సాక్షి, సిటీబ్యూరో: డిజిటల్ కరెన్సీలో భాగమైన క్రెడిట్‌కార్డుల క్లోనింగ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఒకప్పుడు స్థానిక లావాదేవీలు ఎక్కువగా జరుగుతుండగా... ఇటీవల కాలంలో అంతర్జాతీయ లావాదేవీలు పెరిగి పోయాయి. ‘చార్జ్ బ్యాక్’ సదుపాయం నేపథ్యంలో ఈ క్రైమ్ వల్ల ఆర్థిక నష్టం లేకపోయినా.. కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. డెబిట్‌కార్డులు క్లోనింగ్ బారిన పడవని, క్రెడిట్ కార్డులకు మాత్రం తప్పట్లేదని వివరిస్తున్నారు.
‘ప్రైవేట్’ డేటా లీక్...
దాదాపు ప్రతి బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల్ని జారీ చేస్తూ ఉంటుంది. ఖాతాలో ఉన్న మొత్తాన్ని వినియోగించుకోవడానికి డెబిట్, అప్పుగా వినియోగించుకుని ఆపై చెల్లించడానికి క్రెడిట్‌కార్డులు ఉపకరిస్తాయి. డెబిట్‌కార్డుల తయారీ, నిర్వహణ, జారీ మొత్తం బ్యాంకు ఆదీనంలోనే జరుగుతుంది. అయితే క్రెడిట్‌కార్డులకు సంబంధించింది మాత్రం ఆయా బ్యాంకులు ఔట్‌సోర్సింగ్ లేదా ఒప్పంద ప్రాతిపదికన ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నాయి. ఇక్కడే సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తున్న డేటా అంతర్జాతీలం ద్వారా అమ్ముడైపోతోంది. ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉండటంతో పాటు అంతర్జాతీయ లావాదేవీలకు అవకాశం ఉండటంతోనే ఈ డేటాకు డిమాండ్ పెరిగింది. అయితే ఇది నేరుగా కాకుండా ఆన్‌లైన్ అధోజగత్తుగా పిలిచే డార్క్ నెట్ నుంచి క్రయవిక్రయాలు సాగుతున్నాయి.
దానికి అంతా ప్రత్యేకం...
కంప్యూటర్లలో వినియోగించే విండోస్ ఆపరేటింగ్ సిస్టం, వివిధ చిరునామాలతో ఇంటర్‌నెట్‌లో ఉండే వెబ్‌సైట్లు అందరికీ తెలిసినవే. ఇటీవల కాలంలో అనేక ఈ–కామర్స్ వెబ్‌సైట్లు అందుబాటులోకి వచి్చ, అగ్గిపెట్టె నుంచి ఆడి కారు వరకు క్రయవిక్రయాలను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చాయి. వీటి ద్వారా క్రెడిట్‌కార్డుల డేటా వంటివి విక్రయానికి పెడితే పోలీసు, నిఘా వర్గాలు గుర్తించి పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి నిఘాకు చిక్కకుండా, ‘తమ వినియోగదారుల’ మినహా మిగిలిన వారికి కనిపించకుండా అంతర్జాతీయ ముఠాలు ఇంటర్‌నెట్‌లోని అండర్ వరల్డ్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. దీన్ని సాంకేతికంగా ‘డీప్ వెబ్’, ‘అండర్‌గ్రౌండ్ వెబ్’, ‘డార్క్ వెబ్’ అని పిలుస్తారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ డీప్ వెబ్‌లోకి చొరబడటం సాధ్యం కాదు. దీనిని టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టంను ఇన్‌స్టల్ చేసుకోవాలి. దీంతో పాటే టోర్స్ అనే ఆపరేటింగ్ సిస్టం సైతం ఇన్‌స్టల్ అవుతుంది. ఇలా డీప్ వెబ్‌లోని వెబ్‌సైట్లలో ఉన్న డేటాను బిట్‌కాయిన్స్ ద్వారా చెల్లించి సొంతం చేసుకునే ముఠాలు అనేకం ఉన్నాయి.
కంప్యూటర్లతో అనుసంధానించి...
ఇలా తమ చేతికి వస్తున్న డేటాను సైబర్ నేరగాళ్ళు తమ కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఆపై ప్రత్యేకమైన కార్డ్ రైటర్స్‌ను ఈ కంప్యూటర్లకు అనుసంధానిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారానే వీళ్ళు యాగ్నెటిక్ స్ట్రిప్, చిప్‌లతో కూడిన ఖాళీ కార్డులు ఖరీదు చేస్తున్నారు. వీటిని రైటర్స్‌లో పెట్టడం ద్వారా అప్పటికే డార్క్ వెబ్ నుంచి ఖరీదు చేసిన డేటాను ఖాళీ కార్డుల్లోకి పంపిస్తున్నారు. అంటే వినియోగదారుడి క్రెడిట్‌కార్డు అతడి వద్దే ఉన్నా... నకలు దుండగుడి వద్ద తయారైపోతోంది. దీన్నే సాంకేతిక పరిభాషలో క్లోనింగ్ అంటారు. ఇలా భారతీయులకు చెందిన క్రెడిట్‌కార్డుల్ని పోలిన వాటికి క్లోన్డ్ వెర్షన్స్ విదేశీయులు తయారు చేసి తమ వద్ద ఉంచుకుంటున్నారు. ఈ కార్డులను వినియోగించి స్వయంగా షాపింగ్ చేసేవాళ్ళు కొందరైతే... కమీషన్ పద్దతిలో ఇతరుల షాపింగ్స్‌కు డబ్బులు కట్టేవాళ్ళు మరికొందరు ఉంటున్నారు. ఇక్కడ మాదిరిగా విదేశాల్లో క్రెడిట్‌కార్డ్ వినియోగిస్తూ పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకపోవడం వీరికి కలిసి వస్తోంది. ఆ షాపింగ్‌కు సంబంధించిన సందేశం, బిల్లులు మాత్రం ఇక్కడి అసలు వినియోగదారులకి వస్తున్నాయి.
సర్వర్లను కనిపెట్టడమూ అసాధ్యమే
క్రెడిట్, డెబిట్ కార్డుల ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన ఫిర్యాదులు నెలకు 15 నుంచి 20 వరకు వస్తున్నాయి. బ్యాంకుల వారికి లేఖలు రాయడం ద్వారా చార్జ్‌బ్యాక్ విధానంలో ఆ డబ్బును కార్డు వినియోగదారుడి ఖాతాలోకి తిరిగి పంపించేలా చేస్తున్నాం. అయితే డేటాను దుర్వినియోగం చేస్తున్న ‘డీప్ వెబ్’కు సంబంధించిన సర్వర్లు, వాటి చిరునామాలతో పాటు నిర్వహిస్తున్న వారి వివరాలూ బయటకు తెలిసే అవకాశాలు లేవు. ఇదే సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తున్న అంశంగా మారిపోయింది. ఈ ఇంటర్నేషనల్ క్లోనింగ్ బారినడపకుండా ఉండాలంటే మీ కార్డుల్లో ఇంటర్నేషనల్ లావాదేవీలు చేసే అంశాన్ని డిసేబుల్ చేసుకోండి.
– కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సిటీ సైబర్ క్రైమ్ ఠాణా
Comments
Please login to add a commentAdd a comment