాయానికి తేనె తగులుతూ ఉంటే ఇక గాయానికి ఇన్ఫెక్షన్ చేరదు. గోళ్లు విరిగిపోతుంటే: గోళ్లు గరుకుగా మారిపోవడం, పెళుసుబారి మధ్యలో విరిగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే... నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి అందులో గోళ్లను ముంచాలి. అలాగే 15 – 20 నిమిషాల సేపు ఉంచిన తర్వాత గోళ్లను నూనెలో నుంచి తీయాలి. కారుతున్న నూనెను మాత్రం తుడిచి గోళ్లను సబ్బుతో కడగకుండా అలాగే ఉంచాలి. ఒకటి– రెండు రోజులు నెయిల్ పాలిష్ వేయకుండా గోళ్లకు గాలి తగలనివ్వాలి. గోళ్లకు నొప్పి లేకపోయినప్పటికీ, అవి దేహంలో ప్రాణం ఉన్న ఇతర భాగాల వంటివే. కొద్దిగానైనా సరే వాటికి గాలి అందాలి, పోషకాలు అందాలి, రక్తప్రసరణ కావాలి, సంరక్షణ కావాలి.